యూకేలో ‘జిహాదీ జైళ్లు’
లండన్: ప్రమాదకర తీవ్రవాదుల కోసం యూకే ప్రభుత్వం ప్రత్యేకంగా జైళ్లను ఏర్పాటు చేయనుంది. దేశంలోని జైళ్లలో తీవ్రవాద ప్రచారాన్ని అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వివిధ జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు మిగతా వారిని కూడా ప్రభావితం చేసి తీవ్రవాద మార్గంలోకి తీసుకువస్తున్నారు. దీంతో మంచిమార్గంలోకి తీసుకురావాలన్న తమ ఆశయం దెబ్బతింటోందని ప్రభుత్వం భావిస్తోంది.
తీవ్రవాద చర్యలకు పాల్పడేవారి కోసం యోర్క్, వొర్సెస్టయిర్, డర్హమ్ ప్రాంతాల్లో త్వరలోనే వీటిని ఏర్పాటు చేయనుంది. వీటిల్లో ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదులను ఉంచుతారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ జీవన స్రవంతిలోకి తీసుకువస్తారు. కొత్తగా ఏర్పాటు చేసే ఈ కారాగారాలను జిహాదీ జైళ్లు, జైళ్లలో జైళ్లు అని వ్యవహరిస్తున్నారు.