jlm post
-
మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన జేఎల్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపడతామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి ప్రకటించారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో సీపీడీసీఎల్ సాధించిన వార్షిక ప్రగతిని శుక్రవారం మీడియాకు వివరించారు. నీరు, విద్యుత్‌లను వృథా చేయకూడదని, పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గతేడాది డిసెంబర్ 30న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,724 మెగవాట్లు ఉండగా, శుక్రవారం రికార్డు స్థాయిలో 14,107 మెగావాట్లు నమోదైందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో గతేడాది మార్చిలో 3,435 మెగావాట్లు నమోదైంది. 2023 మార్చి నాటికి 4,000 మెగావాట్లు దాటే అవకాశం ఉందని చెప్పారు. కొంతమంది రైతులు తమ మోటార్లకు ఆటోమెటిక్ స్టాటర్లు బిగించి అవసరం లేకపోయినా విద్యుత్ సహా నీటిని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వృథాను అరికట్టడం వల్ల లోటునే కాకుండా విద్యుత్ నష్టాలను అధిగమించొచ్చన్నారు. చదవండి: గ్రూప్–3లో 1,365 కొలువులు -
మనీ కొట్టు జాబ్ పట్టు.. ఎన్పీడీసీఎల్లో చక్రం తిప్పుతున్న కీలక నేత!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కిషన్‌పురలో ఉండే సృజన్ (పేరు మార్చాం)కు జూనియర్ లైన్‌మన్ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ ఎన్పీడీసీఎల్ ఉద్యోగి రూ.10లక్షల డీల్ మాట్లాడుకున్నాడు. ఆ నిరుద్యోగి.. రూ.1.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. రెండు నెలలైనా ఉద్యోగం లేకపోవడంతో గట్టిగా నిలదీశాడు. తనకు ఉద్యోగం అవసరం లేదని గొడవకు దిగడంతో ఆ ఉద్యోగి ఖర్చుల కింద రూ.22వేలు తీసుకుని మిగతా డబ్బులు వాపస్ ఇచ్చాడు. - సిద్దిపేటకు చెందిన అరుణ్ (పేరు మార్చాం) అనే నిరుద్యోగి వద్ద హనుమకొండకు చెందిన ఓ ఎన్పీడీసీఎల్ ఉద్యోగ సంఘం నాయకుడు అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం కోసం రూ.8 లక్షలు ఖర్చవుతుందని రూ.1.50లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. వరుసకు మామ అయ్యే ఓ వ్యక్తిని మధ్యన పెట్టి అరుణ్ డబ్బులు ఇచ్చాడు. 45రోజుల తర్వాత ఉద్యోగం ఉట్టిదేనని తెలుసుకున్న నిరుద్యోగి సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో జాబ్ ప్లేస్మెంట్ పేరుతో పలువురు నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొందరు దళారులను ఏర్పాటు చేసుకుని పాల్పడిన వసూళ్ల దందా బట్టబయలవుతోంది. నిరుద్యోగుల ఆశను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న కొందరిపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆరా తీస్తుండడం ఎన్పీడీసీఎల్లో కలకలం రేపుతోంది. తెరవెనుక ఓ ఉద్యోగ సంఘం నేత.. మొదట ఈ తరహా బాగోతం ఎస్పీడీసీఎల్లో బయటపడడంతో రెండు నెలల క్రితం మలక్‌పేట ఏడీలు సైదులు, ఫిరోజ్, నిత్యలు, లైన్మన్లు శ్రీనివాస్‌లను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హనుమకొండ, జనగామ హుజూరాబాద్ ప్రాంతాలనుంచి ఫిర్యాదు చేసిన వారిని పిలిచి మాట్లాడి ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఇటీవల వరంగల్, హనుమకొండలలో నివాసం ఉండే ఇతర ప్రాంతాలవారితోపాటు పలువురు బాధితులు.. పోలీసులు, ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదు చేశారు. నిరుద్యోగులకు ఎర వేసి డబ్బులు గుంజే ప్రయత్నంలో భాగంగా ఎన్పీడీసీఎల్ హనుమకొండలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్, ఓ ఉద్యోగసంఘం నేత జరిపిన సెల్‌ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులను కూడా బాధితులు అధికారులకు అందజేశారు. దీంతో ఓ వైపు ఎన్పీడీసీఎల్.. మరోవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో గత నెలాఖరులో హనుమకొండ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇంతియాజ్‌ను సస్పెండ్ చేసిన అధికారులు, ఉద్యోగ సంఘం నేతపైనా విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో వసూళ్లకు పాల్పడిన కొందరు అధికారులు, ఉద్యోగసంఘం నేత సదరు బాధితులకు అడ్వాన్స్ తిరిగి చెల్లించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. కాగా ఎన్పీడీసీఎల్లో ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగానికి చెందిన ఓ అధికారి చెప్పారు. ఉద్యోగాల పేరిట భారీగా వసూళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌లలో భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు 2021 జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 1,271 జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం), అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), జూనియర్ అసిస్టెంట్ (జేఏ), బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి విధి విధానాలను ప్రకటించింది. ఆ తర్వాత 2022 జూన్ 18న కూడా ఎన్పీడీసీఎల్లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ మరో నోటిఫికేషన్ ఇచ్చింది. మొదటి నోటిఫికేషన్‌నుంచే కొందరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు నిరుద్యోగుల ఆశను అవకాశంగా తీసుకుని జాబ్ ప్లేస్మెంట్ పేరిట వసూళ్లకు శ్రీకారం చుట్టారు. జేఎల్ఎం, ఏఈ, జేఏ పోస్టులకు రూ.8లక్షల నుంచి రూ.13లక్షల వరకు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ‘ఈ ఖర్చు భరించేందుకు సిద్ధమైతే జాబ్ గ్యారంటీ’అంటూ నమ్మబలికిన దళారులు.. రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పలు ప్రాంతాలనుంచి సుమారు 200మందికిపైగా నిరుద్యోగులనుంచి వసూలు చేసినట్లు తెలిసింది. నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోవడం.. అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వని కారణంగా నిరుద్యోగులు.. మధ్యవర్తులను, పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సుబేదారి, సిద్దిపేట, హైదరాబాద్‌లలో ఇటీవల ఐదు కేసులు నమోదు అయ్యాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఉద్యోగాల పేరిట వసూళ్లకు శ్రీకారం చుట్టిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘం నాయకుడిపై విద్యుత్‌శాఖ విజిలెన్స్ ఉన్నతాధికారికి రెండు రోజుల కింద ఫిర్యాదు చేశారు. -
లిస్ట్‌లో పేరొచ్చినా.. పోస్ట్ రాలే
సాక్షి, సంగారెడ్డి టౌన్: గతేడాది జూలైలో ఐటీఐ ట్రేడ్ పరీక్ష రాసిన విద్యార్థులు అదే ఏడాది అక్టోబర్‌లో వచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జూలైలో పాసైనట్లు సర్టిఫికెట్లు కలిగి ఉండటంతో ఆన్లైన్లో పేర్కొన్న అన్ని విషయాలను చదివి దరఖాస్తును పూర్తి చేశారు. డిసెంబర్ 15, 2019లో పరీక్ష రాశారు. ఫలితాలు రాగానే ర్యాంకుల ఆధారంగా కరెంట్ పోల్ పరీక్షలోనూ నెగ్గారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇలా మెరిట్ సాధించి మంచి ర్యాంకులు కలిసిన అభ్యర్థులు తమ ట్రేడ్ సర్టిఫికెట్లో డేట్ అని ఉన్నచోట నవంబర్ 6 అని ముద్రించడంతో అధికారులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మీ మెమోలు నోటిఫికేషన్ తేదీ తర్వాత ఇష్యూ అయ్యాయంటూ సదరు అభ్యర్థులను ఉద్యోగానికి అనర్హులుగా తేల్చేశారు. చదవండి: ఓఆర్ఆర్.. ఫుల్ జిగేల్! ఇతర పరీక్షలకు భిన్నంగా.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వివిధ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షలన్నింటికీ.. వారు పేర్కొన్న అర్హత కోర్సు నోటిఫికేషన్ వచ్చే నాటికి పాసైతే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులు మాత్రం పరీక్షలో పాసైన నెలను వదిలిపెట్టి.. మెమో తయారు చేసిన తేదీని పరిగణలోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూలైలో ట్రేడ్ కోర్సు పూర్తి చేసుకున్నట్లు సదరు ప్రభుత్వ సంస్థ గుర్తింపు ఇవ్వగా ధ్రువపత్రం తయారీ తేదీని మాత్రమే ఎలా పరిగణలోకి తీసుకుంటామని మండిపడుతున్నారు. న్యాయ పోరాటం చేస్తాం విద్యుత్ శాఖపై మమకాలంతో ఐటీఐ ట్రేడ్ కోర్సు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ గుర్తింపుతో 2019 జూలైలోనే పాసైన అభ్యర్థులు జేఎల్ఎం పరీక్షలో మెరిట్ ర్యాంక్‌లు సాధించినా ఉద్యోగాలివ్వకపోవడం దారుణం. పాసైనా నెల సరి్టఫికెట్లో స్పష్టంగా కనిపిస్తున్నా.. మెమో తయారైన తేదీని ఎలా పరిగణలోకి తీసుకుంటారు. మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చేవరకు న్యాయపోరాటం చేస్తాం. అభ్యర్థులకు మా పూర్తి మద్దతు అందిస్తున్నాం – ప్రభాకర్ గౌడ్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఐఎన్టీయూసీ 327 యూనియన్ జిల్లా అధ్యక్షుడు షాక్ అయ్యాను.. టీఎస్ఎస్పీడీసీఎల్ గతేడాది అక్టోబర్ నెలలో ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకునే నాటికే మేము ఐటీఐ ట్రేడ్ పరీక్ష పాసయ్యాం. సంగారెడ్డి నుంచి నా జిల్లా ర్యాంక్ 468. ఇక్కడ 1000 ర్యాంకు వరకు ఉద్యోగాలొచ్చాయి. కేవలం మెమోపై తేదీ నవంబర్ 6 అని ఉండటం వల్లే ధ్రువపత్రాల పరిశీలన తర్వాత మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అందరిలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఉద్యోగం వస్తుందనుకున్నా.. ఫైనల్ రిజల్ట్‌లో నా పేరు, హాల్ టికెట్ నెంబర్ లేకపోవడం చూసి షాకయ్యా.. – సురేష్ నాయక్, సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో మెరిట్ ర్యాంక్ వచ్చి పోస్ట్ కోల్పోయిన అభ్యర్థుల వివరాలు జిల్లా అభ్యర్థుల సంఖ్య సిద్దిపేట 12 సంగారెడ్డి 08 మెదక్ 05 మొత్తం 25 -
ఉద్యోగం కావాలా నాయనా...
విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్: లడ్డూ కావాలా నాయనా..అని ఇటీవల టీవీల్లో వస్తున్న వాణిజ్య ప్రకటనల తరహాలోనే ఏ చిన్న ఉద్యోగ ప్రకటన వెలువడినా దళారులు రంగంలోకి దిగిపోతున్నారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న జేఎల్ఎం పోస్టుల భర్తీ మళ్లీ తెరపైకి రావడంతో ఆ శాఖ ఉద్యోగులతో పాటు అధికార పార్టీ అండదండలు ఉన్న చోటామోటా నేతలు పండగ చేసుకుంటున్నారు. ఈ పోస్టులకు విద్యార్హతలు పెద్దగా అవసరం లేకపోవడం, వేతనం రూ.15వేల వరకు ఉండడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. విద్యుత్ సబ్స్టేషన్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న ఆపరేటర్లకు ఈ పోస్టుల్లో వెయిటేజీ తగ్గించడంతో సాధారణ అభ్యర్థుల చూపు ఈ పోస్టులపై పడింది. దీంతో ఆ శాఖలోని కొందరు ఉద్యోగులు, నేతలు తమ పవర్ చూపి ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థులను మభ్యపెడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక్కో పోస్టుకు లక్షల్లో బేరసారాలు సాగిస్తున్నారు. ఏప్రిల్ 1వరకు దరఖాస్తుల స్వీకరణ... జిల్లాలో 127 జూనియర్ లైన్మెన్, ఎనిమిది ఎల్డీసీ పోస్టుల భర్తీకి సంబంధించి 2011లో విద్యుత్ శాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పట్లో సుమారు 1400 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రక్రియ అప్పట్లో నిలిచిపోయింది. తాజాగా మళ్లీ విద్యుత్ శాఖ అధికారులు పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనే ఈ పోస్టుల భర్తీపై విద్యుత్ శాఖ పెద్దగా ప్రచారం చేయకుండానే అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం గమనార్హం. తాజాగా గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కాకుండా కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 1వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అయితే నియామక ప్రక్రియలో సబ్స్టేషన్లలో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న ఆపరేటర్లకు 40 శాతం ఉన్న వెయిటేజీని 20 శాతానికి తగ్గించడంతో ఈ ఉద్యోగాలపై సాధారణ అభ్యర్థుల కన్నుపడడంతో ఈ పోస్టులకు దళారులు ఎక్కువయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పోస్టుకు రూ.లక్షల్లో బేరసారాలు ఇదిలా ఉండగా జేఎల్ఎం పోస్టులకు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్ కోర్సులు చదివిన వారు ఈ పోస్టులకు అర్హులు. మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సబ్స్టేషన్లలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న సిబ్బందికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఏడాదికి కొన్ని మార్కులు చొప్పున వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న దళారులు అభ్యర్థుల నుంచి డబ్బు దండుకునేందుకు తమదైన శైలిలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంట్లో విద్యుత్ శాఖ అధికారులకు అధికార పార్టీ అండదండలు ఉన్న నేతలు జతకలిసినట్లు సమాచారం. ఇందులో భాగంగా అభ్యర్థులు ముందుగా కొంత మొత్తం చెల్లించి, మిగిలిన మొత్తాన్ని పోస్టు వచ్చిన తర్వాత చెల్లించేలా ప్రాంసరీ నోట్లు రాయిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పలుకు బడితో సబ్స్టేషన్లలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పొందిన వారికి ఈ పోస్టుల భర్తీకి కావాల్సిన విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు లేకపోతే నకిలీవి సంపాదించిపెడతామని చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు అదనంగా ఖర్చవుతుందని దరఖాస్తు దాఖలు చేసినప్పటి నుంచి విధుల్లో చేరేంత వరకు అంతా తమదే బాధ్యత అని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. పారదర్శకంగానే నియామకాలు: ఎస్ఈ ఇదే విషయమై విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ దత్తి. సత్యనారాయణ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా..జేఎల్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ అంతా పారదర్శ కంగా జరుగుతుందన్నారు. సబ్‌స్టేషన్‌లో పని చేసే కాంట్రాక్ట్ సిబ్బందికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అభ్యర్థి స్తంభం ఎక్కడం ఈ నియామకానికి కీలకమని, ఈ పరీక్షను వీడియో తీయిస్తామని చెప్పారు. నెలాఖరున ఈ ప్రక్రియ ఉంటుందన్నారు. దళారుల మాటలు నమ్మొద్దని ఎస్ఈ స్పష్టం చేశారు.