అనంతపురం టౌన్: నిరుద్యోగుల బలహీనతను ఆసరగా వారికి టోకరా ఇచ్చి డబ్బులు గడించేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరికి నకిలీ నియామక ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఇలాంటి ఉత్తర్వుతో ఒక వ్యక్తి మేయర్ స్వరూప వద్దకు రెండు రోజుల కిందట వచ్చి చూపించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అవాక్కయ్యారు. సంస్థలో ఎలాంటి ఖాళీలు లేవు. అది నకిలీ ఉత్తర్వని ఆ వ్యక్తికి చెప్పి పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ఆమె తీవ్రంగా పరిగణించి అధికారులను అప్రమత్తం చేశారు.
వివరాల్లోకి వెళితే కార్పొరేషన్‌లో కాంట్రాక్టు పద్ధతితో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చినట్లు ఒక వ్యక్తి మేయర్ ఇంటి వద్దకు నియామక ఉత్తర్వు తీసుకొచ్చారు. దానిపైన అధికారుల సంతకాలు (పోర్జరీ) ఉన్నాయి. దాన్ని పరిశీలించిన ఆమె ఉత్తర్వు ఎవరు ఇచ్చారని ఆ వ్యక్తిని అడిగారు. తన స్నేహితుని వద్ద నుంచి ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని కంప్యూటర్ ఆపరేటర్‌గా కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నియామక ఉత్తర్వు ఇచ్చినట్లు అతను చెప్పాడు. సంస్థలో ఎలాంటి కాంట్రాక్టు పోస్టులు లేవు. ఎప్పుడైనా ఖాళీలు ఏర్పడితే ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే భర్తీ చేసుకుంటాము. ఇలా నేరుగా సంస్థ ఉత్తర్వులు ఇవ్వదని చెబుతూ దాన్ని పరిశీలించి అది నకిలీదని గుర్తించారు. మీ స్నేహితునికి ఈ ఉత్తర్వు ఎవరు ఇచ్చారని అడిగారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, మా స్నేహితుడిని పిలుచుకు వస్తానని చెప్పి ఉత్తర్వు తీసుకుని వెళ్లిపోయాడని తెలిసింది. అటు తరువాత ఆ వ్యక్తి మళ్లీ మేయర్ వద్దకు రాలేదు.
ఇంటి దొంగల పనేనా..
కాంట్రాక్టు ఉద్యోగాలకు నకిలీ నియామక ఉత్తర్వులు ఇస్తూ మోసం చేస్తున్న వారు ఇంటి దొంగలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా ప్రజాప్రతినిధులు దీని వెనుక ఉన్నారా..? లేక బయటివారితో కలిసి ఇక్కడి సిబ్బంది ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంత ధైర్యంగా అధికారుల సంతకాలను పోర్జరీ చేసి ఏకంగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నారంటే ఇదో పెద్ద రాకెట్‌లా జరుగుతోంది. బయటి వారెవరైనా ఇలాంటి వ్యవహారం నడుపుతున్నారా అనేది విచారణ జరిపిస్తే వెలుగు చూసే అవకాశం ఉంది. అనంతపురం కార్పొరేషన్ ఒక్కదాంట్లోనేనా లేక ఇతర మునిసిపాలిటీల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్నారా అనేదానిపై విచారణ చేయాల్సి అవసరం ఉంది.
ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మకండి: స్వరూప, మేయర్
కార్పొరేషన్‌లో ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా చెపితే నమ్మకండి. అలాంటి వారి మాయలో పడి డబ్బులు పోగొట్టుకోకండి. ప్రజలు దీన్ని గుర్తుంచుకోవాలి. సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఖాళీ లేవు. ఎప్పుడైనా ఒకటో రెండు ఖాళీ ఏర్పడితే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వాటిని భర్తీ చేస్తాము. తప్పితే నేరుగా నియామకం ఉండదు. ఇక నకిలీ నియామక ఉత్తర్వులపై అధికారులను అప్రమత్తం చేశాను. సంస్థలో సిబ్బందిలో ఎవరైనా ఇంటి చర్యలకు పాల్పడుతున్నారా అనే కోణంలో విచారణ చేయాలని ఆదే శించాను. తన వద్దకు వచ్చిన వ్యక్తి వద్ద ఉన్న నకిలీ నియామక ఉత్తర్వు జిరాక్స్ కాపీ తీసుకోలేదు. ఆ కాపీ ఉంటే కేసు పెట్టేవాళ్లం.
ఉద్యోగాల పేరుతో టోకరా
Published Wed, Mar 18 2015 9:00 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM
Advertisement
Advertisement