పంది ఇతివృత్తంతో జట్లీ
నోరు లేని జీవాల ఇతివృత్తంతో ఇంతకు ముందు చాలా చిత్రాలు వచ్చాయి. శునకాలు, వానరాలు, ఏనుగులు, పాములు, పిల్లులు, గుర్రాలు ఇలా పలు జంతువులు ప్రధాన భూమికను పోషించిన చిత్రాలను చూశాం. వాటిలో అత్యధిక చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి. అయితే పంది ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాన్ని తొలి సారిగా త్వరలో చూడబోతున్నాం. ఈ చిత్రం పేరే జట్లీ. దర్శకుడు గౌతమ్‌మీనన్ వద్ద శిష్యరికం చేసిన జగన్‌సాయి తొలిసారిగా మెగాఫోన్ పట్టి ప్రధాన పాత్రను పోషిస్తూ తెరపై నవ్వులు పూయించడానికి సిద్ధం చేస్తున్న చిత్రం ఇది.
ఇందులో ఉత్తమవిలన్ చిత్రం ఫేమ్ పార్వతీనాయర్, అరుంధతి కథానాయికలుగా నటిస్తున్నారు. కన్నన్ కన్నయ్య తదితరులు ముఖ్యపాత్రల్ని ధరిస్తున్న ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలిపారు. మనుషుల మూఢనమ్మకాలను ఎత్తి చూపే చిత్రంగా జట్లీ ఉంటుందన్నారు. శుభ శకునాలు, అపశకునాల నమ్మకాలతో ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు. వాటిని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో మరి కొందరుంటున్నారన్నారు. ఇలాంటి అంశాలను వినోదభరితంగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం జట్లీ అని తెలిపారు.
ఇందులో ఒక తెల్లని పంది,గ్రాఫిక్స్ పంది గలాటా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయన్నారు. హాలీవుడ్ సాంకేతిక కళాకారులు పని చేస్తున్న జట్లీ చిత్రంలో సాంకేతిక పరిజ్ఞానం అబ్బురపరుస్తుందనీ చెప్పారు. హాలీవుడ్ చిత్రాలు నార్నియా, లయన్ చిత్రాలకు పనిచేసిన మోడల్ యానిమేటర్ ఈ చిత్రానికి పని చేయడం విశేషమని పేర్కొన్నారు. జట్లీ చిత్ర ప్రధానోద్ధేశం ప్రేక్షకుల్ని నవ్వించడమేనని అన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, తిరునెల్వెలీ ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు దర్శక నటుడు జగన్‌సాయి వెల్లడించారు. దీనికి సత్య సంగీతాన్ని అందిస్తున్నారు.