న్యూఢిల్లీ : ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్యపై గురువారం లోక్సభలో గందరగోళం నెలకొంది. రైతు ఆత్మహత్యపై చర్చించాల్సిదేనంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో పట్టుబట్టారు. సమస్య తీవ్రమైనందున ప్రశ్నోత్తరాలు రద్దుచేసి రైతు ఆత్మహత్యపై చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఇదే అంశంపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు.
దాంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ రైతుల సమస్యల కన్నా చర్చించాల్సిన ముఖ్యమైన అంశం ఏముందన్నారు. దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమన్నారు. రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆయన ధ్వజమెత్తారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని రైతు ఆత్మహత్యపై రాజకీయం చేయటం సరికాదన్నారు. రైతు సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో ప్రకటన చేస్తారన్నారు. రైతు ఆత్మహత్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, దిగులు చెందాల్సిన పనిలేదని వెంకయ్య తెలిపారు. అయినా విపక్ష సభ్యులు శాంతించలేదు. చర్చకు పట్టుబట్టడంతో సమావేశాలకు ఆటంకం కలిగింది. దాంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.