ప్రశాంత్ హీరోగా జీన్స్-2
చాక్లెట్ బాయ్ స్థాయి నుంచి యాంగ్రీ యంగ్ హీరో స్థాయికి ఎదిగిన నటుడు ప్రశాంత్. పలు వైవిధ్యభరిత కథా పాత్రలకు జీవం పోసిన స్మార్ట్ హీరో ఆయన. తన కెరీర్లో జీన్స్ చిత్రం ఒక మైలురాయి. పలు ప్రత్యేకతలతో తెరపై ఆవిష్కృతమైన చిత్రం జీన్స్. దర్శకుడు శంకర్ అద్భుత సృష్టి. అప్పట్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని ధరించిన ఐశ్వర్యరాయ్ ఈ చిత్రంలో ప్రశాంత్‌తో జతకట్టి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోని ఏడు అద్భుత ప్రదేశాలను పాటలో పొందుపరుచుకున్న చిత్రం జీన్స్. ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన జీన్స్ చిత్రానికి తాజాగా సీక్వెల్ తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది.
ఈ చిత్రంలోను చార్మింగ్ నటుడు ప్రశాంత్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. దీనికి దర్శకుడు మాత్రం శంకర్ కాదు. ప్రశాంత్ తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ దర్శకత్వంతోపాటు, నిర్మాణ బాధ్యతల్ని చేపట్టనున్నారని తాజా సమాచారం. ఆ మధ్య ఈయన ప్రశాంత్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం పొన్నర్ శంకర్‌ను భారీ నిర్మాణ విలువలతో బ్రహ్మాండంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అదే విధంగా గతంలో తాను నటించిన మలైయూర్ మంబట్టియాన్ చిత్రా న్ని ఇటీవల ప్రశాంత్హీరోగా తెరకెక్కించారు. తాజాగా జీన్స్-2ను మరో గొప్ప దృశ్య కావ్యంగా మలచడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం.