JB Patnaik
-
రైతు ఆత్మహత్యపై లోక్ సభలో గందరగోళం
-
రైతు ఆత్మహత్యపై లోక్ సభలో గందరగోళం
న్యూఢిల్లీ : ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్యపై గురువారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. రైతు ఆత్మహత్యపై చర్చించాల్సిదేనంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో పట్టుబట్టారు. సమస్య తీవ్రమైనందున ప్రశ్నోత్తరాలు రద్దుచేసి రైతు ఆత్మహత్యపై చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఇదే అంశంపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దాంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ రైతుల సమస్యల కన్నా చర్చించాల్సిన ముఖ్యమైన అంశం ఏముందన్నారు. దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమన్నారు. రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆయన ధ్వజమెత్తారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని రైతు ఆత్మహత్యపై రాజకీయం చేయటం సరికాదన్నారు. రైతు సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో ప్రకటన చేస్తారన్నారు. రైతు ఆత్మహత్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, దిగులు చెందాల్సిన పనిలేదని వెంకయ్య తెలిపారు. అయినా విపక్ష సభ్యులు శాంతించలేదు. చర్చకు పట్టుబట్టడంతో సమావేశాలకు ఆటంకం కలిగింది. దాంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. -
జేబీ పట్నాయక్ మృతికి లోక్ సభ సంతాపం
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ... ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతిపట్ల సంతాప తీర్మానం చదివి వినిపించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. ఆ తర్వాత సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దాంతో విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్యపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. మరోవైపు రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు మే 13 వరకు కొనసాగుతాయి. మొత్తం మీద ఈసారి 13 రోజులపాటు సభ కార్యకలాపాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో రైల్వేలు, 2015-16 సాధారణ బడ్జెట్‌పై చర్చ జరుగనుంది. అలాగే ద్రవ్య వినిమయ, ఆర్థిక బిల్లులను ఆమోదించాల్సి ఉంది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 20వ తేదీ వరకు కొనసాగడం విదితమే. -
రాజకీయ చతురుడు.. సాహతీ కోవిదుడు
సబ్ ఎడిటర్ నుంచి సీఎం దాకా.. భువనేశ్వర్: నలభైయేళ్లపాటు ఒడిశా రాజకీయాలను శాసించిన జేబీ పట్నాయక్ బహుముఖ ప్రజ్ఞాశాలి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన.. సాహిత్యం, జర్నలిజం, సాంస్కృతిక రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. రాజకీయ వారసత్వం లేకున్నా.. రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదిగారు. 1980లో సీఎంగా పగ్గాలు చేపట్టి 1989 వరకు ఆ పదవిలో ఉన్నారు. తర్వాత 1995లో మళ్లీ సీఎంగా ఎన్నికై 1999 వరకు కొనసాగారు. 2004 నుంచి ఐదేళ్ల వరకు ఒడిశాలో విపక్ష నేతగా ఉన్నారు. 2009లో అస్సాం గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన 14 ఏళ్ల పాలనలో ఒడిశా అభివృద్ధి పథాన దూసుకుపోయింది. అస్సాం గవర్నర్‌గా ఉన్నప్పుడు పట్బౌసీ సత్రా ఆలయంలోని గర్భగుడిలోకి మహిళల ప్రవేశం కోసం కృషి చేశారు. ‘బంకిన్చంద్ర ఉపన్యాసమాల’ అనువాదానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1927లో ఖుర్దాకు దగ్గర్లోని రామేశ్వర్ వద్ద జన్మించిన పట్నాయక్ సంస్కృతంలో డిగ్రీ, రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు. ‘ఈస్టర్న్ టైమ్స్’ ఆంగ్ల పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. తర్వాత ఎడిటర్ అయ్యారు. 1971లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1973-1975 మధ్య ఇందిర హయాంలో రక్షణశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. 1980 వరకు రక్షణశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. 1980లో మళ్లీ లోక్‌సభకు ఎన్నికై.. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. -
జేబీ పట్నాయక్ కన్నుమూత
తిరుపతి స్విమ్స్‌లో గుండెపోటుతో మృతి సంస్కృత విద్యాపీఠం స్నాతకోత్సవ కార్యక్రమానికి వచ్చిన పట్నాయక్ అస్వస్థతకు కొద్ది గంటల ముందే శ్రీవారి దర్శనం తిరుపతి: ఒడిశా మాజీ సీఎం జానకి బల్లభ పట్నాయక్(89) కన్నుమూశారు. కుటుంబ సభ్యులతో కలసి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 18వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తిరుపతి వచ్చిన ఆయన.. మంగళవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యాపీఠానికి చాన్స్‌లర్‌గా ఉన్న ఆయన సోమవారం సాయంత్రం ‘బహుభాషా ఉత్పత్తి’ పదకోశంపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత తిరుపతికి చేరుకుని సంస్కృత విద్యాపీఠం వర్సిటీ అతిథి గృహంలో మనుమడు అవినాష్‌తో కలిసి బస చేశారు. అర్ధరాత్రి దాటాక 1.30 ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో గంటన్నర పాటు వైద్యులు అత్యవసర చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. ఆయన భౌతికకాయాన్ని విద్యార్థుల సందర్శనార్థం సంస్కృత విద్యాపీఠానికి తరలించారు. అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు తరలించారు. అక్కడ గవర్నర్ ఎస్సీ జమీర్, సీఎం నవీన్ పట్నాయక్, వివిధ పార్టీల నేతలు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. బుధవారం పూరీ స్వర్గద్వార్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీవారి దర్శనంలో తమ తండ్రి స్వయంగా విష్ణు సహస్ర నామాలు గట్టిగా చదివారని పట్నాయక్ కుమార్తె సుదత్త తెలిపారు. ఆయన మృతికి నివాళిగా ఒడిశా ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మంగళవారం సెలవు ప్రకటించారు. సంస్కృత విద్యాపీఠంలో అధికార కార్యక్రమాలను రద్దు చేశారు. స్నాతకోత్సం రద్దయింది. దేశం గొప్ప నేతను కోల్పోయింది: రాష్ట్రపతి న్యూఢిల్లీ: జేబీ పట్నాయక్ మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని పట్నాయక్ భార్య జయంతికి సంతాప సందేశం పంపారు. పట్నాయక్ ఒడిశా అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, సోనియాగాంధీ, రాహుల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులు సంతాపం తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, పట్నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
జేబీ పట్నాయక్ మృతికి వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్ : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. పట్నాయక్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జేబీ పట్నాయక్ గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జేబీ పట్నాయక్ మృతి పట్ల సంతాపం తెలిపారు. -
'దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయింది'
తిరుపతి : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతి పట్ల తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయిందని, దేశ రాజకీయాల్లో జేబీ పట్నాయక్ కీలక పాత్ర పోషించారని అన్నారు. కాగా గుండెపోటుతో తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ జేబీ పట్నాయక్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. జేబీ పట్నాయక్ మృతదేహం మరికాసేపట్లో సాంస్కృతిక విద్యాపీఠం వద్దకు తీసుకెళ్లి.. అనంతరం ప్రత్యేవ విమానంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు తరలిస్తారు. -
ఒడిశా మాజీ సీఎం జేబీ పట్నాయక్ కన్నుమూత
-
ఒడిశా మాజీ సీఎం జేబీ పట్నాయక్ కన్నుమూత
తిరుపతి: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, అసోం మాజీ గవర్నర్ జానకీ బల్లభ పట్నాయక్ (88) మంగళవారం వేకువజామున కన్నుమూశారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జేబీ పట్నాయక్ గత కొంతకాలంగా గుండెపోటుతో బాధపడుతున్నారు. తిరుపతిలో జరిగే రాష్ట్రీయ విద్యాపీఠ్ కార్యక్రమానికి వచ్చిన జేబీ పట్నాయక్ కు సోమవారం రాత్రి తీవ్ర గుండెపోటు రావటంతో ఆయన్ని స్విమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఒడిశాకు రెండు దఫాలుగా దాదాపు 14 ఏళ్లు సీఎంగా పని చేశారు. కేంద్రమంత్రిగా కూడా జేబీ పట్నాయక్ పని చేశారు. తర్వాత అసోంకు గవర్నర్ గా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.