Israeli-Hezbollah War: కాల్చేసే కాంతిపుంజం!
లెబనాన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా? పక్కలో బల్లెంలా మారిన హెజ్బొల్లాను సమూలంగా తుడిచిపెట్టాలని నిర్ణయించుకుందా? హెజ్బొల్లా ఉగ్రవాదుల డ్రోన్లు, రాకెట్లను కూల్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ‘ఐరన్ బీమ్’ తొలిసారిగా రంగప్రవేశం చేయనుందా? ఇజ్రాయెలీలకు ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరికలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
హెజ్బొల్లాతో యుద్ధం మొదలైతే ఇజ్రాయెల్ ప్రజలకు కొన్ని రోజులపాటు విద్యుత్ సంక్షోభం తప్పదన్న హెచ్చరికల పత్రం దేశ న్యాయ శాఖలో రౌండ్లు కొడుతున్నట్టు ‘ద జెరూసలెం పోస్ట్’ ఓ కథనం ప్రచురించింది. చాలా ప్రాంతాల్లో ఒకటి నుంచి మూడు రోజుల దాకా కరెంటు సరఫరా ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీ అథారిటీ కూడా పేర్కొంది. ప్రజలు ఆహారం, నీరు, బ్యాటరీ వంటివి దగ్గరుంచుకోవాలని సూచించింది...!
ప్రపంచంలోనే తొలిసారి!
ఐరన్ బీమ్. ఉగ్రవాదుల రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేసి క్షణాల్లో కాల్చి బూడిదగా మార్చే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. తీవ్రమైన కాంతిపుంజపు ఉష్ణశక్తితో కూడిన ఈ వినూత్న సాంకేతిక ఆయుధాల గురించి వినడమే తప్ప ఇప్పటిదాకా ఏ దేశమూ ప్రయోగించలేదు. చెప్పాలంటే ప్రయోగాత్మక దశలో ఉన్న టెక్నాలజీ ఇది. ఇజ్రాయెల్ రఫేల్ అడ్వాన్సుడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది.
ఇది స్టార్ ట్రెక్, స్టార్ వార్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని ఆయుధాల్లా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ‘డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్’గా వ్యవహరించే ఈ కొంగొత్త వ్యవస్థను 2014 ఫిబ్రవరి 11న సింగపూర్ ఎయిర్ షోలో ప్రదర్శించారు. పాలస్తీనీ హమాస్, లెబనీస్ హెజ్బొల్లా ఉగ్ర సంస్థలతో తాజా ఘర్షణలు, యుద్ధం నేపథ్యంలో దీన్ని ఇజ్రాయెల్ రంగంలోకి దించనుందని తెలుస్తోంది.
ఇలా పని చేస్తుంది...
యారో–2, యారో–3, డేవిడ్స్ స్లింగ్, ఐరన్ డోమ్ తర్వాత ఇజ్రాయెల్ అమ్ములపొదిలో సరికొత్త ఆగ్నేయాస్త్రం ఐరన్ బీమ్. ఇది ఫైబర్ లేజర్ ఆధారంగా పనిచేస్తుంది. ఐరన్ డోమ్‌తో పోలిస్తే ఐరన్ బీమ్ చిన్నది, తేలికైనది. రహస్యంగా ప్రయోగించడానికి, ఒక చోట నుంచి మరో చోటికి తరలించడానికి మరింత అనువైనది. ఐరన్ డోమ్ కూడా ఇజ్రాయెల్ స్వల్పశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థే. కానీ ఇటీవలి హమాస్ రాకెట్ దాడులను నిలువరించడంలో విఫలమైంది.
ఇప్పుడు డోమ్‌కు బీమ్‌ను జతచేసి సత్ఫలితాలు రాబట్టాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఐరన్ బీమ్కూ పరిమితులు లేకపోలేదు. తడి వాతావరణ పరిస్థితుల్లో ఈ లేజర్ వ్యవస్థ పనిచేయదు. ఎంతటి సానుకూల పరిస్థితులున్నా వాతావరణంలోని తేమ వల్ల 30% నుంచి 40% వరకు శక్తిని లేజర్ కోల్పోతుంది. అలాగే ధ్వంసం చేయాల్సిన లక్ష్యం ఐరన్ బీమ్ దృష్టి రేఖకు సూటిగా ఉండాలి. నేరుగా కంటికి కనిపించకుండా, బీమ్‌కు సూటిగా కాకుండా లక్ష్యం ఎక్కడో నక్కి ఉంటే లేజర్ కిరణాలతో నాశనం చేయడం అసాధ్యం.
పైగా ఐరన్ బీమ్ ఫైరింగ్ రేటు కూడా తక్కువ. లక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి సరిపోయేంత లేజర్ శక్తిని ప్రయోగించాలంటే కనీసం 5 సెకన్లు, అంతకు మించి సమయం కావాలి. అయినప్పటికీ శత్రు క్షిపణులను గగనతలంలోనే అడ్డుకుని కూల్చేసే సంప్రదాయ ఇంటెర్సెప్టర్ క్షిపణులతో పోలి్చతే ఐరన్ బీమ్ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైనది. ‘ఖర్చు తక్కువ, పనితీరు ఎక్కువ’ అన్నది దీని సూత్రం. పైగా దీన్ని ఎన్నిసార్లైనా పేల్చవచ్చు.
ఒక్కో షాట్‌కు అయ్యే వ్యయమూ తక్కువ. ఐరన్ డోమ్‌లో ఒక్కో ఇంటెర్సెప్టర్ రాకెట్‌కు 60 వేల డాలర్ల దాకా అవుతుండగా ఐరన్ బీమ్‌లో మాత్రం ఆ ఖర్చు కేవలం కొన్ని డాలర్లే. అంతేకాదు, ఈ వ్యవస్థలో శత్రు క్షిపణిని ఢీకొట్టాక ఇంటెర్సెప్టర్ శకలాలు పడే ముప్పు కూడా ఉండదు. 7 కిలోమీటర్ల పరిధిలోని క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు, మోటార్ షెల్స్ వంటివాటిని ఐరన్ బీమ్ క్షణాల్లో నిరీ్వర్యం చేయగలదు. దీన్ని 2025 నాటికి మోహరించాలని ఇజ్రాయెల్ భావించినా యుద్ధం అవసరాలతో ఇప్పుడే రంగంలో దించేలా ఉంది.
ఐరన్ బీమ్ X లైట్ బీమ్!
ఈ రెండు హై ఎనర్జీ లేజర్ వ్యవస్థలనూ రఫేల్ సంస్థే అభివృద్ధి చేస్తోంది. లైట్ బీమ్ 7.5 కిలోవాట్ల ఇంటెర్సెప్టర్. రెండు కిలోమీటర్ల దూరంలోని చిన్నపాటి మానవరహిత వైమానిక వాహనాలు, నేలమీద అత్యాధునిక మందుపాతరలు, పేలని మందుగుండు తదితరాలను ఇది నిర్వీర్యం చేయగలదు. ఐరన్ బీమ్ 100 కిలోవాట్ల తరగతికి చెందిన హై ఎనర్జీ లేజర్ సిస్టమ్. ఇది రాకెట్లు, శతఘ్నులు, యూఎవీలను కూల్చగలదు.
– జమ్ముల శ్రీకాంత్