సాక్షి, సిటీబ్యూరో: జయరామ్ హత్య కేసులో పాత్ర... అవినీతి ఆరోపణలు, ఏసీబీ ట్రాప్‌లు... ఇలా వరుసగా వివాదాల్లో నిలుస్తున్న పోలీసులకు సంబంధించిన మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య ఉన్న వివాదాల్లో తలదూర్చిన పేట్ బషీరాబాద్ పోలీసులు ఓ దళిత యువకుడిని పావుగా మార్చారు. ఏ ఆయుధం వినియోగించకపోయినా అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తనను నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించడమే కాకుండా ఫిర్యాదుదారుడి సమక్షంలోనే ఇంటరాగేషన్ చేశారని ఆరోపిస్తూ బాధిత యువకుడు సోమవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాడు. ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలను సమర్పించాడు. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
కమీషన్ విషయంలో తేడా రావడంతో...
కొత్తపేటకు చెందిన బి.సురేష్‌కుమార్ గతంలో కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆపై తన వ్యవహారశైలి మార్చుకుని రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారాడు. ఇతడికి 2015లో రియల్టర్ విశ్వప్రసాద్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల క్రితం సురేష్ చేగుంట గ్రామంలోని 100 ఎకరాల భూమిని ప్రసాద్‌రెడ్డికి చూపించాడు. ఆ తర్వాత సదరు భూమిని నేరుగా ఖరీదు చేసిన ప్రసాద్‌రెడ్డి సురేష్‌కు కమీషన్ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అతడికి సురేష్‌కు మధ్య వివాదం రేగింది. సురేష్ పలుమార్లు విశ్వప్రసాద్‌రెడ్డిని కలిసి తన కమీషన్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. ఓ దశలో తాను తీవ్రంగా నష్టపోయానని, అనుమానం ఉంటే తన మాజీ భాగస్వామి కె.వేణుగోపాల్‌రెడ్డిని అడగాలంటూ సురేష్‌కు చెప్పాడు. దీంతో సురేష్ గత ఏడాది సెప్టెంబర్‌లో వేణుగోపాల్‌రెడ్డిని సంప్రదించి విషయం చెప్పాడు.
తనకూ డబ్బు ఇవ్వాలన్న వేణుగోపాల్...
సురేష్‌తో పరిచయం ఏర్పడటంతో వేణుగోపాల్ రెడ్డి తనకూ ప్రసాద్‌రెడ్డి నుంచి రూ.10 కోట్ల వరకు రావాల్సి ఉన్నట్లు చెప్పాడు. ప్రసాద్‌రెడ్డి ప్రస్తుతం మామూలుగా డబ్బు ఇవ్వడని, అతడి సోదరుడు రవి ప్రసాద్‌రెడ్డిని కిడ్నాప్ చేసి బెదిరిస్తేనే ఉపయోగం ఉంటుందని సూచించాడు. రవి ప్రసాద్‌రెడ్డి చిరునామా, ఫోన్ నెంబర్ సైతం సురేష్‌కు ఇచ్చిన వేణుగోపాల్ ఆ పని చేయాలని ప్రోత్సహించాడు. అయితే ప్రస్తుతం తాను నేరప్రవృత్తిని పూర్తిగా మానేశానని చెప్పిన సురేష్ వేణుగోపాల్ చెప్పింది చేసేందుకు నిరాకరించాడు. తాను చెప్పినట్లు చేయకుంటే క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తానంటూ సురేష్‌ను వేణుగోపాల్ బెదిరించాడు. సురేష్ ఫోన్‌లో ఆటోమాటిక్ కాల్ రికార్డర్ ఉండటంతో వేణుగోపాల్‌తో జరిపిన సంభాషణల్లో అనేకం రికార్డు అయ్యాయి.
హఠాత్తుగా రంగంలోకి పోలీసులు...
ఇదిలా ఉండగా గత ఏడాది అక్టోబర్ 3న సురేష్ ఇంటికి వచ్చిన పోలీసులు అతడిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి, వేణుగోపాల్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ట్లు తెలిపారు. ఏసీపీ అందె శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ మహేష్, ఎస్సై మహేష్ తనను నాలుగు రోజుల పాటు అక్రమంగా నిర్భంధించారని, విశ్వప్రసాద్‌రెడ్డి ప్రోద్భలంతోనే హత్యాయత్నానికి ఒడిగట్టినట్లు చెప్పాలని ఒత్తిడి చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. అలా చేస్తేనే తాము విశ్వప్రసాద్‌రెడ్డిని అరెస్టు చేయడం సాధ్యమై నీ డబ్బు తిరిగి వస్తుందని అన్నారని, వేణుగోపాల్‌రెడ్డిని ఎదురుగా కూర్చోబెట్టి తనపై పోలీసులు చేయి చేసుకున్నారని అతను పేర్కొన్నాడు. కిడ్నాప్ ప్లాన్ వేణుగోపాల్‌రెడ్డిదేనని తాను నిరాకరించానని చెప్పినా వారు పట్టించుకోలేదని తెలిపాడు.
ఆయుధం లేకుండానే అరెస్టులు...
సురేష్‌పై అక్టోబర్ 6న హత్యాయత్నం కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు అందులో మరికొందరితో కలిసి వేణుగోపాల్‌రెడ్డిపై రెక్కీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకుగాను ఏపీ 31 ఏఎం 0100 కారు వినియోగించారని ఆరోపించిన పోలీసులు దానిని రికవరీ చేయలేదు సరికదా మిగిలిన వారు ఎవరనేది గుర్తించలేదు. ఆయుధం, బాధితుడిపై గాయం... ఇలాంటివి ఏవీ లేకుండానే కుట్ర, హత్యాయత్నం ఆరోపణలపై అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటికి వచ్చిన సురేష్ సోమవారం తనకు జరిగిన అన్యాయంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. గతంలో నేరచరిత్ర ఉన్న వారికి మామూలుగా బతికే హక్కు లేదా? అని ప్రశ్నిస్తున్న సురేష్... ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. రియల్ ఎసేŠట్‌ట్ వ్యాపారుల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు తనను పావుగా మార్చారని ఆరోపిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment