jc koteswararao
-
వేలిముద్రలు పడని వారికి 24 గంటల్లో రేషన్
ఏలూరు (మెట్రో) : వేలిముద్రలు పడక రేషన్ సరుకులు పొందలేని వారందరికీ 24 గంటల్లో సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నా రేషన్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫోన్లో ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 18 మంది తమ సమస్యలను జేసీకి తెలిపారు. - నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన భాస్కరరావు, ఇరగవరం మండలం కాకిలేరుకు చెందిన ఫణిబాబు మాట్లాడుతూ వేలిముద్రలు పడక సరుకులు అందక వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేశారు. - కుకునూరు మండలం వెంకటాపురానికి చెందిన పి.చందన్‌కుమార్, నరసింహారావు మాట్లాడుతూ తమకు రేషన్ కార్డులు మంజూరైనా కొత్తకార్డులు ఇవ్వడం లేదన్నారు. - భీమవరానికి చెందిన జె.వరలక్ష్మి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా మండపాకలో తమకు రేషన్‌కార్డు ఉందని, బతుకుదెరువు కోసం భీమవరం వచ్చామని, ఇక్కడ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించాలని కోరింది. దీనిపై స్పందించిన జేసీ తక్షణమే ఇంటి సమీపంలో రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో యాసిన్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గణపతి పాల్గొన్నారు. -
సాధికార సర్వే 90 శాతం పూర్తి
కేఆర్ పురం (బుట్టాయగూడెం): జిల్లాలో ప్రజా సాధికారిక సర్వే 90 శాతం పూర్తయ్యిందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. కేఆర్ పురం ఐటీడీఏలో బుధవారం సర్వేపై జంగారెడ్డిగూడెం డివిజన్లోని మండలాల తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం, పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సిగ్నల్ లేకపోవడం వల్ల 10 నుంచి 13 శాతం సర్వే మిగిలి ఉందన్నారు. దీనిని కూడా ఈనెల 13వ తేదీ సాయంత్రంలోపు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూరు శాతం సర్వే పూర్తిచేస్తామన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో ఏ గ్రామాల్లో సిగ్నల్ అందడం లేదు, ఎన్ని గ్రామాల్లో, ఎంత మందికి సర్వే చేయాల్సి ఉందనే విషయాలపై నివేదిక తయారుచేయాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు. ఐటీడీఏ పీవో ఎస్.షణ్మోహన్, ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
4,11,725 కుటుంబాల సర్వే పూర్తి
ఏలూరు (మెట్రో): జిల్లాలో ఇప్పటివరకూ 11 లక్షల 41 వేల 142 మంది సమగ్ర వివరాలను ప్రజాసాధికారి సర్వేలో నమోదు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు తెలిపారు. విజయవాడ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్లతో శనివారం సాయంత్రం ప్రజాసాధికారిత సర్వేలో సాంకేతిక లోపాల నివారణపై కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 39 లక్షల జనాభాకు సంబంధించి ప్రజాసాధికారి సర్వే ప్రారంభించి నెల రోజులు గడవగా 4 లక్షల 11 వేల 725 కుటుంబాలకు చెందిన సమగ్ర సమాచారాన్ని సేకరించామని జేసీ కోటేశ్వరరావు తెలిపారు. సర్వేలో కచ్చితంగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని కృష్ణా జిల్లా జేసీ బాబు సూచించారు. డీఆర్వో ప్రభాకరరావు, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ దొర, ప్రజాసాధికారి సర్వే సమన్వయకర్త గంగరాజు పాల్గొన్నారు. -
చదువులో మమేకమవ్వాలి
చినకాపవరం(ఆకివీడు) : విద్యార్థులు చదువులో మమేకం కావాలని జాయింట్ కలెక్టర్ టి.కోటేశ్వరరావు సూచించారు. చినకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో గురువారం ఆయన ముచ్చటించారు. గంటసేపు వారితో గడిపారు. భవిష్యత్తు ప్రణాళికలు ముందే నిర్దేశించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. జేసీ వెంట తహసీల్దార్ వి.నాగార్జునరెడ్డి, సీఎస్‌డీటీ సత్యనారాయణ, ఆర్ఐ నాగేశ్వరరావు, సర్పంచ్ దారపురెడ్డి కనకయ్య, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మర్రివాడ వెంకట్రావు, అభివద్ధి కమిటీ చైర్మన్ ఐఎస్ఎన్.రాజు, ప్రధానోపాధ్యాయుడు రామానుజాచార్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.