నగల దుకాణాల మోసాలు..!
తెలంగాణవ్యాప్తంగా తూనికలు - కొలతల శాఖ దాడులు 30 కేసులు నమోదు
హైదరాబాద్ : బంగారం వినియోగదారులు నిలువునా మోసపోతున్నట్లు తూనికలు-కొలతల శాఖ దాడుల్లో బహిర్గతమైంది. స్వచ్ఛతలో, తూకంలో దగా, నాణ్యత లేమి, తరుగు పేరుతో జ్యూయెలరీ షాపులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలింది. తెలంగాణ వ్యాప్తంగా నాలుగురోజులుగా జ్యూయెలరీ షాపులు, షాపింగ్స్ మాల్స్‌పై దాడులు నిర్వహించిన తూని కలు-కొలతల శాఖ వివిధ షాపులపై 30కు పైగా కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలోని పలు జ్యూయెలరీ షాపుల్లో తనిఖీలు చేసి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర కంట్రోలర్, అదనపు డీజీపీ గోపాల్ రెడ్డి బుధవారం మీడియాకు తెలిపారు. స్వర్ణాభరణాల కొనుగోలులో మోసాలను అరికట్టేందుకు జిల్లా కేంద్రాలలో బంగారం స్వచ్ఛత కొలిచే మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. బంగారంపై ఆఫర్స్, డిస్కౌంట్స్‌పై ఆప్రమత్తంగా వ్యవహరించాలని వినియోగదారులకు సూచించారు. కాగా, జ్యూవెల్లరీషాపులు 24 క్యారెట్ల బంగారం అని చెపుతూనే అంతకంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని వినియోగదారులకు అంటగడుతున్నట్లు, సరైన బిల్లు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తనిఖీలలో గుర్తించారు.
బాణసంచా దుకాణాలపై దాడులు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగను పురస్కరించుకొని తెలంగాణలోని బాణసంచా దుకాణాలపై తూనికల, కొలతల శాఖ కొరడా ఝళిపించింది. బాణసంచా హోల్‌సేల్ దుకాణాలపై 54 కేసులు నమోదు చేసినట్లు ఆ శాఖ కంట్రోలర్, అదనపు డీజీపీ ఎస్.గోపాల్‌రెడ్డి బుధవారమిక్కడ చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సూర్యాపేట, భువనగిరి, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లోని బాణసంచా దుకాణాలపై దాడులు నిర్వహించగా పలు మోసాలు బయటపడినట్లు చెప్పారు. పలు దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ.20 లక్షల విలువైన సరుకును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.