India with Jessica: ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి
మన దేశంలో పుట్టిన చాలామందికి హిందీ మాట్లాడటం రాదు. కొంతమందికి అర్థమైనప్పటికీ మాట్లాడలేరు. అమెరికా నుంచి వచ్చిన జెస్సికా మాత్రం హిందీలో అనర్గళంగా మాట్లాడేస్తుంది. ఇలా పలకాలి అని హిందీ పాఠాలు కూడా చెబుతోంది.
మనదేశానికి వచ్చే విదేశీయులకు హిందీతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ నెటిజనుల మన్ననలను అందుకుంటోంది ఈ ‘బిహారీ బహూ’. పదిహేడేళ్లుగా ఇండియాతో చక్కని బంధాన్ని కొనసాగిస్తోన్న జెస్సికా గురించి ఆమె మాటల్లోనే...
‘‘నేను చికాగోలో పుట్టాను. అమ్మానాన్న ఇరు కుటుంబాలకు చెందిన తాత, బామ్మలతో కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం మాది. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో కలిసి స్కూలుకు వెళ్లి చదువుకునేదాన్ని. ఆదివారం వచ్చిందంటే... కుటుంబమంతా కలిసి గడుపుతాం. నాన్న అంతర్జాతీయ వ్యాపారి కావడంతో తరచూ చైనా, కొరియాలు వెళ్తుండేవారు.
ఆయన్ని చూసి నేను కూడా అలా తిరగాలని అనుకునేదాన్ని. కాలేజీ చదువుకోసం 18 ఏళ్ల వయసులో చికాగో నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాను. నాలుగేళ్లపాటు హాస్టల్లో ఉన్నాను. ‘చైనా, ఇండియాలలో ఆర్థికమాంద్యం వస్తుంది’ అని కాలేజీలో ఎక్కువమంది విద్యార్థులు మాట్లాడుకునేవారు. అది విన్న నాకు ఇండియా వెళ్లి అక్కడి పరిస్థితులు చూడాలనిపించేది.
ఏడాదిలో తిరిగి వచ్చేస్తాను అనుకున్నా..
కాలేజీ చదువు పూర్తయిన తరువాత తెలిసిన వాళ్ల ఐటీ కంపెనీ హరిద్వార్‌లో ఉంటే.. అక్కడ ఇంటర్న్‌షిప్ చేయడానికి ఇండియా వచ్చాను. ఇంటర్న్‌షిప్‌తోపాటు భారతీయులు, వారి భాషల గురించి తెలుసుకోవచ్చని అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఇరుగు పొరుగు నుంచి కూరగాయలు విక్రయించేవాళ్ల వరకు అందరితో పరిచయం ఏర్పడింది. అందరూ చక్కగా కలిసి పోయేవారు.
ఏడాదిలో ఇంటర్న్‌షిప్ పూర్తయిన తరువాత అదే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అలా ఏడాదిలో తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది స్నేహితుల ద్వారా అభిషేక్ పరిచయం అయ్యాడు. నేను ఇక్కడ ఉంటే.. అభిషేక్ అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇద్దరం మంచి స్నేహితులుగా మారాం. నేను మా ఇంటికి వెళ్లినప్పుడల్లా అభిషేక్‌ను కలిసేదాన్ని. అలా మా ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చి బిహార్ కోడలిని అయ్యాను.
అత్తమామల అనురాగం చూసి...
హరిద్వార్‌లో ఉండే రోజుల్లో ఇక్కడి అత్తమామలు కుటుంబ పెద్దలుగా కోడళ్లు, మనవళ్లను చూసే విధానం నాకు బాగా నచ్చింది. అభిషేక్‌ను పెళ్లిచేసుకోవడానికి అది కూడా ఒక కారణం. మేము పెళ్లి చేసుకుంటామని మా నాన్నని అడిగాం. ‘చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి పెళ్లిచేసుకో’ అని నాన్న చెప్పారు. అభిషేక్ కుటుంబ సభ్యుల్లో సగం మంది అమెరికాలో నివసిస్తుండడంతో వారి గురించి బాగా అర్థం చేసుకోవడం కూడా నాన్న ఒప్పుకోవడానికి ఒక కారణం. అభిషేక్ తల్లిదండ్రులు విదేశీ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోవడానికి మొదట్లో భయపడ్డారు. ఎలాంటి అమ్మాయో అని సందేహించినప్పటికీ మా కుటుంబం గురించి తెలుసుకుని పెళ్లికి సమ్మతించడంతో 2010లో మా వివాహం జరిగింది.
జీవితాంతం ఆధారపడాల్సిందే...
పెళ్లి అయిన తరువాత అమెరికాలో కొన్నిరోజులు, ఇండియాలో కొన్ని రోజులు ఉండేవాళ్లం. ఆరేళ్ల తరువాత బిహార్‌కి వచ్చి స్థిరపడ్డాం. మాకు ఇద్దరు పిల్లలు బాబు, పాప. ప్రపంచంలో కూతురికంటే కొడుకులనే మరింత ప్రేమగా చూసుకుంటారు. ఇండియాలో ఇది కాసింత ఎక్కువే. అమ్మాయిలకు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేలా అన్నీ నేర్పిస్తారు. అబ్బాయిలకు మాత్రం ఏమీ నేర్పించరు. కొంతమంది తల్లులు అయితే ‘మా అబ్బాయికి కప్పు టీ పెట్టడం కూడా రాదు’ అని గర్వంగా చెబుతుంటారు. ఇలా అయితే వాళ్లు స్వయంసమృద్ధిని సాధించలేరు. జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సిందే. అందుకే నేను నా పిల్లలకు లింగభేదం లేకుండా అన్నీ నేర్పిస్తున్నాను.
నేర్చుకుని నేర్పిస్తున్నా...
హరిద్వార్‌లో ఉన్నప్పుడే హిందీ నేర్చుకున్నాను. కోర్సు కూడా చేశాను. బిహార్‌కి వచ్చిన తరువాత నా హిందీ బాగా మెరుగుపడింది. బిహారీలు మాట్లాడే హిందీ సరిగాలేదని, వారి మాటలు విని నవ్వుతుంటారు చాలామంది. కానీ ఇక్కడ మాట్లాడే హిందీలో సంస్కృతం, భోజ్‌పూరి, మైథిలి, ఆంగిక వంటి భాషలు కూడా కలుస్తాయి. అందుకే బిహారీలు మాట్లాడే హిందీ కొంచెం విభిన్నంగా ఉంటుంది. బిహారీలు మాట్లాడే హిందీపై చాలామందికి ఉండే చిన్నచూపు, వివక్ష పోవాలని నా వీడియోల్లో.. బిహారీ స్టైల్ హిందీనే మాట్లాడుతున్నాను.
ఇండియా విత్ జెస్సికా
ఇక్కడ ఉండే భారతీయులకు, విదేశాల్లో ఉండే ఇండియన్స్‌కు హిందీ నేర్పిస్తున్నాను. అమెరికా, కెనడాలలో స్థిరపడిన ఎంతోమంది భారతీయుల పిల్లలకు హిందీలో మాట్లాడడం తెలీదు. ఇది వాళ్లకు పెద్ద సమస్య. అందుకే నేను హిందీ నేర్పిస్తున్నాను. నాలుగున్నరేళ్ల క్రితం ‘ఇండియా విత్ జెస్సికా’ పేరిట యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచాను. వీటిద్వారా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తున్నాను. కొన్నిసార్లు వివిధ రకాల అంశాలపై మాట్లాడడానికి అతిథిగా కూడా వెళ్తున్నాను. అమెరికా అమ్మాయి ఇండియా గురించి మాట్లాడడం, అందులో హిందీలో అనర్గళంగా మాట్లాడుతుంది అని తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యంగా నా క్లాసులు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
కొంతమంది డబ్బుల కోసం లిప్‌సింక్ వీడియోలు పోస్టు చేస్తుంటారు. నేను అవేమీ చేయడం లేదు. కేవలం తెలియని సమాచారం ఇవ్వడమే నా లక్ష్యం. అందుకే ఫాలోవర్స్ గురించి కూడా పట్టించుకోను. కొంతమంది మెసేజులకు జవాబులు చెప్పడం లేదని తిడుతుంటారు. నన్ను సెలెబ్రిటీలా చూస్తున్నారు. కానీ నేను సెలబ్రిటీని కాదు. ఇద్దరు పిల్లలకు తల్లిని, వాళ్లకు నేర్పించాలి. వంట చేయాలి, ఇంటిని చూసుకోవాలి. నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంది. నేను అందరిలానే సామాన్యమైన వ్యక్తిని’’ అని ఎంతో నిరాడంబరంగా చెబుతోంది జెస్సికా.