కర్ణాటకలో బీజేపీ మరోసారి వివాదాస్పర వార్తల్లో నిలిచింది. అక్రమంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ముగ్గురు బీజేపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయనగర్ జిల్లాలో పార్టీ టిక్కెట్ ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి ఈ ముగ్గురూ రూ. 2.55 కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రిటైర్డ్ ఇంజనీర్ పి.శివమూర్తి ఫిర్యాదు మేరకు కొట్టూర్ పోలీసులు బీజెపీ జిల్లా శాఖ మాజీ అధ్యక్షుడు మోహన్ కటారియా, స్థానిక నాయకులు రేవణ సిద్దప్ప, శేఖర్ పురుషోత్తంపై కేసు నమోదు చేశారు. ఈ బీజేపీ నేతలు శివమూర్తికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇప్పిస్తామని చెప్పి, అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)కు రిజర్వ్ అయిన హగరిబొమ్మనహళ్లి నియోజకవర్గం నుంచి శివమూర్తికి బీజేపీ టిక్కెట్టు ఇస్తామని ఈ ముగ్గురు నేతలు అతనిని నమ్మించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రికి శివమూర్తి లేఖలు రాశారు.
కొట్టూర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ గీతాంజలి తెలిపిన వివరాల ప్రకారం శివమూర్తి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై సెక్షన్ 420 (మోసం), 506 (చంపేందుకు నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని సబ్‌ఇన్‌స్పెక్టర్ గీతాంజలి తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment