సాక్షి, అమరావతి: హైకోర్టుతోపాటు దిగువ కోర్టుల్లో భారీగా పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో దానిని సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు రంగంలోకి దిగారు. డబ్బు ఇస్తే ఉద్యోగం గ్యారెంటీ... అంటూ అభ్యర్థులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏకంగా హైకోర్టు రిజిస్ట్రార్ల సంతకాలను ఫోర్జరీ చేసి ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేసేస్తున్నారు. కొన్నిచోట్ల హైకోర్టు న్యాయమూర్తులు, అధికారుల పేర్లు వాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తమ దృష్టికి రావడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఇటీవల నకిలీ ఉద్యోగ నియామకపత్రాలను జారీ చేసిన మోసగాళ్లతోపాటు వారి నుంచి నియామకపత్రం పొందిన ఒక వ్యక్తిపై కూడా గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టుల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన 15మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మోసగాళ్లకు, వారి బారిన పడుతున్న అభ్యర్థులకు హైకోర్టు గట్టి హెచ్చరికలు చేస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే మోసగాళ్లు, కుట్రదారుల చేతిలో మోసపోవద్దంటూ అభ్యర్థులను హైకోర్టు హెచ్చరించింది.
న్యాయమూర్తులు, అధికారుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తులు, వారికి సహకరించేవారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించే ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టే సమస్యే లేదని స్పష్టం చేసింది. ఉద్యోగాల విషయంలో తప్పుడు వార్తలను, పోస్టులను వ్యాప్తి చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు హైకోర్టు వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని సూచించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపు మాటలు చెప్పే వ్యక్తులు, నకిలీ నియామక పత్రాలు ఇచ్చే వారు తారసపడితే వారి గురించి హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఆ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) ఆలపాటి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు.
మోసగాళ్లతో జాగ్రత్త
Published Wed, Nov 16 2022 5:04 AM | Last Updated on Wed, Nov 16 2022 5:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment