fake job appointments
-
మోసగాళ్లతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: హైకోర్టుతోపాటు దిగువ కోర్టుల్లో భారీగా పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో దానిని సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు రంగంలోకి దిగారు. డబ్బు ఇస్తే ఉద్యోగం గ్యారెంటీ... అంటూ అభ్యర్థులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏకంగా హైకోర్టు రిజిస్ట్రార్ల సంతకాలను ఫోర్జరీ చేసి ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేసేస్తున్నారు. కొన్నిచోట్ల హైకోర్టు న్యాయమూర్తులు, అధికారుల పేర్లు వాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తమ దృష్టికి రావడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటీవల నకిలీ ఉద్యోగ నియామకపత్రాలను జారీ చేసిన మోసగాళ్లతోపాటు వారి నుంచి నియామకపత్రం పొందిన ఒక వ్యక్తిపై కూడా గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టుల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన 15మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మోసగాళ్లకు, వారి బారిన పడుతున్న అభ్యర్థులకు హైకోర్టు గట్టి హెచ్చరికలు చేస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే మోసగాళ్లు, కుట్రదారుల చేతిలో మోసపోవద్దంటూ అభ్యర్థులను హైకోర్టు హెచ్చరించింది. న్యాయమూర్తులు, అధికారుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తులు, వారికి సహకరించేవారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించే ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టే సమస్యే లేదని స్పష్టం చేసింది. ఉద్యోగాల విషయంలో తప్పుడు వార్తలను, పోస్టులను వ్యాప్తి చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు హైకోర్టు వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని సూచించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపు మాటలు చెప్పే వ్యక్తులు, నకిలీ నియామక పత్రాలు ఇచ్చే వారు తారసపడితే వారి గురించి హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఆ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) ఆలపాటి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. -
మనీ కొట్టు జాబ్ పట్టు.. ఎన్పీడీసీఎల్లో చక్రం తిప్పుతున్న కీలక నేత!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కిషన్‌పురలో ఉండే సృజన్ (పేరు మార్చాం)కు జూనియర్ లైన్‌మన్ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ ఎన్పీడీసీఎల్ ఉద్యోగి రూ.10లక్షల డీల్ మాట్లాడుకున్నాడు. ఆ నిరుద్యోగి.. రూ.1.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. రెండు నెలలైనా ఉద్యోగం లేకపోవడంతో గట్టిగా నిలదీశాడు. తనకు ఉద్యోగం అవసరం లేదని గొడవకు దిగడంతో ఆ ఉద్యోగి ఖర్చుల కింద రూ.22వేలు తీసుకుని మిగతా డబ్బులు వాపస్ ఇచ్చాడు. - సిద్దిపేటకు చెందిన అరుణ్ (పేరు మార్చాం) అనే నిరుద్యోగి వద్ద హనుమకొండకు చెందిన ఓ ఎన్పీడీసీఎల్ ఉద్యోగ సంఘం నాయకుడు అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం కోసం రూ.8 లక్షలు ఖర్చవుతుందని రూ.1.50లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. వరుసకు మామ అయ్యే ఓ వ్యక్తిని మధ్యన పెట్టి అరుణ్ డబ్బులు ఇచ్చాడు. 45రోజుల తర్వాత ఉద్యోగం ఉట్టిదేనని తెలుసుకున్న నిరుద్యోగి సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో జాబ్ ప్లేస్మెంట్ పేరుతో పలువురు నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొందరు దళారులను ఏర్పాటు చేసుకుని పాల్పడిన వసూళ్ల దందా బట్టబయలవుతోంది. నిరుద్యోగుల ఆశను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న కొందరిపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆరా తీస్తుండడం ఎన్పీడీసీఎల్లో కలకలం రేపుతోంది. తెరవెనుక ఓ ఉద్యోగ సంఘం నేత.. మొదట ఈ తరహా బాగోతం ఎస్పీడీసీఎల్లో బయటపడడంతో రెండు నెలల క్రితం మలక్‌పేట ఏడీలు సైదులు, ఫిరోజ్, నిత్యలు, లైన్మన్లు శ్రీనివాస్‌లను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హనుమకొండ, జనగామ హుజూరాబాద్ ప్రాంతాలనుంచి ఫిర్యాదు చేసిన వారిని పిలిచి మాట్లాడి ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఇటీవల వరంగల్, హనుమకొండలలో నివాసం ఉండే ఇతర ప్రాంతాలవారితోపాటు పలువురు బాధితులు.. పోలీసులు, ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదు చేశారు. నిరుద్యోగులకు ఎర వేసి డబ్బులు గుంజే ప్రయత్నంలో భాగంగా ఎన్పీడీసీఎల్ హనుమకొండలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్, ఓ ఉద్యోగసంఘం నేత జరిపిన సెల్‌ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులను కూడా బాధితులు అధికారులకు అందజేశారు. దీంతో ఓ వైపు ఎన్పీడీసీఎల్.. మరోవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో గత నెలాఖరులో హనుమకొండ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇంతియాజ్‌ను సస్పెండ్ చేసిన అధికారులు, ఉద్యోగ సంఘం నేతపైనా విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో వసూళ్లకు పాల్పడిన కొందరు అధికారులు, ఉద్యోగసంఘం నేత సదరు బాధితులకు అడ్వాన్స్ తిరిగి చెల్లించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. కాగా ఎన్పీడీసీఎల్లో ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగానికి చెందిన ఓ అధికారి చెప్పారు. ఉద్యోగాల పేరిట భారీగా వసూళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌లలో భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు 2021 జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 1,271 జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం), అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), జూనియర్ అసిస్టెంట్ (జేఏ), బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి విధి విధానాలను ప్రకటించింది. ఆ తర్వాత 2022 జూన్ 18న కూడా ఎన్పీడీసీఎల్లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ మరో నోటిఫికేషన్ ఇచ్చింది. మొదటి నోటిఫికేషన్‌నుంచే కొందరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు నిరుద్యోగుల ఆశను అవకాశంగా తీసుకుని జాబ్ ప్లేస్మెంట్ పేరిట వసూళ్లకు శ్రీకారం చుట్టారు. జేఎల్ఎం, ఏఈ, జేఏ పోస్టులకు రూ.8లక్షల నుంచి రూ.13లక్షల వరకు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ‘ఈ ఖర్చు భరించేందుకు సిద్ధమైతే జాబ్ గ్యారంటీ’అంటూ నమ్మబలికిన దళారులు.. రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పలు ప్రాంతాలనుంచి సుమారు 200మందికిపైగా నిరుద్యోగులనుంచి వసూలు చేసినట్లు తెలిసింది. నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోవడం.. అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వని కారణంగా నిరుద్యోగులు.. మధ్యవర్తులను, పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సుబేదారి, సిద్దిపేట, హైదరాబాద్‌లలో ఇటీవల ఐదు కేసులు నమోదు అయ్యాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఉద్యోగాల పేరిట వసూళ్లకు శ్రీకారం చుట్టిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘం నాయకుడిపై విద్యుత్‌శాఖ విజిలెన్స్ ఉన్నతాధికారికి రెండు రోజుల కింద ఫిర్యాదు చేశారు. -
ఐటీ ఉద్యోగాలని రూ.50 లక్షలకు టోపీ
బనశంకరి: నకిలీ ఐటీ కంపెనీల ముసుగులో ఒక ముఠా నిరుద్యోగ యువతీ యువకులను మోసగించింది. నగరంలో బొమ్మనహళ్లి పరిధిలో శివరాజ్ అనే వ్యక్తి నకిలీ ఐటీ కంపెనీ తెరిచి 600 మందికి పైగా యువతీ యువకుల నుంచి డబ్బు వసూలు చేసి టోకరా వేశాడు. ఇతడు నిర్వహిస్తున్న విటోబస్ సీఎంఎస్ కంపెనీ ఉద్యోగులు బొమ్మనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 3 గేర్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో ఇతడు, అనుచరులైన అమర్, అంజలి, శశికిరణ్ కలిసి వందలాదిమంది నుంచి నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు ఇస్తానని రూ.50 లక్షల వరకూ వసూలు చేశాడు. మూడునెలలకే కంపెనీలన్నీ మూసేయడంతో ఉద్యోగులు వీధినపడ్డారు. ప్రస్తుతం నలుగురూ పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని విచారిస్తున్నామని, త్వరలోనే అన్ని విషయాలూ తెలుస్తాయని డీసీపీ బోరలింగయ్య తెలిపారు. పోలీసు స్టేషన్ల ముందు బాధితుల ధర్నా బాధితులు బుధవారం పరప్పన అగ్రహార, బొమ్మనహళ్లి పోలీస్స్టేషన్లు ముందు ధర్నాకు దిగి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫేస్బుక్లో పెట్టిన ఉద్యోగ ప్రకటన చూసి వివిధ రాష్ట్రాల నుంచి నిరుద్యోగులు శివరాజ్‌ను సంప్రదించారు. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు, లక్షకు పైగా వసూలు చేసి, మీరు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఐడీకార్డులు అందించి ఒక భవనంలో కొన్ని కంప్యూటర్లతో ఎక్స్‌ప్రొటినో ప్రో అనే కంపెనీ తెరిచాడు. మూడునెలలు వారితో పనిచేయించాడు. స్వల్ప మొత్తంలో జీతాలిచ్చిఆడు. ప్రాజెక్ట్ ఫెయిల్ కావడంతో కంపెనీ నష్టపోయిందని వారిని నమ్మించి మూడునెలల పాటు కంపెనీ మూసివేశాడు. దానికి తాళం వేసిన శివరాజ్ కొన్నాళ్లకు విటోబస్ సీఎంఎస్ పేరుతో బొమ్మనహళ్లిలో కొత్త కంపెనీ తెరిచాడు. ప్రస్తుతం ఈ కంపెనీ కూడా నష్టంలో ఉందని ఉద్యోగులను నమ్మించి మూసివేశాడు. తల్లి నగలు అమ్మి రూ.1.15 లక్షలు అప్పగింత హైదరాబాద్ కు చెందిన ఐశ్వర్య అనే యువతి కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఫేస్బుక్లో ముఠా ఉద్యోగ ప్రకటన చూసి ఎక్స్‌ప్రొటినో ప్రో కంపెనీలో ఉద్యోగం కోసమని బెంగళూరుకు వచ్చింది. శివరాజ్ రిజిస్ట్రేషన్ ఫీజులంటూ ఆమె వద్ద నుంచి రూ.1.15 లక్షలు తీసుకున్నాడు. ఐశ్వర్య తల్లి బంగారు నగలు అమ్మి ఈ డబ్బు ఇచ్చుకుని మోసపోయింది. రకరకాల పేర్లతో నకిలీ కంపెనీలు వింకో గ్రూప్, క్లౌడ్‌సాఫ్ట్ టెక్నాలజీస్, అక్కోటిక, జేబీఎస్ టెక్ సొల్యూష న్స్ ఇలా రకరకాల పేర్లుతో కంపెనీలు తెరిచి శివరాజ్ అండ్ గ్యాంగ్ నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకున్నట్లు ఐటీ ఉద్యోగుల సంఘం పోలీ స్ అధికారులకు సమాచారం ఇచ్చింది. శివరాజ్ అతడి అనుచరులు కొత్తగా కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి టార్గెట్ చేసుకుని వంచన కు పాల్పడ్డారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన నిరుద్యోగులు కంపెనీ తాళం వేసి ఉండటాన్ని గమనించి తక్షణం వెనక్కి వెళ్తున్నారు. నేవీ అధికారికి బెదిరింపులు హైదరాబాద్ నౌకాదళ అధికారి అమరనాథ్ కుటుంబానికి చెందిన నలుగురికి శివరాజ్ ముఠా భారీగా డబ్బు వసూలు చేసి టోపీ వేసింది. అమరనాథ్ ఫోన్ చేసి డబ్బు వెనక్కి ఇవ్వాలని అడిగారు. ఇచ్చిన డబ్బు వెనక్కిరాదని, నీకు దమ్ముంటే బెంగళూరుకు వచ్చి మాట్లాడాలని శివరాజ్ ఆయనను బెదిరించాడు. నేను బెంగళూరుకు వచ్చాను, కానీ వంచకుడు ముఖం చాటేశాడని, చిక్కినట్లైతే పోలీసులకు అప్పగించేవాడినని అమరనాథ్ తెలిపారు. -
50 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం
న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చాక లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ప్రధాని మోదీ మాటలు తప్పని ఓ సర్వే వెల్లడించింది. గత ఏడాది దేశంలో నిరుద్యోగం రేటు 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువగా 6.1 శాతం ఉందని జాతీయ నమూనా సర్వే స్పష్టం చేసింది. 2017–18 సంవత్సరంలో దేశంలో నిరుద్యోగం రేటు 6.1 శాతంగా ఉందని నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్(ఎన్ఎస్ఎస్ఓ) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. గత ఏడాది(2017–18) నిరుద్యోగిత పట్టణ ప్రాంతాల మహిళల్లో 27.2 శాతం, పురుషుల్లో 18.7 శాతం కాగా, అదే గ్రామీణ మహిళల్లో 13.6 శాతం, పురుషుల్లో 17.4 శాతంగా ఉందని తెలిపింది. పీఎల్ఎఫ్ఎస్ నివేదికను ఎన్ఎస్ఎస్ఓ కార్యాలయం ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను వెల్లడించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన మహిళల్లో 2004–05 నుంచి 2011–12 మధ్య నిరుద్యోగిత 9.7 శాతం నుంచి 15.2 శాతం వరకు ఉండగా 2017–18లో అది 17.3 శాతానికి పెరిగింది. పురుషుల్లో ఇది 3.5 శాతం నుంచి 4.4 శాతం ఉండగా, ఇప్పుడు 10.5 శాతానికి పెరిగింది. యువతలో నిరుద్యోగిత అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే గత ఏడాది అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 15–29 ఏళ్ల మధ్య వారిలో నిరుద్యోగం రేటు 2011–12లో 5 శాతం ఉండగా, 2017–18లో అది మూడు రెట్లకుపైగా పెరిగి 17.4 శాతానికి చేరుకుంది. అయితే, ఈ నివేదిక ముసాయిదా మాత్రమేననీ, దీనిని ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ తెలిపారు. -
ఉద్యోగాల పేరుతో టోకరా
అనంతపురం టౌన్: నిరుద్యోగుల బలహీనతను ఆసరగా వారికి టోకరా ఇచ్చి డబ్బులు గడించేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరికి నకిలీ నియామక ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఇలాంటి ఉత్తర్వుతో ఒక వ్యక్తి మేయర్ స్వరూప వద్దకు రెండు రోజుల కిందట వచ్చి చూపించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అవాక్కయ్యారు. సంస్థలో ఎలాంటి ఖాళీలు లేవు. అది నకిలీ ఉత్తర్వని ఆ వ్యక్తికి చెప్పి పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ఆమె తీవ్రంగా పరిగణించి అధికారులను అప్రమత్తం చేశారు. వివరాల్లోకి వెళితే కార్పొరేషన్లో కాంట్రాక్టు పద్ధతితో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చినట్లు ఒక వ్యక్తి మేయర్ ఇంటి వద్దకు నియామక ఉత్తర్వు తీసుకొచ్చారు. దానిపైన అధికారుల సంతకాలు (పోర్జరీ) ఉన్నాయి. దాన్ని పరిశీలించిన ఆమె ఉత్తర్వు ఎవరు ఇచ్చారని ఆ వ్యక్తిని అడిగారు. తన స్నేహితుని వద్ద నుంచి ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని కంప్యూటర్ ఆపరేటర్‌గా కార్పొరేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నియామక ఉత్తర్వు ఇచ్చినట్లు అతను చెప్పాడు. సంస్థలో ఎలాంటి కాంట్రాక్టు పోస్టులు లేవు. ఎప్పుడైనా ఖాళీలు ఏర్పడితే ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే భర్తీ చేసుకుంటాము. ఇలా నేరుగా సంస్థ ఉత్తర్వులు ఇవ్వదని చెబుతూ దాన్ని పరిశీలించి అది నకిలీదని గుర్తించారు. మీ స్నేహితునికి ఈ ఉత్తర్వు ఎవరు ఇచ్చారని అడిగారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, మా స్నేహితుడిని పిలుచుకు వస్తానని చెప్పి ఉత్తర్వు తీసుకుని వెళ్లిపోయాడని తెలిసింది. అటు తరువాత ఆ వ్యక్తి మళ్లీ మేయర్ వద్దకు రాలేదు. ఇంటి దొంగల పనేనా.. కాంట్రాక్టు ఉద్యోగాలకు నకిలీ నియామక ఉత్తర్వులు ఇస్తూ మోసం చేస్తున్న వారు ఇంటి దొంగలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా ప్రజాప్రతినిధులు దీని వెనుక ఉన్నారా..? లేక బయటివారితో కలిసి ఇక్కడి సిబ్బంది ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంత ధైర్యంగా అధికారుల సంతకాలను పోర్జరీ చేసి ఏకంగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నారంటే ఇదో పెద్ద రాకెట్లా జరుగుతోంది. బయటి వారెవరైనా ఇలాంటి వ్యవహారం నడుపుతున్నారా అనేది విచారణ జరిపిస్తే వెలుగు చూసే అవకాశం ఉంది. అనంతపురం కార్పొరేషన్ ఒక్కదాంట్లోనేనా లేక ఇతర మునిసిపాలిటీల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్నారా అనేదానిపై విచారణ చేయాల్సి అవసరం ఉంది. ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మకండి: స్వరూప, మేయర్ కార్పొరేషన్లో ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా చెపితే నమ్మకండి. అలాంటి వారి మాయలో పడి డబ్బులు పోగొట్టుకోకండి. ప్రజలు దీన్ని గుర్తుంచుకోవాలి. సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఖాళీ లేవు. ఎప్పుడైనా ఒకటో రెండు ఖాళీ ఏర్పడితే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వాటిని భర్తీ చేస్తాము. తప్పితే నేరుగా నియామకం ఉండదు. ఇక నకిలీ నియామక ఉత్తర్వులపై అధికారులను అప్రమత్తం చేశాను. సంస్థలో సిబ్బందిలో ఎవరైనా ఇంటి చర్యలకు పాల్పడుతున్నారా అనే కోణంలో విచారణ చేయాలని ఆదే శించాను. తన వద్దకు వచ్చిన వ్యక్తి వద్ద ఉన్న నకిలీ నియామక ఉత్తర్వు జిరాక్స్ కాపీ తీసుకోలేదు. ఆ కాపీ ఉంటే కేసు పెట్టేవాళ్లం.