చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో దారుణం జరిగింది. పవిత్ర శుక్రవారం రోజున ఇంటిని శుద్ధి చేసుకుంటున్న సమయంలో దుండగులు తల్లీకూతుళ్లను బలితీసుకున్నారు. కత్తులతో పొడిచి హత్యచేశారు. చాంద్రాయణగుట్టలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న జంట హత్యల ఉదంతం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు.. తాళ్లకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ హుస్సేన్, షహజాది బేగం (60) దంపతులు. వీరి కుమార్తె ఫరీదా బేగం (32) కూడావీరితోనే ఉంటోంది. అల్లుడు మెహతాŒ ఖురేషీ సౌదీలో ఉంటున్నారు. ఫరీదా బేగానికి ఇద్దరు కుమార్తెలు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఫరీదా బేగం పిల్లలిద్దరినీ పాఠశాలకు పంపించింది. తండ్రి హుస్సేన్ టీ తాగేందుకని చాంద్రాయణగుట్టకు వెళ్లారు. దీంతో ఇంట్లో షహజాది బేగం, ఫరీదా బేగం మాత్రమే ఉన్నారు. కొద్దిసేపటి అనంతరం హుస్సేన్ ఇంటికి వచ్చారు.
ఆ సమయంలోనే ఇంట్లో నుంచి ఇద్దరు దుండగులు బయటికి పారిపోతూ కనిపించారు. హుస్సేన్ అనుమానంతో లోనికి వెళ్లి చూడగా భార్య, కూతురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో ఆయన ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ రుద్ర భాస్కర్‌లకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఫరీదా బేగం మెడలో కత్తిని దించడంతో పాటు ఛాతి, కడుపు భాగాల్లో కూడా పొడిచినట్లు గుర్తించారు. షహజాదీ శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే పోలీసులు క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్య జరిగిన గది నుంచి పక్కనే ఉన్న ప్రధాన రహదారి వరకు జాగిలం రెండుసార్లు వెళ్లివచ్చింది.
ఫరీదాబేగం భర్త సోదరుడే నిందితుడు..?
ఫరీదాబేగం భర్త మెహతాబ్ ఖురేషీ సోదరుడు రెహమాన్ ఖురేషీనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సౌదీలో రెహమాన్ పనిచేస్తూ కొంత డబ్బును తన సోదరుడు మెహతాబ్‌కు పంపించాడు. ఆ డబ్బుకు మరింత కలిపి ఘాజీమిల్లత్ కా>లనీలో మెహతాబ్ ఇల్లు కొని తన అత్త షహజాదీ బేగంపై రిజిస్ట్రేషన్ చేయించాడు. కొన్నాళ్ల అనంతరం ఇక్కడికి వచ్చిన రెహమాన్ ఇంటిలో తనకు వాటా ఇవ్వాలని కోరాడు. ఇల్లు ఇవ్వలేమని.. సగం డబ్బు ఇస్తామని అతని వదిన ఫరీదా పేర్కొంది. ఈ విషయమై పంచాయతీ పెట్టి అతనికి డబ్బులు చెల్లించారు. కానీ తన డబ్బుతో ఇల్లు కట్టుకొని.. ఫరీదా బేగం తల్లి షహజాది బేగం పేరుపై రిజిస్ట్రేషన్ చేయించడం.. తనకు నామమాత్రపు డబ్బులు ఇచ్చారనే కోపంతో రెహమాన్ రగిలిపోయాడు. ఇందుకు ప్రధాన కారణమైన వదిన ఫరీదా, ఆమె తల్లి షహజాదీలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అదను చూసి శుక్రవారం ఉదయం తన దగ్గరి బంధువు ముల్తాన్ ఖురేషీతో కలిసి ఇద్దరిని అంతమొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా జంట హత్యలు పథకం ప్రకారం చేశారా? అదనుకోసం పలుమార్లు రెక్కీ నిర్వహించి దారుణానికి పాల్పడి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
మెహతాబ్ ఖురేషీ పాత్రపైనాఅనుమానాలు..
మృతురాలు ఫరీదా బేగం భర్త మెహతాబ్ ఖురేషీకి ముగ్గురు భార్యలు. వీరిలో ఫరీదా బేగం రెండో భార్య. సౌదీలో వ్యాపారం చేస్తున్న మెహతాబ్ తమను సరిగా చూసుకోవడం లేదంటూ ఫరీదాబేగం, చాంద్రాయణగుట్టలో ఉంటున్న మరో భార్య తరచూ చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గతంలో ఫిర్యాదులు సైతం చేశారు. మరో భార్య ముంబైలో ఉంటోంది. సౌదీలోనే ఉండే మెహతాబ్ అప్పుడప్పుడు చాంద్రాయణగుట్టకు వచ్చేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా కుటుంబ సభ్యుల్లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించలేక జంట హత్యలకు మెహతాబ్ పరోక్షంగా కారకుడయ్యాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
గజ్వేల్‌లో అంత్యక్రియలు..
హత్యకు గురైన తల్లీకూతుళ్ల మృతదేహాలకు గజ్వేల్‌లో అంత్యక్రియలు చేశారు. షహజాది బేగం మరో కుమార్తె గజ్వేల్ పట్టణంలో నివాసం ఉంటుండడంతో.. చాంద్రాయణగుట్టలో తమకు ఎవరూ లేరని.. తన తల్లి, సోదరి అంత్యక్రియలను తమ ప్రాంతంలో జరుపుకొంటామని కోరడంతో పోలీసులు మృతదేహాలను ఆమెకు అప్పగించారు. దీంతో గజ్వేల్‌లో వారి అంత్యక్రియలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment