ఆహార పదార్థాలను కల్తీచేస్తే చర్యలు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఆహారపదార్థాలను కల్తీ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన∙మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు పక్కన చిరువ్యాపారాలు చేసే వ్యక్తులు కల్తీ సరుకులతో తినుబండారాలు తయారు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని, వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి పదార్థాలు ప్యాకింగ్ చేస్తున్నారని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. వ్యాపారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పదార్థాలు కలుషితం కాకుండా చూడాలని సూచించారు. జిల్లాలో మంచినీటి సరఫరా చేసే సంస్థలు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్వో శివశంకరరెడ్డి, జిల్లా వినియోగదారుల సంఘం సమాఖ్య అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య, కార్యదర్శి జి.ఆనందరావు పాల్గొన్నారు.