సాక్షి ప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కిషన్‌పురలో ఉండే సృజన్ (పేరు మార్చాం)కు జూనియర్ లైన్‌మన్ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ ఎన్‌పీడీసీఎల్ ఉద్యోగి రూ.10లక్షల డీల్ మాట్లాడుకున్నాడు. ఆ నిరుద్యోగి.. రూ.1.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. రెండు నెలలైనా ఉద్యోగం లేకపోవడంతో గట్టిగా నిలదీశాడు. తనకు ఉద్యోగం అవసరం లేదని గొడవకు దిగడంతో ఆ ఉద్యోగి ఖర్చుల కింద రూ.22వేలు తీసుకుని మిగతా డబ్బులు వాపస్ ఇచ్చాడు.
- సిద్దిపేటకు చెందిన అరుణ్ (పేరు మార్చాం) అనే నిరుద్యోగి వద్ద హనుమకొండకు చెందిన ఓ ఎన్‌పీడీసీఎల్ ఉద్యోగ సంఘం నాయకుడు అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం కోసం రూ.8 లక్షలు ఖర్చవుతుందని రూ.1.50లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. వరుసకు మామ అయ్యే ఓ వ్యక్తిని మధ్యన పెట్టి అరుణ్ డబ్బులు ఇచ్చాడు. 45రోజుల తర్వాత ఉద్యోగం ఉట్టిదేనని తెలుసుకున్న నిరుద్యోగి సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్)లో జాబ్ ప్లేస్‌మెంట్ పేరుతో పలువురు నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొందరు దళారులను ఏర్పాటు చేసుకుని పాల్పడిన వసూళ్ల దందా బట్టబయలవుతోంది. నిరుద్యోగుల ఆశను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న కొందరిపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆరా తీస్తుండడం ఎన్‌పీడీసీఎల్‌లో కలకలం రేపుతోంది.
తెరవెనుక ఓ ఉద్యోగ సంఘం నేత..
మొదట ఈ తరహా బాగోతం ఎస్‌పీడీసీఎల్‌లో బయటపడడంతో రెండు నెలల క్రితం మలక్‌పేట ఏడీలు సైదులు, ఫిరోజ్, నిత్యలు, లైన్‌మన్లు శ్రీనివాస్‌లను హైదరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హనుమకొండ, జనగామ హుజూరాబాద్ ప్రాంతాలనుంచి ఫిర్యాదు చేసిన వారిని పిలిచి మాట్లాడి ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఇటీవల వరంగల్, హనుమకొండలలో నివాసం ఉండే ఇతర ప్రాంతాలవారితోపాటు పలువురు బాధితులు.. పోలీసులు, ఎన్‌పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదు చేశారు.
నిరుద్యోగులకు ఎర వేసి డబ్బులు గుంజే ప్రయత్నంలో భాగంగా ఎన్‌పీడీసీఎల్ హనుమకొండలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్, ఓ ఉద్యోగసంఘం నేత జరిపిన సెల్‌ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులను కూడా బాధితులు అధికారులకు అందజేశారు. దీంతో ఓ వైపు ఎన్‌పీడీసీఎల్.. మరోవైపు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో గత నెలాఖరులో హనుమకొండ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇంతియాజ్‌ను సస్పెండ్ చేసిన అధికారులు, ఉద్యోగ సంఘం నేతపైనా విచారణ జరుపుతున్నారు.
ఈ క్రమంలో వసూళ్లకు పాల్పడిన కొందరు అధికారులు, ఉద్యోగసంఘం నేత సదరు బాధితులకు అడ్వాన్స్ తిరిగి చెల్లించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. కాగా ఎన్‌పీడీసీఎల్‌లో ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగానికి చెందిన ఓ అధికారి చెప్పారు.
ఉద్యోగాల పేరిట భారీగా వసూళ్లు..
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌లలో భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు 2021 జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 1,271 జూనియర్ లైన్‌మన్ (జేఎల్‌ఎం), అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), జూనియర్ అసిస్టెంట్ (జేఏ), బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి విధి విధానాలను ప్రకటించింది. ఆ తర్వాత 2022 జూన్ 18న కూడా ఎన్‌పీడీసీఎల్‌లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ మరో నోటిఫికేషన్ ఇచ్చింది. మొదటి నోటిఫికేషన్‌నుంచే కొందరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు నిరుద్యోగుల ఆశను అవకాశంగా తీసుకుని జాబ్ ప్లేస్‌మెంట్ పేరిట వసూళ్లకు శ్రీకారం చుట్టారు.
జేఎల్‌ఎం, ఏఈ, జేఏ పోస్టులకు రూ.8లక్షల నుంచి రూ.13లక్షల వరకు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ‘ఈ ఖర్చు భరించేందుకు సిద్ధమైతే జాబ్ గ్యారంటీ’అంటూ నమ్మబలికిన దళారులు.. రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పలు ప్రాంతాలనుంచి సుమారు 200మందికిపైగా నిరుద్యోగులనుంచి వసూలు చేసినట్లు తెలిసింది. నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోవడం.. అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వని కారణంగా నిరుద్యోగులు.. మధ్యవర్తులను, పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సుబేదారి, సిద్దిపేట, హైదరాబాద్‌లలో ఇటీవల ఐదు కేసులు నమోదు అయ్యాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఉద్యోగాల పేరిట వసూళ్లకు శ్రీకారం చుట్టిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘం నాయకుడిపై విద్యుత్‌శాఖ విజిలెన్స్ ఉన్నతాధికారికి రెండు రోజుల కింద ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment