న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చాక లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ప్రధాని మోదీ మాటలు తప్పని ఓ సర్వే వెల్లడించింది. గత ఏడాది దేశంలో నిరుద్యోగం రేటు 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువగా 6.1 శాతం ఉందని జాతీయ నమూనా సర్వే స్పష్టం చేసింది. 2017–18 సంవత్సరంలో దేశంలో నిరుద్యోగం రేటు 6.1 శాతంగా ఉందని నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. గత ఏడాది(2017–18) నిరుద్యోగిత పట్టణ ప్రాంతాల మహిళల్లో 27.2 శాతం, పురుషుల్లో 18.7 శాతం కాగా, అదే గ్రామీణ మహిళల్లో 13.6 శాతం, పురుషుల్లో 17.4 శాతంగా ఉందని తెలిపింది. పీఎల్‌ఎఫ్‌ఎస్ నివేదికను ఎన్‌ఎస్‌ఎస్‌ఓ కార్యాలయం ఆమోదించి ప్రభుత్వానికి పంపింది.
అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను వెల్లడించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన మహిళల్లో 2004–05 నుంచి 2011–12 మధ్య నిరుద్యోగిత 9.7 శాతం నుంచి 15.2 శాతం వరకు ఉండగా 2017–18లో అది 17.3 శాతానికి పెరిగింది. పురుషుల్లో ఇది 3.5 శాతం నుంచి 4.4 శాతం ఉండగా, ఇప్పుడు 10.5 శాతానికి పెరిగింది. యువతలో నిరుద్యోగిత అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే గత ఏడాది అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 15–29 ఏళ్ల మధ్య వారిలో నిరుద్యోగం రేటు 2011–12లో 5 శాతం ఉండగా, 2017–18లో అది మూడు రెట్లకుపైగా పెరిగి 17.4 శాతానికి చేరుకుంది. అయితే, ఈ నివేదిక ముసాయిదా మాత్రమేననీ, దీనిని ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment