గతవారం బిజినెస్
జెట్ ఎయిర్వేస్ ‘జెట్స్క్రీన్’ సర్వీస్
‘జెట్ ఎయిర్వేస్’ తాజాగా ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ సర్వీసు ‘జెట్ స్క్రీన్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రయాణికులు వారి స్మార్ట్‌ఫోన్స్/ట్యాబ్లెట్స్/ల్యాప్టాప్స్లలో సినిమాలు, పాటలు, గేమ్స్, టీవీ కార్యక్రమాలు వంటి తదితర వాటికి సంబంధించిన 220 గంటల డిజిటల్ కంటెంట్‌ను ఉచితంగా స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈ సేవల కోసం అమెరికాకు చెందిన గ్లోబల్ ఈగల్ ఎంటర్టైన్మెంట్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సంస్థ తెలిపింది.
భారత్‌లోకి ఫియట్ జీప్ బ్రాండ్
ఇటలీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘ఫియట్ క్రిస్లెర్ ఆటోమొబైల్స్’ (ఎఫ్సీఏ) తన జీప్ బ్రాండ్‌ను భారత్‌లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ తాజాగా ‘రాంగ్లర్’, ‘గ్రాండ్ చెరోకీ’ అనే రెండు ఎస్యూవీ మోడళ్లను మార్కెట్లో ఆవిష్కరించింది. రాంగ్లర్ ధర రూ.71.59 లక్షలు. ఇక మూడు వేరియంట్లలో లభ్యంకానున్న చెరోకీ ధర రూ.93.64 లక్షలు నుంచి రూ.1.12 కోట్ల మధ్యలో ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.
ఇ-రిక్షాకు పర్మిట్ అవసరం లేదు
ఇ-రిక్షా, ఇ-కార్ట్స్కి రోడ్ల మీద నడపడానికి పర్మిట్లు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 1988 మోటార్ వెహికల్స్ చట్టంలోని సెక్షన్ 66లోని సబ్ సెక్షన్ (1) ఇ-కార్ట్స్, ఇ-రిక్షాలకు వర్తించదంటూ కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు/రోడ్లపై తిరగడానికి ఇ-రిక్షా, ఇ-కార్ట్స్ వాహనాలపై ట్రాఫిక్ రూల్స్‌కి అనుగుణంగా కొన్ని నియంత్రణలను విధించుకోవచ్చని పేర్కొంది.
సైయంట్ ప్రత్యేక డివిడెండ్
ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ .. సిల్వర్ జూబిలీ వేడుకల సందర్భంగా ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. రూ. 5 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 2.50 (50 శాతం) అందించనున్నట్లు వివరించింది. ప్రత్యేక డివిడెండ్ రూపంలో మొత్తం రూ. 34 కోట్లు చెల్లించనున్నట్లు సైయంట్ పేర్కొంది. ప్రత్యేక డివిడెండ్‌కు రికార్డు తేది సెప్టెంబర్ 9 కాగా, చెల్లింపు తేది సెప్టెంబర్ 16.
రియల్టీ, నిర్మాణ రంగాలకు ఊపు
రియల్టీ, నిర్మాణ రంగాలకు మరింత ఊపును ఇవ్వడానికి కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దిశలో తాజా నిబంధనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది. నిర్మాణ రంగంలో వివాదాల పరిష్కారం, నిలిచిపోయిన ప్రాజెక్టుల పునఃప్రారంభం, ఆర్థిక సహకారం లక్ష్యాలుగా తాజా నియమ నిబంధనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
టాటా, నిలేకని, కేల్కర్ల ‘మైక్రోఫైనాన్స్’
రతన్ టాటా, నందన్ నిలేకని, విజయ్ కేల్కర్ వంటి దిగ్గజాలు కలిసి అవంతి మైక్రోఫైనాన్స్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రధానంగా దేశంలోని రుణ లభ్యత లేని వర్గాలకు తక్కువ వడ్డీకే రుణాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించనుంది. ‘అవంతి ఫైనాన్స్, త్వరలో రిజిస్ట్రేషన్ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంటుంది. దీని కార్యకలాపాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభం అవుతాయి.
జూలైలో మౌలిక రంగం వృద్ధి 3.2 శాతం
ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు జూలైలో 3.2 శాతంగా నమోదయ్యింది. 2015 జూలైలో ఈ రేటు 1.3 శాతం. రిఫైనరీ ఉత్పత్తుల భారీ వృద్ధి దీనికి కారణం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ వాటా 38 శాతంగా ఉంది.
జౌళి ఎగుమతులకు కొత్త ప్రోత్సాహకాలు
జౌళి ఎగుమతులను మరింతగా పెంచే లక్ష్యంతో కేంద్రం సెప్టెంబర్ 20 నుంచి కొత్త ప్రోత్సాహకాలను అందించనుంది. ఎగుమతులపై కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో ఇకపై పన్నుల భారం ఉండదు. ఇందుకు సంబంధించి రూ.5,500 కోట్ల మేర రాష్ట్రాల పన్నులపై రాయితీ (ఆర్‌వోఎస్‌ఎల్) ఇచ్చే పథకం అమలు ప్రక్రియను రెవెన్యూ శాఖ ప్రారంభించింది. ఆర్‌వోఎస్‌ఎల్ పథకం కింద ఎగుమతి దారులు రాష్ట్రాల పన్నులపైనా పూర్తి రాయితీలు పొందే అవకాశం లభిస్తుంది.
సిమెంట్ కంపెనీలకు సీసీఐ షాక్
కూటమి కట్టి, ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా సిమెంట్ ధరలను తమ ఇష్టానుసారం నడిపించినందుకు 11 సిమెంట్ కంపెనీలకు, సిమెంటు తయారీదారుల సంఘాని(సీఎంఏ)కి రూ.6,715 కోట్ల మేర భారీ జరిమానా విధిస్తూ అనైతిక వ్యాపార విధానాల నిరోధక సంస్థ (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు సైతం ఉన్నాయి. అన్ని సిమెంట్ కంపెనీలు కుమ్మక్కు కాకుండా, ధరలు, ఉత్పత్తి, సరఫరాను నియంత్రించే చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
యాపిల్‌కి రూ.లక్ష కోట్ల జరిమానా!
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) గట్టి షాకిచ్చింది. ఐర్లాండ్‌తో ఒప్పందాలు చేసుకుని, తద్వారా అంతర్జాతీయ అమ్మకాల్లో చాలావరకూ అక్కడి నుంచే చేస్తున్న యాపిల్... ఈ చర్యలతో కొన్నేళ్లుగా పన్నులను ఎగ్గొడుతూ వస్తోందని, ఇది చట్ట విరుద్ధమని యూరోపియన్ కమిషన్ తేల్చిచెప్పింది. ఇందుకుగాను 13 బిలియన్ యూరోలను (దాదాపు రూ. లక్ష కోట్లు) తిరిగి చెల్లించాలని స్పష్టంచేసింది. అక్రమంగా యాపిల్‌కు పన్ను ప్రయోజనాలు కట్టబెట్టిన ఐర్లాండ్... ఈ సొమ్మును రికవరీ చేసుకోవాలని ఈసీ ఆదేశించింది.
మందగించిన దేశీయ వృద్ధి
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) మందగమనంలోకి జారిపోయింది. ఈ రేటు కేవలం 7.1 శాతానికి పడిపోయింది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు గడచిన ఆరు త్రైమాసికాల్లో (2014-15 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 6.6 శాతం) ఇదే తొలిసారి. మైనింగ్, నిర్మాణం, వ్యవసాయ రంగాల పేలవ పనితీరు దీనికి కారణం. కాగా గడచిన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం.
డేటాతో వాయిస్ కాల్స్ ఫ్రీ: జియో
రిలయన్స జియో జనవరి 1 నుంచి ప్రారంభించే వాణిజ్య సేవలకు మొత్తం 10 రకాల డేటా ప్లాన్లను ప్రకటించింది. అప్పుడప్పుడూ డేటా(నెట్ సర్ఫింగ్) ఉపయోగించే యూజర్లకోసం రోజుకు కనిష్టంగా రూ.19 టారిఫ్ మొదలుకొని.. తక్కువగా డేటా వాడేవారికి నెలకు రూ.149 చొప్పున డేటా ప్యాకేజీని అందిస్తోంది. భారీస్థారుులో డేటా వినియోగించే యూజర్ల కోసం నెలకు రూ.4,999 ప్లాన్ కూడా ఉంది. ఇతర ప్లాన్లలో రూ.299; రూ.499, రూ.999; రూ.1,499; రూ.2,499; రూ.3,999 ఉన్నారుు.
డీల్స్..
⇔ దేశీ దిగ్గజ మొబైల్ పేమెం ట్స్ అండ్ కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎంలో మౌంటెన్ క్యాపిటల్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. అయితే ఎంత మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తోందో తెలియాల్సి ఉంది. మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మొత్తం రూ.400 కోట్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. తైవాన్‌కు చెందిన మీడియా టెక్ సంస్థకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఫండే ఈ మౌంటెన్ క్యాపిటల్.
⇔ మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజ్(జీల్) తన స్పోర్ట్స్ చానెల్ నెట్వర్క్.. టెన్ స్పోర్ట్స్‌ను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్(ఎస్పీఎన్)కు విక్రయించింది. ఈ ఒప్పందానికి సంబంధించి కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు జీల్ వెల్లడించింది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ డీల్ విలువ 38.5 కోట్ల డాలర్లు(దాదాపు రూ.2,579 కోట్లు)గా పేర్కొంది.
⇔ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవలు అందించే ఎస్‌బ్రిక్స్ కేజిల్ కేర్‌లో తాజాగా గృహ సంబంధ సేవల సంస్థ హోమ్క్యూస్ విలీనమైంది. ఈ కొనుగోలు మొత్తం స్టాక్ రూపంలోనే జరిగింది.