Jio Broadband
-
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు భారీ జరిమానా
న్యూఢిల్లీ: ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికం శాఖ జరిమానా విధించింది. వొడాఫోన్ ఐడియాకు రూ.2,000 కోట్లు, భారతి ఎయిర్‌టెల్‌కు రూ.1,050 కోట్ల పెనాల్టీ పడింది. జరిమానా చెల్లించేందుకు మూడు వారాల గడువు ఉంది. ఇంటర్ కనెక్టివిటీ సౌకర్యం కల్పించడంలో విఫలమైనందుకు రిలయన్స్ జియో ఫిర్యాదు ఆధారంగా ఇరు సంస్థలపై అయిదేళ్ల క్రితం ట్రాయ్ చేసిన సిఫార్సు మేరకు టెలికం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఏకపక్ష, అన్యాయమైన డిమాండ్‌తో మేము తీవ్రంగా నిరాశ చెందాము. ఈ ఆరోపణలు పనికిమాలినవి, ప్రేరేపించబడినవి. అత్యున్నత ప్రమాణాలను మేం పాటిస్తాం. చట్టాన్ని అనుసరిస్తాం. టెలికం శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తాం’ అని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. చదవండి: టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ -
జియో బ్రాడ్‌బ్యాండ్‌తో సెట్‌టాప్ బాక్స్ ఉచితం!
న్యూఢిల్లీ: డీటీహెచ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే దిశగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై ఉచితంగా సెట్‌టాప్ బాక్స్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. ‘జియోఫైబర్ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్‌టాప్ బాక్స్ కూడా లభిస్తుంది‘ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే, పేరొందిన ఎంటర్టైన్మెంట్ మొబైల్ యాప్స్‌లోని వీడియో కంటెంట్, సినిమాలు మొదలైనవన్నీ కూడా జియోఫైబర్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా కలిపే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ చార్జీలు ఉంటాయి. ప్రత్యేకంగా కంటెంట్‌కు చెల్లించనక్కర్లేదు. ఇక సెట్‌టాప్‌కు కెమెరాను అమర్చుకుంటే టీవీ ద్వారా వీడియో కాలింగ్ సేవలు కూడా పొందవచ్చని సమాచారం. నేటి నుంచి (సెప్టెంబర్ 5) ఆప్టికల్ ఫైబర్ ఆధారిత జియోఫైబర్ సర్వీసులను జియో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. జియోఫైబర్ కస్టమర్లకు ల్యాండ్‌లైన్ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్, సెకనుకు 100 మెగాబిట్ నుంచి 1 గిగాబిట్ దాకా స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందనున్నాయి. దీని చార్జీలు నెలకు రూ. 700 నుంచి ప్రారంభమవుతాయి. వార్షిక ప్లాన్ తీసుకున్న వారికి ఉచితంగా హెచ్డీ టీవీ సెట్ కూడా అందిస్తామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ గతంలో వెల్లడించారు. మొత్తం మీద జియోఫైబర్ రాకతో చాలామటుకు డైరెక్ట్ టు హోమ్ సేవలందించే సంస్థల వ్యాపారాలకు గట్టి దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయని పరిశమ్రవర్గాలు భావిస్తున్నాయి. దీన్ని తట్టుకునేందుకు ఆయా సంస్థలు ఇప్పటికే వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. జీ5, హుక్ వంటి పలు వీడియో స్ట్రీమింగ్ మొబైల్ యాప్స్ కంటెంట్ అందుబాటులోకి తెస్తూ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ. 3,999కి సెట్ టాప్ బాక్స్‌ను ఆవిష్కరించింది. తొలి ఏడాది తర్వాత రూ. 999 వార్షిక ఫీజుతో సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించవచ్చు. -
హైదరాబాద్‌లో ఎయిర్టెల్ ‘అపరిమిత’ డేటా
న్యూఢిల్లీ : టెలికాం రంగంలో మరో బిగ్గెస్ట్ గేమ్ ఛేంజర్‌గా రిలయన్స్ జియో తన ఫైబర్ ఆప్టికల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ‘జియోగిగాఫైబర్’ ను గత రెండు రోజుల క్రితమే లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. జియో ప్రకటించిన ఈ సేవలకు, గట్టి పోటీ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రంగంలోకి దిగింది. తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై ఎఫ్‌యూపీ(ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితిని ఎత్తివేసింది. తొలుత ఈ పరిమితిని హైదరాబాద్‌లో తొలగించినట్టు ఎయిర్టెల్ పేర్కొంది. దీంతో హైదరాబాద్ సర్కిల్లో ప్రతి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై కూడా అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ డేటాను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తుంది. అంటే మీ కనెక్షన్‌పై హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సస్‌ను ఎలాంటి డేటా పరిమితి లేకుండా పొందవచ్చు. హైదరాబాద్ సర్కిల్లో రూ.349 నుంచి రూ.1299 మధ్యలో నాలుగు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఆరు నెలలు, ఏడాది కాలానికి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎంపిక చేసుకునే వారికీ ఈ కంపెనీ 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు కూడా గత నెలలోనే ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు అన్ని సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ అపరిమిత డేటా ఆఫర్ హైదరాబాద్ సర్కిల్ మినహాయించి మరే ఇతర సర్కిల్లోనూ లేదు. ఢిల్లీలో రూ.799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై 100 జీబీ బ్రాడ్‌బ్యాండ్ డేటా పరిమితి ఉంది. హైదరాబాద్ సర్కిల్లో రూ.349 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకుంటే, 8 ఎంబీపీఎస్ వరకు స్పీడులో అపరిమిత డేటా లభ్యమవుతుంది. అదేవిధంగా రూ.1,299 ప్లాన్‌పై 100ఎంబీపీఎస్ స్పీడులో డేటా పొందవచ్చు. ఈ స్పీడులో ఈమెయిల్ నుంచి డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవడం, ఆడియో, వీడియో ఫైల్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, వెబ్‌ను సర్ఫ్ చేసుకోవడం చేయొచ్చు. జియోగిగాఫైబర్ ద్వారా 1జీబీపీఎస్ స్పీడులో డేటాను అందించనున్నట్టు రిలయన్స్ జియో రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
జియో 5 సంచలన సర్వీసులు ఈ ఏడాదిలోనే!
టెలికాం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తున్న రిలయన్స్ జియో ఈ ఏడాదిలో మరిన్ని సంచలనాలకు తెరతీసేందుకు సిద్ధమవుతోంది. డీటీహెచ్, హోమ్ బ్రాండు లాంటి సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. జియో టెలికాం యూనిట్ అనుభవంతో, అప్ కమింగ్ సర్వీసులలో కూడా ఆల్ట్రా-లో కాస్ట్ తో ఆ సెగ్మెంట్లలోనూ దుమ్మురేపాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జియోకు సంబంధించిన వర్గాలు చెప్పిన మేరకు 2017 లో ఐదు సంచలన సర్వీసులు రాబోతున్నాయని తెలిసింది. అవేమిటో మీరే ఓసారి చూడండి.. జియో డీటీహెచ్ సర్వీసు.. 350ప్లస్ ఛానల్స్, వాటిలో 50కి పైగా హెచ్డీ ఛానల్స్ తో జియో డైరెక్ట్ టూ హోమ్(డీటీహెచ్) టీవీ సర్వీసుల్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలోనే వీటిని ప్రారంభించబోతున్నట్టు కంపెనీ ప్రతినిధులు కూడా చెప్పారు. ఈ సర్వీసులను వాడుకునేందుకు జియో టీవీ యాప్ తో పాటు యూజర్ల ఫోన్లలో జియో సిమ్ ను కలిగి ఉండాలి. కేబుల్ ఛానల్స్ తో పాటు, స్ట్రీమింగ్ సర్వీసులను యూజర్లు వారి టీవీల్లో చూసుకోవచ్చు. అచ్చం ఎయిర్ టెల్ ఇంటర్నెట్ టీవీ సెట్ ఆఫ్ బాక్స్ లాగానే ఈసర్వీసులు కూడా ఉండనున్నాయి. ఎయిర్ టెల్ కూడా ఇటీవలే ఈ సర్వీసులను ప్రారంభించింది. జియో క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ ఫామ్ తో ఈ సర్వీసులు ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. రిలయన్స్ జియో బ్రాడు బ్యాండ్ సర్వీసు.. 1జీపీపీఎస్ స్పీడుతో జియో తన 'ఫైబర్ టూ ది హోమ్' బ్రాడు బ్యాండు సర్వీసులను ఈ ఏడాదిలోనే లాంచ్ చేసేందుకు ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది. ఈ పైలట్ ప్రొగ్రామ్ ఇప్పటికే ప్రారంభించామని రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ1 ఫలితాల సందర్భంగా కంపెనీ ప్రకటించింది. వీటిని మరిన్ని నగరాలకు విస్తరించనున్నామని వెల్లడించింది. అయితే రిలయన్స్ జియో హోమ్ బ్రాడు బ్యాండు లాంచ్ తేదీలను, ధరలను కంపెనీ ప్రకటించలేదు. ఫైబర్ టు ద హోమ్ (FTTH) టెక్నాలజీ పై రూపొందించబడిన జియో బ్రాడ్‌బ్యాండ్ మినిమమ్ 100Mbps స్పీడ్‌ను ఆఫర్ చేయగలదట. జియో మనీ.. ఈ సర్వీసులు కంపెనీ కొత్తగా ఆఫర్ చేసేవి కానప్పటికీ, జియో మనీని మరింత ప్రమోట్ చేసేందుకు ఈ ఏడాది పెద్ద ప్లాన్ నే కంపెనీ రచిస్తోంది. ఎంపికచేసిన రిటైల్ అవుట్ లెట్లలో ప్రస్తుతం రిలయన్స్ పేమెంట్ సర్వీసులను యూజర్లు వాడుకోవచ్చు. ఇక నుంచి మెట్రో రైడ్స్, యూజర్లు తమకు అనుకూలమై స్టోర్లలో కూడా వీటిని వాడుకునేందుకు మొబైల్ టూ పేను వాడుకోవచ్చట. అన్ని కొనుగోళ్లకు జియో మనీ ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. 4జీ వాయిస్ ఓవర్ ఫీచర్ ఫోన్ గతేడాది నుంచే ఈ 4జీ వాయిస్ ఓవర్ ఫీచర్ ఫోన్ ఇలా ఉంటుంది, అలా ఉంటుందని పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ మొబైల్ ను ఈ ఏడాదే తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుందట. ఆన్ లైన్ లో లీకైన వివరాల ప్రకారం ఫీచర్ ఫోన్ మైజియో, జియోటీవీ, జియో సినిమా, జియోమ్యూజిక్ యాప్స్ హార్డ్ వేర్ బటన్స్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర కూడా చౌకగా 999 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఉండొచ్చని టాక్. హోమ్ ఆటోమేషన్ అండ్ ఇతర స్మార్ట్ ఉత్పత్తులు... జియో బ్రాడ్ బ్యాండుకు అనుసంధానంగా ఉండే మరిన్ని హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులను కూడా అందించనున్నట్టు తెలుస్తోంది. జియో ఫైబర్ టెక్నాలజీ పై స్పందించగలిగే ఈ ఆటోమేషన్ ప్రొడక్ట్స్ ద్వారా స్మార్ట్ హోమ్ అనుభూతులను ఆస్వాదించే వీలుంటుందని కంపెనీ చెబుతోంది. కొత్త యాప్ జియోమీడియాషేర్ ను కూడా రూపొందిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. పీసీ, ల్యాప్ టాప్ నుంచి తేలికగా స్ట్రీమ్ కంటెంట్ ను మీ మొబైల్ డివైజ్ పైకి పొందవచ్చని సమాచారం. జియో ఇప్పటికే క్రోమోకాస్ట్ ను అభివృద్ధి చేసింది. ఇది పెద్దస్క్రీన్లపై చూసిన అనుభూతిని డివైజ్ లపై పొందవచ్చు.