ఏడడుగుల బంధానికి ఎనిమిదో అడుగు!
‘‘ఈ తరం యువతకు చదువు, ఉద్యోగం, సంపాదన అన్నీ ఉన్నాయి. ఏడడుగులు వేసి పెళ్లితో ఒక్కటైనవారు ఎనిమిదో అడుగు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకూడదనే సందేశంతో ‘జీలకర్ర బెల్లం’ చిత్రం నిర్మించాం. ఈ నెల 29న రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత ఆళ్ల నౌరోజీ రెడ్డి తెలిపారు. అభిజీత్, రేష్మ జంటగా విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎ.శోభారాణి, ఆళ్ల నౌరోజీ రెడ్డి నిర్మించిన చిత్రం ‘జీలకర్ర-బెల్లం’. ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తెలంగాణ ఎంపీ కవిత ప్రత్యేకంగా విడుదల చేశారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని ఈ సందర్భంగా కవిత అన్నారు.
ఆడియో వేడుకలో ప్రముఖ దర్శకుడు దశరథ్ సీడీని విడుదల చేసి, దాస్య నాయక్‌కు అందించారు. ‘‘తొలి సినిమాకే ‘వందేమాతరం’గారితో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు చెప్పారు. ప్రతాని రామకృష్ణగౌడ్, గుణ్ణం గంగరాజు, వెనిగళ ్ళ రాంబాబు, రామసత్యనారాయణ, బలరాం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.