అర్హులందరికీ ఇన్పుట్ సబ్సిడీ
కణేకల్లు: పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ అందేలా చూస్తామని జేడీఏ శ్రీరామమూర్తి తెలిపారు. గతేడాది వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన 5 లక్షల మందికి రూ.889 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరైందని ఆయన వెల్లడించారు. బుధవారం ఆయన కణేకల్లులో ప్రత్యామ్నాయ పంటల విత్తన పంపిణీని పరిశీలించారు. అర్హులైన రైతులందరికీ ప్రత్యామ్నాయ పంట విత్తనాలను అందేలా చూడాలని ఏఓ శ్రీనివాసులును ఆదేశించారు. ఈ సందర్భంగా జేడీఏ విలేకరులతో మాట్లాడుతూ, ఇన్పుట్ సబ్సిడీ ప్రక్రియ 95శాతం పూర్తయ్యిందన్నారు. మిస్‌మ్యాచ్, ఇన్పుట్కు అర్హులై ఉండీ జాబితాలో పేరు లేని వారు, ఇన్పుట్ సబ్సిడీ మంజూరైనా ఖాతాల్లో డబ్బు జమ కాని వారు కొందరున్నారనీ, వీరందరికీ త్వరలోనే ఇన్పుట్ సబ్సిడీ డబ్బు అందేలా చూస్తామన్నారు.
వేరుశనగ సాగుచేయని వారికే ప్రత్యామ్నాయ విత్తనాలు
జిల్లా వ్యాప్తంగా వేరుశనగ సాగయ్యే భూమి 8 లక్షల హెక్టార్లుంటే ఇప్పటి వరకు కేవలం 3.20 లక్షల హెక్టార్లలోనే వేరుశనగ సాగైందన్నారు. 80 వేల హెక్టార్లలో ఆముదం, కంది పంటలు సాగు చేశారన్నారు. ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేయని రైతులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉలవలు, అలసందుల విత్తనాలు ఉచితంగా, జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు పంట విత్తనాలు కేజీ రూ.50 రాయితీతో రైతులకు అందజేస్తున్నామన్నారు. వేరుశనగ సాగు చేసి ఈ-క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు ఇచ్చేది లేదన్నారు. నల్లరేగడి భూములున్న రైతులకు సెప్టెంబర్ 20 లోపు పప్పుశనగ విత్తనాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జేడీఏ తెలిపారు. జేడీఏ వెంట ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ రెడ్డపరెడ్డి, ఏఈఓ విజయ్‌కుమార్‌లున్నారు.