మీ ఫోన్లలోనే ‘జెట్ ’ ఎంటర్టైన్మెంట్
ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్‌వేస్’ తాజాగా ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసు ‘జెట్ స్క్రీన్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రయాణికులు వారి స్మార్ట్‌ఫోన్స్/ట్యాబ్లెట్స్/ల్యాప్‌టాప్స్‌లలో సినిమాలు, పాటలు, గేమ్స్, టీవీ కార్యక్రమాలు వంటి తదితర వాటికి సంబంధించిన 220 గంటల డిజిటల్ కంటెంట్‌ను ఉచితంగా స్ట్రీమ్ చేసుకోవచ్చు. జెట్ స్క్రీన్ అనేది ఆన్‌బోర్డ్ వైర్‌లెస్ స్ట్రీమింగ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుందని సంస్థ పేర్కొంది. దీనికోసం అమెరికాకు చెందిన గ్లోబల్ ఈగల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపింది. ఇలాంటి డిజిటల్ కంటెంట్ స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించిన తొలి సంస్థగా జెట్ ఎయిర్‌వేస్ నిలిచింది. ‘ప్రస్తుతం అంతర్జాతీయంగా స్మార్ట్‌ఫోన్స్/ల్యాప్‌టాప్స్‌లలో డిజిటల్ కంటెంట్ స్ట్రీమింగ్ చేసుకునే విధానం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
తమ ప్రయాణికులు, మరీ ముఖ్యం గా ప్రయాణం చేసేటప్పుడు కంటెంట్‌ను యాక్సెస్ చేసేవారికి తమ సేవలు అనువుగా ఉంటాయి’ అని జెట్ ఎయిర్‌వేస్ డెరైక్టర్ గౌరాంగ్ శెట్టి తెలిపారు. జెట్ స్క్రీన్ సేవల ప్రారంభానికి హార్డ్‌వేర్, కంటెంట్ లెసైన్స్ కోసం భారీగానే ఇన్వెస్ట్ చేశామని, కానీ ప్రయాణికుల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని జెట్ ఎయిర్‌వేస్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) కోలిన్ న్యూబ్రోన్నెర్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోసం నాణ్యమైన సేవలను అందించడమే తమ లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వపు నియమ నిబంధనలకు అనువుగా డిజిటల్ కనెక్టివిటీ సర్వీసులను అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 6 ఎయిర్‌క్రాఫ్ట్‌లలో జెట్ స్క్రీన్ సేవలు అందుబాటులో ఉన్నాయని, మిగతా వాటిల్లో మార్చి నాటికి అందుబాటులోకి తెస్తామని వివరించారు.
జెట్ స్క్రీన్ సేవలు పొందడం ఇలా..
ప్రయాణికులు జెట్ స్క్రీన్ సేవల కోసం ‘ఎయిర్‌టైమ్ ప్లేయర్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇది అన్ని ప్రముఖ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. యాప్ డౌన్‌లోడ్ తర్వాత మొబైల్ హ్యాండ్‌సెట్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచాలి. తర్వాత వైర్‌లెస్ నెట్‌వర్క్‌లోకి (వై-ఫై ఆన్ చేసి) వెళ్లి ‘జెట్ స్క్రీన్’కు కనెక్ట్ కావాలి. తర్వాత వెబ్ బ్రౌజర్‌లో జెట్ స్క్రీన్ హోమ్‌పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డిజిటల్ కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్రౌజర్‌లో జెట్ స్క్రీన్ హోమ్ పేజ్ ఓపెన్ కాకపోతే ‘జెట్‌స్క్రీన్.జెట్‌ఎయిర్‌వేస్.కామ్’లోకి వెళ్లి ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలను ఎంజాయ్ చేయవచ్చు. పూర్తిస్థాయి వై-ఫై సేవల ఆవిష్కరణకు జెట్ స్క్రీన్ తొలి అడుగని సంస్థ పేర్కొంది. కాగా ఆన్‌బోర్డ్ వై-ఫై యాక్సెస్‌కు పౌరవిమానయాన శాఖ సుముఖత వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.