Jim Rogers
-
పసిడి పరుగు ఆగదు..!
న్యూఢిల్లీ: బంగారం, వెండి కొనుగోళ్లు పెరుగుతూనే ఉంటాయని, వాటి ధరలు కొత్త రికార్డు స్థాయిలకు చేరతాయని ఇన్వెస్ట్మెంట్ గురు, క్వాంటమ్ ఫండ్ సహ–వ్యవస్థాపకుడు జిమ్ రోజర్స్ తెలిపారు. ‘రాబోయే కొన్నేళ్లలో ప్రపంచ దేశాలు పలు సమస్యలు ఎదుర్కోనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరింత పెరగవచ్చు. పసిడి కొత్త గరిష్ట స్థాయిలను తాకడం కొనసాగుతుందని భావిస్తున్నాను. ఆల్–టైమ్ గరిష్ట స్థాయికి వెండి ఇంకా 45 శాతం దూరంలో ఉంది. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేలోగా అది కూడా మరో కొత్త గరిష్ట స్థాయిని తాకవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. పలు దిగ్గజ ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో పసిడిపై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో రోజర్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పసిడి అంటే పెద్దగా గిట్టని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ సైతం 563 మిలియన్ డాలర్లతో కెనడాకు చెందిన ఒక పసిడి మైనింగ్ సంస్థ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. ఒకవైపు ఈక్విటీలు మరోవైపు పసిడి రేట్లు కూడా ర్యాలీ చేస్తుండటంపై రోజర్స్ స్పందించారు. ‘చరిత్ర చూస్తే.. ప్రభుత్వాలు, కరెన్సీలపై నమ్మకం కోల్పోయినప్పుడల్లా ప్రజలు పసిడి, వెండిపై ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి తెలుస్తోంది. మళ్లీ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. సెంట్రల్ బ్యాంకులు నోట్లను భారీగా ముద్రిస్తున్న కొద్దీ ప్రజలకు కరెన్సీపై నమ్మకం సడలుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులపై క్రమేపీ నమ్మకం తగ్గవచ్చని, పసిడి ధర మరింత పెరగవచ్చని భావిస్తున్నాను‘ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌పై ఆసక్తి .. వర్ధమాన దేశాల మార్కెట్లు పరుగులు తీస్తున్నాయని, పెట్టుబడులకు అత్యంత అనువైన దేశాల్లో భారత్ కూడా ఒకటని రోజర్స్ పేర్కొన్నారు. ‘ప్రపంచ దేశాలు ఎడాపెడా నగదు ముద్రిస్తున్నాయి. అది ఎక్కడో ఒక దగ్గర ఖర్చు కావాలి. గణనీయంగా పడిపోయిన వర్ధమాన మార్కెట్లలోకి ఆ డబ్బు వచ్చి చేరుతోంది. అందుకే ఆ దేశాల మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. భారత్‌లో కూడా అదే జరుగుతోంది. అందరూ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు‘ అని ఆయన తెలిపారు. తన అలసత్వం కారణంగానే భారత్‌లో ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేయలేదని, అందుకు కాస్త విచారం కలుగుతోందన్నారు. ‘భారత్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు నిజంగానే స్మార్ట్‌గాను, వివేకవంతంగా వ్యవహరించారనే భావించాలి. స్థానిక అంశాలపై అవగాహన ఉంటే నేనూ కచ్చితంగా భారత్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తా‘ అని రోజర్స్ పేర్కొన్నారు. మరో టెక్ బబుల్..: టెక్నాలజీ స్టాక్స్ ర్యాలీ బుడగ ఏదో ఒక సమయంలో పేలడం ఖాయమని రోజర్స్ హెచ్చరించారు. ‘కొన్ని మార్కెట్లలో బబుల్స్ కనిపించడం మొదలైంది. కొన్ని అమెరికన్ కంపెనీల షేర్లు తగ్గనే తగ్గడం లేదు. ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ధోరణులే బబుల్‌కు దారితీస్తాయి. వీటిలో కొన్ని షేర్లు గణనీయంగా పతనం కాబోతున్నాయి. పడిపోయే ప్రసక్తే లేదనిపించే స్టాక్స్ ఏదో ఒక రోజు అత్యంత భారీగా పతనమవుతాయి. ఇన్వెస్టర్లు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి‘ అని రోజర్స్ పేర్కొన్నారు. -
గెలుపు ట్రంప్‌దే.. ఇక ట్రేడ్ వారే!
ముంబై: హోరా హోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో అంచనాలు మరింత ఉత్కంఠను రాజేస్తున్నాయి. రేపు(నవంబర్ 8న) పోలింగ్ జరగనుండగా ఫలితాలపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అంతేకాదు ఎవరు గెలిస్తే ఏంటి అనే చర్చ కూడా భారీగానే నడుస్తోంది. ఆర్థిక నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు, ట్రేడ్ పండితుల విశ్లేషణలు పుంఖాను పుంఖాలుగా వెలువడుతున్నాయి. తాజాగా ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్ సంచలన విశ్లేషణ చేశారు. ఒకవైపు హిల్లరీ ఫౌండేషన్ ప్రయివేట్ ఈమెయిళ్లను వినియోగించారన్న అభియోగంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) క్లీన్ చిట్ ఇవ్వడంతో ట్రంప్‌ను వెనక్కి నెట్టి హిల్లరీ రేసులో ముందంజలోకి వచ్చేశారు. అయితే తాను మాత్రం ట్రంప్ గెలుస్తారనే భావిస్తున్నానని, అందువల్ల యూఎస్ స్టాక్ మార్కెట్ లో షార్ట్ సెల్లింగ్ చేస్తున్నానని ఆయన తెలిపారు. హిల్లరీ, ట్రంప్‌లలో ఎవరు అమెరికా ప్రెసిడెంట్ అయినా ఒరిగేదేమీ ఉండదంటూ వ్యాఖ్యానించినప్పటికీ, ట్రంప్ గెలిస్తేమాత్రం ముప్పు తప్పదన్న సంకేతాలందించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందనీ, ఇందులో చైనాకు కూడా మినహాయింపులేదన్నారు. భారత్ కూడా ఆర్థిక మందగమనం నుంచి తప్పించుకోలేదని హెచ్చరించారు. అయితే భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు బావున్నాయని కితిబిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే, అమెరికా రుణభారం మరింత పెరిగి దివాలా పరిస్థితికి చేరుతుందన్నారు. వాణిజ్యపరమైన వివాదాలకు తెరలేస్తుందని విశ్లేషించారు. తన అంచనా కరెక్టయితే స్వల్పకాలంలో ముడిచమురు, బంగారం షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొని ధరలు కుప్పకూలతాయని జోస్యం చెప్పారు. కమోడిటీ ధరలు మాత్రం పుంజుకుంటాయన్నారు. ఈ షేర్లలో మదుపర్లు దీర్ఘకాలిక పొజిషన్లు తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. అలాగే వ్యవసాయ సంబంధిత షేర్లు కొనుక్కోవాలని, అయిదు సం.రాల కాలపరిమితిలో అమెరికాలో జంక్ బాండ్స్ లో షాట్ పొజిషన్ తీసుకోవచ్చని సూచించారు. ట్రంప్ విజయంతో ముడిచమురు మార్కెట్ తో పాటు బులియన్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని, బంగారం ధరలు, క్రూడాయిల్ భారీగా పతనమవుతాయని రోజర్స్ అంచనా వేశారు. కొత్త పెట్టుబడులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు మంచి దీర్ఘకాల అవకాశాలు లభిస్తాయని అన్నారు. కమోడిటీ మార్కెట్ అందనంత ఎత్తునకు చేరుతుందని, ఇండియాపైనా ఈ ప్రభావం ఉంటుందని, అయితే, ఇండియాలో కాగా, వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా పోల్ లో హిల్లరీకి అనుకూలంగా60 శాతం మెజార్టీ లభిస్తోంది. అయితే హిల్లరీ గెలిచినా ఈపరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోయానా కాస్త ఆలస్యమవుతాయని పేర్కొనడం విశేషం.