సాక్షి, హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్)లో ముసలం మొదలైంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో పురుడు పోసుకున్న ఈ సంఘం.. టీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతూ వస్తున్న ఇందులో ఒక్కసారిగా అసమ్మతి రాజేసుకుంది. టీఎస్ ఎన్పీడీసీఎల్‌లో ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు అసమ్మతికి ఆజ్యం పోశాయి.
బదిలీల్లో పోటీ యూనియన్‌లో సభ్యులైన ఉద్యోగులకు రాష్ట్ర మంత్రులు సహకారం అందించి కోరుకున్న చోటుకు బదిలీ చేయించారని, అదే అనుబంధంగా ఉన్న టీఆర్‌వీకేఎస్ సభ్యులను పట్టించుకోలేదని గుర్రుగా ఉన్నారు. ఇదే అంశాన్ని నాయకత్వం వద్ద వ్యక్తీరించినట్లు ఆ సంఘానికి చెందిన ఉద్యోగులు కొందరు తెలిపారు. అధికార పార్టీకి అనుబంధంగా ఉండి కూడా మంత్రులనుంచి సహకారం అందనప్పుడు అనుబంధంగా కొనసాగాల్సిన అవసరం ఏమొచ్చిందని నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు సమాచారం.
పనిచేయని బుజ్జగింపులు
రాజుకున్న ఈ అసమ్మతి మరింత విస్తరించకుండా అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు రంగంలోకి దిగి బుజ్జగింపులకు దిగారు. అధికార పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నా.. తమకు సహకారం అందనప్పుడు అఫిలేటెడ్ అవసరం లేదని, ఏ పార్టీకి చెందకుండా స్వతంత్రగా సంఘాన్ని నడుపుకుంటామని నాయకత్వానికి చెప్పినట్లు అసమ్మతి నాయకులు వివరించారు. టీఆర్‌ఎస్ పార్టీ అనుబంధాన్ని తీసివేస్తేనే సంఘంలో కొనసాగుతామని, లేకపోతే ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటామని అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం.
కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్న టీఆర్‌వీకేఎస్ అధికార పార్టీకి అనుబంధంగా కొనసాగితేనే అన్ని విధాలుగా ప్రయోజనకారీగా ఉంటుందని సంఘం అధినాయకత్వం అసమ్మతి నాయకులకు సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది. అయినా బెట్టువీడని నాయకులు తమ అనుచరగణాన్ని వెంటబెట్టుకుని టీఆర్‌వీకేఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇతర సంఘాల నాయకులతో చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment