jayram
-
ఖాకీ మార్కు కేసు!
సాక్షి, సిటీబ్యూరో: జయరామ్ హత్య కేసులో పాత్ర... అవినీతి ఆరోపణలు, ఏసీబీ ట్రాప్‌లు... ఇలా వరుసగా వివాదాల్లో నిలుస్తున్న పోలీసులకు సంబంధించిన మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య ఉన్న వివాదాల్లో తలదూర్చిన పేట్ బషీరాబాద్ పోలీసులు ఓ దళిత యువకుడిని పావుగా మార్చారు. ఏ ఆయుధం వినియోగించకపోయినా అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తనను నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించడమే కాకుండా ఫిర్యాదుదారుడి సమక్షంలోనే ఇంటరాగేషన్ చేశారని ఆరోపిస్తూ బాధిత యువకుడు సోమవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాడు. ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలను సమర్పించాడు. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కమీషన్ విషయంలో తేడా రావడంతో... కొత్తపేటకు చెందిన బి.సురేష్‌కుమార్ గతంలో కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆపై తన వ్యవహారశైలి మార్చుకుని రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారాడు. ఇతడికి 2015లో రియల్టర్ విశ్వప్రసాద్రెడ్డితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల క్రితం సురేష్ చేగుంట గ్రామంలోని 100 ఎకరాల భూమిని ప్రసాద్‌రెడ్డికి చూపించాడు. ఆ తర్వాత సదరు భూమిని నేరుగా ఖరీదు చేసిన ప్రసాద్‌రెడ్డి సురేష్‌కు కమీషన్ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అతడికి సురేష్‌కు మధ్య వివాదం రేగింది. సురేష్ పలుమార్లు విశ్వప్రసాద్‌రెడ్డిని కలిసి తన కమీషన్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. ఓ దశలో తాను తీవ్రంగా నష్టపోయానని, అనుమానం ఉంటే తన మాజీ భాగస్వామి కె.వేణుగోపాల్‌రెడ్డిని అడగాలంటూ సురేష్‌కు చెప్పాడు. దీంతో సురేష్ గత ఏడాది సెప్టెంబర్‌లో వేణుగోపాల్‌రెడ్డిని సంప్రదించి విషయం చెప్పాడు. తనకూ డబ్బు ఇవ్వాలన్న వేణుగోపాల్... సురేష్‌తో పరిచయం ఏర్పడటంతో వేణుగోపాల్ రెడ్డి తనకూ ప్రసాద్‌రెడ్డి నుంచి రూ.10 కోట్ల వరకు రావాల్సి ఉన్నట్లు చెప్పాడు. ప్రసాద్‌రెడ్డి ప్రస్తుతం మామూలుగా డబ్బు ఇవ్వడని, అతడి సోదరుడు రవి ప్రసాద్‌రెడ్డిని కిడ్నాప్ చేసి బెదిరిస్తేనే ఉపయోగం ఉంటుందని సూచించాడు. రవి ప్రసాద్‌రెడ్డి చిరునామా, ఫోన్ నెంబర్ సైతం సురేష్‌కు ఇచ్చిన వేణుగోపాల్ ఆ పని చేయాలని ప్రోత్సహించాడు. అయితే ప్రస్తుతం తాను నేరప్రవృత్తిని పూర్తిగా మానేశానని చెప్పిన సురేష్ వేణుగోపాల్ చెప్పింది చేసేందుకు నిరాకరించాడు. తాను చెప్పినట్లు చేయకుంటే క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తానంటూ సురేష్‌ను వేణుగోపాల్ బెదిరించాడు. సురేష్ ఫోన్లో ఆటోమాటిక్ కాల్ రికార్డర్ ఉండటంతో వేణుగోపాల్‌తో జరిపిన సంభాషణల్లో అనేకం రికార్డు అయ్యాయి. హఠాత్తుగా రంగంలోకి పోలీసులు... ఇదిలా ఉండగా గత ఏడాది అక్టోబర్ 3న సురేష్ ఇంటికి వచ్చిన పోలీసులు అతడిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి, వేణుగోపాల్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ట్లు తెలిపారు. ఏసీపీ అందె శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ మహేష్, ఎస్సై మహేష్ తనను నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించారని, విశ్వప్రసాద్‌రెడ్డి ప్రోద్భలంతోనే హత్యాయత్నానికి ఒడిగట్టినట్లు చెప్పాలని ఒత్తిడి చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. అలా చేస్తేనే తాము విశ్వప్రసాద్‌రెడ్డిని అరెస్టు చేయడం సాధ్యమై నీ డబ్బు తిరిగి వస్తుందని అన్నారని, వేణుగోపాల్‌రెడ్డిని ఎదురుగా కూర్చోబెట్టి తనపై పోలీసులు చేయి చేసుకున్నారని అతను పేర్కొన్నాడు. కిడ్నాప్ ప్లాన్ వేణుగోపాల్రెడ్డిదేనని తాను నిరాకరించానని చెప్పినా వారు పట్టించుకోలేదని తెలిపాడు. ఆయుధం లేకుండానే అరెస్టులు... సురేష్‌పై అక్టోబర్ 6న హత్యాయత్నం కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు అందులో మరికొందరితో కలిసి వేణుగోపాల్‌రెడ్డిపై రెక్కీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకుగాను ఏపీ 31 ఏఎం 0100 కారు వినియోగించారని ఆరోపించిన పోలీసులు దానిని రికవరీ చేయలేదు సరికదా మిగిలిన వారు ఎవరనేది గుర్తించలేదు. ఆయుధం, బాధితుడిపై గాయం... ఇలాంటివి ఏవీ లేకుండానే కుట్ర, హత్యాయత్నం ఆరోపణలపై అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటికి వచ్చిన సురేష్ సోమవారం తనకు జరిగిన అన్యాయంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. గతంలో నేరచరిత్ర ఉన్న వారికి మామూలుగా బతికే హక్కు లేదా? అని ప్రశ్నిస్తున్న సురేష్... ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. రియల్ ఎసేŠట్ట్ వ్యాపారుల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు తనను పావుగా మార్చారని ఆరోపిస్తున్నాడు. -
జయరామ్ హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్
-
రాకేష్ రెడ్ది వెనుక పెద్ద నేర చరిత్ర
-
తవ్వేకొద్ది బయటపడుతున్న రాకేశ్ అక్రమాల చిట్టా
జీడిమెట్ల/భాగ్యనగర్‌కాలనీ: ఆర్థిక లావాదేవీ నేపథ్యంలో హత్యకు గురైన జయరామ్ కేసులో రాకేష్‌రెడ్డి ప్రధాన నిందితుడని తేలడంతో కుత్బుల్లాపూర్‌లో కలకలం రేగింది. వివాదాస్పదుడిగా ముద్రపడిన రాకేష్ రెడ్డిపై గతంలో కూకట్పల్లి, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. టీడీపీ నాయకుల వెంట తిరుగుతూ అటు ఏపీ సీఎం చంద్రబాబు, అతడి తనయుడు లోకేష్ పేర్లు చెప్పుకుని హైదరాబాద్‌లో పలు సెటిల్మెంట్లకు పాల్పడినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలకు టికెట్లు ఇప్పించడం మొదలు, ప్రచారంలో సైతం అన్నీ తానై వ్యవహరించాడు. కుత్బుల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభల్లో ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో రాకేష్‌రెడ్డిని పొగడడం విశేషం. తల్లిదండ్రులపైనే దాడి.. తమ కుమారుడు ఇంటికి రావడం లేదని రాకేష్‌రెడ్డి తల్లిదండ్రులు పద్మ, శ్రీనివాస్‌రెడ్డి 2017 ఫిబ్రవరిలో అతని స్నేహితుడు రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేసి అడిగారు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన రాకేష్‌రెడ్డి తల్లిదండ్రులను అసభ్యంగా దూషించడమేగాక, దాడి చేయడంతో పాటు చంపుతానని బెదిరించాడు. దీంతో తమ కుమారుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని పద్మ, శ్రీనివాస్‌రెడ్డి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా 225/2017 నంబర్‌తో కేసు నమోదైంది. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని.... రాకేష్ రెడ్డి గతంలో కూకట్‌పల్లిలోనూ పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. చింతల్‌కు చెందిన చౌడవరం మహేష్ కుమార్‌తో కలిసి అతను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేరు చెప్పి సుమారు ఆరు ఇండస్ట్రీలు, గ్రీన్ బావార్చి హోటల్, వస్త్ర దుకాణాల్లో రూ. 12.55 లక్షలు వసూలు చేశాడు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనుచరుడిగా చెప్పుకుంటూ భాగ్యనగర్ కాలనీలోని గ్రీన్ బావార్చి రెస్టారెంట్ యజమానిని బెదిరించి రూ.30 వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఎమ్మెల్యేకు సమీప బంధువైన రెస్టారెంట్ యజమాని భాస్కర్‌రావు కృష్ణారావుకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపాడు. ఎమ్మెల్యే సూచనమేరకు భాస్కర్‌రావు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాకేష్ రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. -
కారులో ఉన్న అజ్ఞాత వ్యక్తే హత్యకు పాల్పడ్డాడా?
సాక్షి, అమరావతి బ్యూరో : వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ మృతిపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవర్, గన్‌మెన్ లేకుండా ఏ రోజూ ఒంటరిగా కారులో బయటకు వెళ్లని జయరామ్ బుధవారం తానే డ్రైవింగ్ చేసుకుంటూ కారులో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?.. జయరామ్ మృతి చెందడానికి ముందు ఆయనతో పాటు కారులో ఉన్నది ఎవరన్నది ఇప్పుడు కీలక అంశమైంది. హైదరబాద్‌లో ఉన్న ఆయన సమీప బంధువులపైనా అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. జయరామ్ భార్య, పిల్లలు ఆమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్న జయరామ్ ఫ్యాక్టరీ, బ్యాంకు కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం ఇంటి నుంచి ఒంటరిగా తానే స్వయంగా కారును నడుపుకుంటూ బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎవ్వరికీ ఫోన్లో అందుబాటులో లేకుండాపోయారు. ఆ తర్వాత గురువారం సాయంత్రం మాత్రం తాను విజయవాడ వస్తున్నానని బస చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వారికి సూచిస్తూ బెజవాడలో ఉన్న తన సిబ్బందికి ఫోన్ ద్వారా మేసేజ్ పంపించారు. తర్వాత ఆయన భార్యతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో ఏం మాట్లాడారు అన్న దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. విజయవాడలోని తన బస ఏర్పాట్ల గురించి పంపిన మేసేజ్ ఆయన ఫోన్ నుంచి వెళ్లిన లాస్ట్ మేసేజ్‌గా పోలీసులు గుర్తించారు. తరువాత కొద్ది గంటల్లోనే ఆయన అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డారు. కారులో ఉన్నదెవరు? నందిగామ సమీపంలోని కీసర టోల్గేట్, ఐతవరం సమీపంలో ఓ కార్లో జయరామ్ మృతదేహం లభ్యమైంది. శుక్రవారం తెల్లవారుజామున కారులోని మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇతర డాక్యుమెంట్లను పరిశీలించిన పోలీసులు కారులో ఉన్న మృతదేహం చిగురుపాటి జయరాందేనని గుర్తించారు. కార్లో వెనక సీట్లో రక్తపుమడుగులో ఉన్న జయరామ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆయన తలపై బలమైన గాయాలున్నాయేమోనని చూడగా.. తలపై ఎలాంటి గాయాలు లేనట్లు తేలింది. రోడ్డు ప్రమాదం జరిగిన దాఖలాలు కూడా అక్కడ కనిపించడం లేదు. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టోల్గేట్ల వద్ద సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా కారులో తెల్లదుస్తులు ధరించిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ కనిపించడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ కారులో ఉన్న అజ్ఞాత వ్యక్తే ఈ హత్యకు పాల్పడ్డాడా? లేదా అతనికి ఇంకెవరైనా సాయం చేశారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న డ్రైవర్‌ను కాదని.. తానే స్వయంగా కారును డ్రైవింగ్ చేసుకుంటూ బయటకు వచ్చిన జయరామ్ ఆ తర్వాత ఎక్కడెక్కడకు వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? అన్న విషయాలు బయటకొస్తేనే అసలు జయరామ్ హత్యకు కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మద్యంలో సైనెడ్ కలిపారా? దిండుతో ఊపిరాడకుండా చంపేశారా? జయరామ్ తలపై ఎలాంటి గాయాలు లేవని నిర్ధారించుకున్న పోలీసులు ఇది కచ్చితంగా హత్యనేనని తేల్చినట్లు తెలిసింది. ఎందుకంటే జయరామ్ చెవి, ముక్కు నుంచి రక్తం కారినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో జయరామ్‌ను ఏదైనా దిండులాంటి వస్తువుతో ఊపిరాడకుండా చేసి చంపేయడంతోనే అతని ముక్కు, చెవి వెంట రక్తం కారి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.లేదా కారులో ఉన్న మద్యం సీసాలను బట్టి అందులో సైనెడ్ కలిపి జయరామ్‌కు తాగించడం వల్ల కూడా అలా జరిగే అవకాశాలు లేకపోలేదని వారు అంటున్నారు. సమీప బంధువులపైనాసందేహాలు.. చిగురుపాటి హత్యకు హైదరాబాద్‌లోనే కుట్ర జరిగిందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్య కుట్రలో ఆయన బంధువుల పాత్ర ఏమైనా ఉందా? అన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జయరామ్ సమీప బంధువు, మేనకోడలు శిఖా చౌదరిని విచారణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
శోభనాన్ని అడ్డుకున్న పోలీసులు
ఏలూరు : హెచ్ఐవీతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన వ్యాధిని దాచిపెట్టి ఒక అమాయకురాలిని పెళ్లి చేసుకుని శోభనానికి సిద్ధపడ్డాడు. ఆ విషయం తెలిసిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పెనుగొండ మండలం నాగళ్లదిబ్బ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా హెచ్ఐవీతో బాధపడుతున్నాడు. అయినా వాస్తవాన్ని దాచిపెట్టి సోమరాజు చెరువు గ్రామానికి చెందిన ఒక యువతిని ఈ నెల 16న వివాహం చేసుకుని 18వ తేదీన(గురువారం)శోభనానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పెనుగొండ పోలీసులకు సమాచారం అందించి వారి సహాయంతో జయరామ్ ఇంటికి వెళ్లి శోభనాన్ని అడ్డుకుని నూతన వధువును కాపాడారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న వధువు బంధువులు అధికారులు, పోలీసులకు కృత జ్ఞతలు తెలిపారు.