గుడివాడ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నగారా
= 24న పోలింగ్
= ఎన్నికల అధికారి ఏసుదాసు వెల్లడి
గుడివాడ, న్యూస్‌లైన్ : గుడివాడ అర్బన్ బ్యాంకు పాలకవర్గ నియామకానికి ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించనున్నట్లు బ్యాంకు ఎన్నికల అధికారి ఎంజే ఏసుదాసు విలేకరులకు చెప్పారు. గురువారం స్థానిక అర్బన్‌బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నోటిఫికేషన్ వివరాలు ఆయన వెల్లడించారు. అర్బన్ బ్యాంకు పాలకవర్గ కాలపరిమితి ముగియటంతో ఎన్నికలు జరుపుతున్నట్లు చెప్పారు.
ఈ బ్యాంకుకు గుడివాడ మెయిన్ బ్రాంచితో పాటు పామర్రు, గుడ్లవల్లేరు, కైకలూరు, కానూరు లలో బ్రాంచిలు ఉన్నాయన్నారు. గుడివాడ బ్రాంచి పరిధిలో 4,456 ఓట్లు, గుడ్లవల్లేరు బ్రాంచి పరిధిలో 92, పామర్రు పరిధిలో 200, కానూరు పరిధిలో 227, కైకలూరు పరిధిలో 64 కలిపి మొత్తం 5,239 ఓట్లు ఉన్నట్లు చెప్పారు. తుది జాబితాను శుక్రవారం ప్రకటిస్తామని తెలిపారు. ఈ బ్యాంకు పరిధిలో మొత్తం 12 మంది పాలకవర్గ సభ్యులు ఉంటారని చెప్పారు. గుడివాడ బ్రాంచికి 10, గుడ్లవల్లేరుకు ఒకటి, పామర్రు బ్రాంచికి ఒక డెరైక్టర్ పోస్టులు కేటాయించినట్లు ఆయన వివరించారు.
ఎన్నికల షెడ్యూలు ఇదీ...
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 15 ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు గుడివాడలోనే దాఖలు చేయాల్సిందిగా కోరారు. 16న నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందన్నారు. ఆరోజు సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని చెప్పారు. అదేరోజు సాయంత్రం ఐదు గంటల తరువాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయిస్తామని తెలిపారు.
గుడివాడలోని ఓటర్లకు స్థానిక గౌరీశంకరపురంలోని మాంటిస్సోరీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో, గుడ్లవల్లేరు, పామర్రు, కైకలూరు, కానూరు బ్రాంచి పరిధుల్లో ఉన్న ఓటర్లకు ఆయా బ్రాంచి కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. అదేరోజు మూడు గంటల నుంచి మాంటిస్సోరి పాఠశాలలో ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. మిగి లిన బ్రాంచిల్లో జరిగిన పోలింగ్ తాలూకు బ్యాలెట్ బాక్సులను కూడా గుడివాడకు తీసుకొచ్చి లెక్కిస్తారని వివరించారు. ఏవైనా సందేహాలుంటే గుడివాడ అర్బన్ బ్యాంకులోని తన కార్యాలయంలో సంప్రదించవచ్చని చెప్పారు.