మనమంతా భాయీ..భాయీ
► మొన్న ఉద్దేశపూర్వక అవమానం
► సీఎం ఆగ్రహంతో దిద్దుబాటుకు
► మంత్రి బొజ్జల యత్నం కలెక్టర్‌తో ప్రజాప్రతినిధుల మంతనాలు
► కార్యకర్తలను లోనికి అనుమతించని వైనం
చిత్తూరు(గిరింపేట): కలెక్టర్ తమకు సహకరించడం లేదంటూ.. వారంతా కత్తిగట్టారు. తమను ఏ మాత్రం లెక్కచేడం లేదంటూ రగిలిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల జెడ్పీసమావేశానికి నిర్ణీత సమయానికే వచ్చిన ప్రజాప్రతినిధులు సమావేశ మందిరంలోనికి రాకుండా .. చైర్పర్సన్ చాంబర్లో తిష్టవేశారు. సమావేశం సమయం మించిపోయి.. వారి కోసం కలెక్టర్ నిరీక్షించేలా చేశారు. తీవ్ర అసహనానికి గురైన కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అక్కడి నుంచి నిష్ర్కమించారు. దీంతో తాము కలెక్టర్‌కు ఝలక్ ఇచ్చామని ప్రజాప్రతినిధులంతా సంబరపడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులకు క్లాస్ తీసుకోవడంతో వారంతా కంగుతిన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక.. మళ్లీ కలెక్టర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు.
ఇందులో భాగంగా అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ గీర్వాణి, ఎంఎల్ఏ సత్యప్రభ, ఎంపీ శివప్రసాద్ చిత్తూరు న గరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్‌తో రహస్య మంతనాలు జరిపారు. ఈ సమావేశానికి కార్యకర్తలు, నాయకులను అనుమతించలేదు. జెడ్పీ సమావేశంలో జరిగిన సన్నివేశాన్ని మరిచి పోయి అధికారులు, నాయకులు సమన్వంతో పనిచేయాలని మంత్రి నచ్చజెప్పినట్లు తెలిసింది. జేసీ నారాయణభరత గుప్త, ఇతర శాఖల జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.