తను మరణించినా.. ఐదుగురికి అవయవదానం
విశాఖపట్టణం: విశాఖకు చెందిన ఓ మహిళ బ్రెయిన్ డెడ్ కాగా ఆమె అవయవాలతో ఐదుగురికి పునర్జన్మ కలుగనుంది. వివరాలివీ...
విశాఖ నగరం గాజువాక ప్రాంతంలోని సుందరయ్య కాలనీకి చెందిన ఆర్.రమణమ్మ(48) ఈనెల 27వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక కేర్ ఆస్పత్రిలో చేర్పించగా రాత్రి 8 గంటల సమయంలో బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. జీవన్‌దాన్ అధికారులు రమణమ్మ ఇద్దరు కుమారులతో మాట్లాడి, ఆమె అవయవదానానికి అంగీకరింపజేశారు. ఆమె రెండు కిడ్నీలను విశాఖలో కేర్, అపొలో ఆస్పత్రుల్లో అవసరమున్న ఇద్దరు రోగులకు ఇచ్చేందుకు సమ్మతించారు.
నేత్రదానానికి కూడా సమ్మతించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు లివర్, ఊపిరితిత్తులను అమర్చడానికి సమ్మతించారు. దీంతో ఆ మేరకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం హెలికాప్టర్లో లివర్, ఊపిరితిత్తులను హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కాగా, రమణమ్మ కుటుంబం విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం నుంచి విశాఖకు వలస వచ్చింది. ఆమె భర్త లారీ క్లీనర్ కాగా కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా కుమారులు కృష్ణంరాజు, శ్రీనివాసరాజు లారీ డ్రైవర్లుగా స్థిరపడ్డారు.