గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన.. గోధూళి ఎర్రన.. ఆ పాటలో నటుడు ఎవరో తెలుసా?
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)\తూర్పుగోదావరి: ‘నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి..అవి కొత్తవి.. మెత్తవి.. కాలికి హత్తుకు పోయేవి’ అంటూ నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఈ పాట నేటికీ సజీవంగానే ఉంటుంది. ఉర్రూతలూగిస్తుంది.. 1981లో విడుదలైన ముద్దమందారం సినిమాలోని ఈ పాట నాడు కుర్రకారు నోట జోరుగా వినిపించేది. రాజమహేంద్రవరానికి చెందిన జిత్‌మోహన్ మిత్ర పాడిన ఈ పాట ఆయనకు ఓ బ్రాండ్ ఇమేజి తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఈ నటగాయకునిలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. 52 ఏళ్ల క్రితం ఈయన సారథ్యంలో ప్రారంభమైన ఆర్కెస్ట్రా నేటికీ పాటల పల్లకీలో అభిమానులను ఊరేగిస్తూనే ఉంది. వచ్చే నెల 30వ తేదీకి 80 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ పాటల మాంత్రికుడిని రాజమహేంద్రవరం కిషోర్‌కుమార్‌గా పిలిచేవారు..
అలీతో..
వారసత్వ నేపథ్యం..
జిత్‌మోహన్ తండ్రి శ్రీపాద కృష్ణమూర్తి ప్లీడర్ గుమాస్తాగా పని చేస్తూ నాటకాల్లో నటించేవారు. ఆయనకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు పట్టాభి ఆ రోజుల్లోనే సినిమా రంగమంటే చెవికోసుకునే వారు. ఆదుర్తి నిర్మించిన ‘మూగమనసులు’ నుంచి తెరపై గోదావరి కనిపించడం వెనుక పట్టాభి ముద్ర ఎంతో ఉండేది. ఆయన ప్రభావమే జిత్‌మోహన్‌లోనూ కనిపించేది. జిల్లాలో ఏ సినిమా నిర్మించినా తెర వెనుక కీలక పాత్ర పోషించేవారు. ముఖ్యంగా లొకేషన్ల ఎంపికలో దర్శకునికి సహకరించేవారు. దర్శకుడు కె.విశ్వనాథ్ మొదలుకొని అందరూ రాజమహేంహేంద్రవరం రాగానే ఈయన్ను సంప్రదించేవారంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నగరంలో సినిమాలకు కేరాఫ్‌గా గుర్తింపు పొందారు.
కె.విశ్వనాథ్‌తో..
ఆయన నోట.. కిషోర్‌కుమార్ పాట
జిత్‌మోహన్ మిత్రకు పాటలంటే విపరీతమైన ఇష్టం. హిందీలో పాడే కిషోర్‌కుమార్ అంటే ప్రాణం. అందుకే చిన్నప్పటి నుంచీ ఆయన పాటలే ఎక్కువగా పాడేవారు. ఈ ఉత్సాహమే ఆయనను 1970లో ఓ ఆర్కెస్ట్రా పెట్టేలా చేసింది. నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన నేతృత్వంలోని ఆర్కెస్ట్రా రాష్ట్రంలోని అన్నిచోట్లా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆర్కెస్ట్రాలో ఈయన పాటల జోష్ చూసిన దర్శకుడు జంధ్యాల తన ముద్దమందారం సినిమాలో అవకాశమిచ్చారు. అందులో ఈయన పాడిన ‘షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి’ పాట సూపర్ హిట్ అయింది. ఎక్కడ పెళ్లిళ్లయినా ఆర్కెస్ట్రాలో ఈ పాట తప్పనిసరిగా వినిపించేది.
సూత్రధారులు సినిమాలో..
తాను ప్రాణం కన్నా మిన్నగా భావించే కిషోర్‌కుమార్‌ను కలవా లని 1979లో ముంబయి వెళ్లారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్ ఆధ్వర్యంలో సినిమా పాటల రికార్డింగ్ చేస్తున్న సమయంలో దీర్ఘ నిరీక్షణ తర్వాత కిషోర్‌ను కలిశారు. తాను రాజమహేంద్రవరం నుంచి వచ్చానని చెప్పారు. ఆ ఊరెక్కడుందని కిషోర్ అడిగారు. వహీదా రహమాన్, జరీనా వహాబ్, జయప్రదల ఊరు అదేనని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. కిషోర్‌కుమార్ పాడిన పంటూస్ సినిమా లోని ఓ పాట పాడి వినిపించడంతో అచ్చం తనలాగే పాడుతున్నావంటూ ఆయన అభినందించడం నేటికీ తనకు సంతోషం కలిగిస్తుందంటారు జిత్.
అభిరుచి.. ఉత్సాహం
వయసు పెరిగినా ఆయనలో పాట ఉత్సాహం ఏమాత్రం సన్నగిల్లలేదు. ఆ గొంతులోనూ తేడా కనిపించదంటారు అభిమానులు. ఇప్పటికీ ఆర్కెస్ట్రా ద్వారా వేదికలపై గళం వినిపించడంలోనే ఆనందపడుతుంటారు. సంపాదన యావ ఏమాత్రం లేదు. కేవలం అభిరుచి మాత్రమే. అదే ముందుకు నడిపిస్తోంది. ‘2005లో జరిగిన మా ఆర్కెస్ట్రా స్వర్ణోత్స వాల వేడుకకు విశ్వనాథ్‌లాంటి రావడం ఎప్పటికీ మరువను. ఇప్పటి వరకూ 6 వేల ఆర్కెస్ట్రాలు ప్రదర్శించాం’ అని జిత్‌మోహన్‌మిత్ర చెప్పారు.
తెర మీద..
న్యాయవాదిగా ఉంటూ, ఓపక్క ఆర్కెస్ట్రా నడుపుతూ, మరోపక్క సినిమాల నిర్మాణానికి తెరవెనుక పాత్ర పోషించే జిత్‌మోహన్ తెరముందుకు కూడా వచ్చారు. చిన్న పాత్రలే అయినా తనకు గుర్తింపు తెచ్చాయంటారాయన. విశ్వనాథ్ దర్శకత్వంలోని సప్తపదిలో ‘గోవుల్లు తెల్లన.. గోప య్య నల్లన.. గోధూళి ఎర్రన’ పాటలో ఓ పాప ను (ఆయన కుమార్తె సుబ్బలక్ష్మి) భుజాన ఎత్తు కుని సాగే సన్నివేశంలో కనిపించింది ఈయనే.
మిత్ర తన కుమార్తెతో కలిసి ఆ పాటకు అభినయించారు. బాపు, కె.విశ్వనాథ్, బాలచందర్, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ వంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటించారు. శంకరాభరణం, సప్తపది, ఆనందబైరవి, చంటి, స్వాతికిరణం, సిరివెన్నెల, బొబ్బిలి బ్రహ్మన్న, మేఘసందేశం, సీతారత్నం గారి అబ్బాయి, సర్గమ్, సర్ సంగమ్ వంటి సుమారు 210 సినిమాల్లో నటించారు. రాజమహేంద్రవరం నేపథ్యంలోని 400 సినిమాలకు షూటింగ్ స్పాట్ల సహాయకుడిగా ఉన్నారు. ప్రముఖ సినీ నటుడు అలీ తెరంగేట్రం వెనుక కీలక భూమిక మిత్రాదే. జిత్ కుమార్తె సుబ్బలక్ష్మి తరువాత కూడా పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది.