హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ ‘అపరిమిత’ డేటా | Airtel Broadband Plan FUP Limits Removed in Select Cities | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ ‘అపరిమిత’ డేటా

Published Sat, Jul 7 2018 11:10 AM | Last Updated on Sat, Jul 7 2018 11:10 AM

Airtel Broadband Plan FUP Limits Removed in Select Cities - Sakshi

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌

న్యూఢిల్లీ : టెలికాం రంగంలో మరో బిగ్గెస్ట్‌ గేమ్‌ ఛేంజర్‌గా రిలయన్స్‌ జియో తన ఫైబర్‌ ఆప్టికల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ‘జియోగిగాఫైబర్‌’ ను గత రెండు రోజుల క్రితమే లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. జియో ప్రకటించిన ఈ సేవలకు, గట్టి పోటీ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ రంగంలోకి దిగింది. తన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లపై ఎఫ్‌యూపీ(ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ) పరిమితిని ఎత్తివేసింది. తొలుత ఈ పరిమితిని హైదరాబాద్‌లో తొలగించినట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. దీంతో హైదరాబాద్‌ సర్కిల్‌లో ప్రతి బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌పై కూడా అపరిమిత బ్రాడ్‌బ్యాండ్‌ డేటాను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తుంది. అంటే మీ కనెక్షన్‌పై హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ యాక్సస్‌ను ఎలాంటి డేటా పరిమితి లేకుండా పొందవచ్చు. 

హైదరాబాద్ సర్కిల్‌లో రూ.349 నుంచి రూ.1299 మధ్యలో నాలుగు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తోంది. ఆరు నెలలు, ఏడాది కాలానికి బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ఎంపిక చేసుకునే వారికీ ఈ కంపెనీ 20 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు కూడా గత నెలలోనే ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు అన్ని సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ అపరిమిత డేటా ఆఫర్‌ హైదరాబాద్‌ సర్కిల్‌ మినహాయించి మరే ఇతర సర్కిల్‌లోనూ లేదు. ఢిల్లీలో రూ.799 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌పై 100 జీబీ బ్రాడ్‌బ్యాండ్‌ డేటా పరిమితి ఉంది. 

హైదరాబాద్‌ సర్కిల్‌లో రూ.349 ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకుంటే, 8 ఎంబీపీఎస్‌ వరకు స్పీడులో అపరిమిత డేటా లభ్యమవుతుంది. అదేవిధంగా రూ.1,299 ప్లాన్‌పై 100ఎంబీపీఎస్‌ స్పీడులో డేటా పొందవచ్చు. ఈ స్పీడులో ఈమెయిల్‌ నుంచి డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, ఆడియో, వీడియో ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వెబ్‌ను సర్ఫ్‌ చేసుకోవడం చేయొచ్చు. జియోగిగాఫైబర్‌ ద్వారా 1జీబీపీఎస్‌ స్పీడులో డేటాను అందించనున్నట్టు రిలయన్స్‌ జియో రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement