నిందితులు వీరే
బనశంకరి: నకిలీ ఐటీ కంపెనీల ముసుగులో ఒక ముఠా నిరుద్యోగ యువతీ యువకులను మోసగించింది. నగరంలో బొమ్మనహళ్లి పరిధిలో శివరాజ్ అనే వ్యక్తి నకిలీ ఐటీ కంపెనీ తెరిచి 600 మందికి పైగా యువతీ యువకుల నుంచి డబ్బు వసూలు చేసి టోకరా వేశాడు. ఇతడు నిర్వహిస్తున్న విటోబస్ సీఎంఎస్ కంపెనీ ఉద్యోగులు బొమ్మనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 3 గేర్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో ఇతడు, అనుచరులైన అమర్, అంజలి, శశికిరణ్ కలిసి వందలాదిమంది నుంచి నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు ఇస్తానని రూ.50 లక్షల వరకూ వసూలు చేశాడు. మూడునెలలకే కంపెనీలన్నీ మూసేయడంతో ఉద్యోగులు వీధినపడ్డారు. ప్రస్తుతం నలుగురూ పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని విచారిస్తున్నామని, త్వరలోనే అన్ని విషయాలూ తెలుస్తాయని డీసీపీ బోరలింగయ్య తెలిపారు.
పోలీసు స్టేషన్ల ముందు బాధితుల ధర్నా
బాధితులు బుధవారం పరప్పన అగ్రహార, బొమ్మనహళ్లి పోలీస్‌స్టేషన్లు ముందు ధర్నాకు దిగి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఉద్యోగ ప్రకటన చూసి వివిధ రాష్ట్రాల నుంచి నిరుద్యోగులు శివరాజ్‌ను సంప్రదించారు. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు, లక్షకు పైగా వసూలు చేసి, మీరు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఐడీకార్డులు అందించి ఒక భవనంలో కొన్ని కంప్యూటర్లతో ఎక్స్‌ప్రొటినో ప్రో అనే కంపెనీ తెరిచాడు. మూడునెలలు వారితో పనిచేయించాడు. స్వల్ప మొత్తంలో జీతాలిచ్చిఆడు. ప్రాజెక్ట్ ఫెయిల్ కావడంతో కంపెనీ నష్టపోయిందని వారిని నమ్మించి మూడునెలల పాటు కంపెనీ మూసివేశాడు. దానికి తాళం వేసిన శివరాజ్ కొన్నాళ్లకు విటోబస్ సీఎంఎస్ పేరుతో బొమ్మనహళ్లిలో కొత్త కంపెనీ తెరిచాడు. ప్రస్తుతం ఈ కంపెనీ కూడా నష్టంలో ఉందని ఉద్యోగులను నమ్మించి మూసివేశాడు.
తల్లి నగలు అమ్మి రూ.1.15 లక్షలు అప్పగింత
హైదరాబాద్ కు చెందిన ఐశ్వర్య అనే యువతి కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఫేస్‌బుక్‌లో ముఠా ఉద్యోగ ప్రకటన చూసి ఎక్స్‌ప్రొటినో ప్రో కంపెనీలో ఉద్యోగం కోసమని బెంగళూరుకు వచ్చింది. శివరాజ్ రిజిస్ట్రేషన్ ఫీజులంటూ ఆమె వద్ద నుంచి రూ.1.15 లక్షలు తీసుకున్నాడు. ఐశ్వర్య తల్లి బంగారు నగలు అమ్మి ఈ డబ్బు ఇచ్చుకుని మోసపోయింది.
రకరకాల పేర్లతో నకిలీ కంపెనీలు
వింకో గ్రూప్, క్లౌడ్‌సాఫ్ట్ టెక్నాలజీస్, అక్కోటిక, జేబీఎస్ టెక్ సొల్యూష న్స్ ఇలా రకరకాల పేర్లుతో కంపెనీలు తెరిచి శివరాజ్ అండ్ గ్యాంగ్ నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకున్నట్లు ఐటీ ఉద్యోగుల సంఘం పోలీ స్ అధికారులకు సమాచారం ఇచ్చింది. శివరాజ్ అతడి అనుచరులు కొత్తగా కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి టార్గెట్ చేసుకుని వంచన కు పాల్పడ్డారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన నిరుద్యోగులు కంపెనీ తాళం వేసి ఉండటాన్ని గమనించి తక్షణం వెనక్కి వెళ్తున్నారు.
నేవీ అధికారికి బెదిరింపులు
హైదరాబాద్ నౌకాదళ అధికారి అమరనాథ్ కుటుంబానికి చెందిన నలుగురికి శివరాజ్ ముఠా భారీగా డబ్బు వసూలు చేసి టోపీ వేసింది. అమరనాథ్ ఫోన్ చేసి డబ్బు వెనక్కి ఇవ్వాలని అడిగారు. ఇచ్చిన డబ్బు వెనక్కిరాదని, నీకు దమ్ముంటే బెంగళూరుకు వచ్చి మాట్లాడాలని శివరాజ్ ఆయనను బెదిరించాడు. నేను బెంగళూరుకు వచ్చాను, కానీ వంచకుడు ముఖం చాటేశాడని, చిక్కినట్‌లైతే పోలీసులకు అప్పగించేవాడినని అమరనాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment