ఇవే స్వర్ణాలకు సోపానాలు..
నిబద్ధత, నిజాయితీ, నిరంతర అధ్యయనం, కృషి ఇవే స్వర్ణాలకు సోపానాలు..
బీటెక్... ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కలల కొలువును సొంతం చేసుకునేందుకు దారిచూపేదిగా యువత భావిస్తున్న కోర్సు. ఈ క్రమంలో కాలేజీలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో విజయం సాధించేందుకు తపిస్తారు. కానీ, ఆ అమ్మాయి.. తొలుత సబ్జెక్టు పరిజ్ఞానం పొందేందుకు, ఆపై చక్కటి మార్కులు పొందేందుకు కృషి చేసింది. ఫలితంగా.. జేఎన్టీయూ (హైదరాబాద్) పరిధిలో నాలుగేళ్ల ఈసీఈ కోర్సులో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు సాధించింది. బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ (2008-12)గా నిలిచింది. జేఎన్టీయూ (హైదరాబాద్) నాలుగో స్నాతకోత్సవంలో పతకాలు అందుకున్న అనంతరం.. నిరంతర అధ్యయనమే ఈ విజయ సాధనం అంటున్న కె.కావ్య సక్సెస్ స్పీక్స్...
జేఎన్టీయూహెచ్ అఫ్లియేటెడ్ కళాశాలలన్నింటిలో.. యూనివర్సిటీ టాపర్ సహా మొత్తం నాలుగు పతకాలు లభించినందుకు కలిగే ఆనందం ఒక ఎత్తయితే.. పద్మవిభూషణ్, ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కకోద్కర్ చేతుల మీదుగా వాటిని అందుకునే అవకాశం రావడం చాలా సంతోషం కలిగించింది. ఈ విజయం వెనుక అమ్మా నాన్న, అధ్యాపకుల ప్రోత్సాహం మరవలేనిది. నాన్న పుల్లారావు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో చీఫ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు.
ఆ నాలుగు సాధనాలే:
ఎంసెట్-2008లో 4,102 ర్యాంకుతో హైదరాబాద్‌లోని భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఈసీఈ బ్రాంచ్‌లో అడుగుపెట్టాను. కోర్సులో చేరిన తొలి రోజు నుంచే నిబద్ధత, నిజాయితీ, నిరంతర అధ్యయనం, నిరంతర కృషితో అడుగులు వేశాను.. ఈ నాలుగు అంశాలే నేను ప్రస్తుతం అందుకున్న నాలుగు స్వర్ణ పతకాలు సాధించడానికి సాధనాలు. ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తొలి రోజు నుంచే సబ్జెక్టు పరంగా నిరంతర అధ్యయనం సాగించాను.
ల్యాబ్ వర్క్‌కు ప్రాధాన్యం:
విషయ పరిజ్ఞానం పొందే క్రమంలో పుస్తక పరిజ్ఞానానికి ఎంత ప్రాధాన్యమిచ్చానో.. అంతే స్థాయిలో సంబంధిత అంశంపై ల్యాబ్ వర్క్‌కు సమయం కేటాయించాను. లేబరేటరీల్లో ప్రయోగాల ద్వారా విషయ పరిజ్ఞానం మరింత ఎక్కువగా లభిస్తుంది. అది భవిష్యత్తులోనూ ఎంతో ఉపకరిస్తుంది. ముఖ్యంగా కోర్ బ్రాంచ్ విద్యార్థులు ల్యాబ్ వర్క్‌కు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి.
ప్రాక్టికల్ అప్రోచ్‌తో:
కోర్సులో ప్రతి సబ్జెక్ట్.. అందులోని ప్రతి అంశాన్ని ప్రాక్టికల్ అప్రోచ్‌తో చదవడం.. చదివే అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ చదవడంతో సదరు సబ్జెక్టులపై మరింత పట్టు లభించింది. ఇంజనీరింగ్ వంటి కోర్సులో ఇది ఎంతో ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రస్తు త విద్యార్థులకు కూడా నేనిచ్చే సలహా ఇదే. ముందుగా బేసిక్స్‌పై అవగాహన ఏర్పరచుకుని.. తర్వాత వాటిని, ప్రాక్టికల్‌గా అన్వయించుకోవాలి. అప్పుడే కష్టమైన సబ్జెక్ట్‌లోనూ రాణించడం సులభమవుతుంది.
డీఎల్‌ఆర్‌ఎల్‌లో ప్రాజెక్ట్ వర్క్:
ఇంజనీరింగ్‌లో కీలక అంశం ప్రాజెక్ట్ వర్క్. నేను వ్యక్తిగతంగా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లేబొరేటరీలో రాడార్ డిజిటల్ రిసీవర్ అనే అంశంపై ప్రాజెక్ట్ వర్క్ చేశాను. మూడు నెలలపాటు సాగిన ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా నాకు నాలెడ్జ్పరంగా ఎంతో తోడ్పడింది. అందుకే ప్రస్తుత విద్యార్థులకు నా సలహా ఏంటంటే.. వ్యక్తిగతంగా చేసినా.. బృందాలుగా చేసినా.. లైవ్ ప్రాజెక్ట్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే నిజమైన నాలెడ్జ్ సొంతమవుతుంది. మినీ ప్రాజెక్ట్‌లకు కూడా మెయిన్ ప్రాజెక్ట్ మాదిరిగానే ప్రాధాన్యమివ్వాలి. నేను రెండు నెలల వ్యవధిలో డిజైన్ ఆఫ్ యూనివర్సల్ ఎసింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్ అనే అంశంపై మినీ ప్రాజెక్ట్ చేశాను.
నచ్చిన విభాగం:
ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు అన్ని అంశాల్లో రాణించాలనే ఆత్రుతతో చదవడం ప్రస్తుత కరిక్యులం ప్రకారం అంత సులువు కాదు. కాబట్టి విద్యార్థులు కోర్ సబ్జెక్టుల్లో తమకు బాగా నచ్చిన అంశంలో.. దానికి భవిష్యత్తులో గల అవకాశాలు, అవసరాల విషయంలో అవగాహన ఏర్పరచుకుని పరిపూర్ణత సాధించాలి. ఉదాహరణకు నాకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎంతో ఇష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా సబ్జెక్టులతో పోల్చితే ఈ విషయంపై ఎక్కువ దృష్టి సారించాను. ఇదే విధంగా మరికొందరు విద్యార్థులకు నెట్‌వర్కింగ్‌పై ఆసక్తి ఉంటుంది. అలాంటి వారు డాట్ నెట్ వంటి అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి.
ఈసీఈలో సాధించిన స్వర్ణ పతకాల వివరాలు:
అనుబంధ కాలేజీలన్నింటిలోనూ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గోల్డ్ మెడల్. ఝ కాన్స్టిట్యుయెంట్ అండ్ అఫ్లియేటెడ్ కాలేజీల పరిధిలో మ్యాథమెటిక్స్-1 లో అత్యధిక మార్కులు సాధించినందుకు దివంగత ప్రొ॥జి.పురుషోత్తం మెమోరియల్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్. ఝ పిసుపాటి సుప్రియ దేశాయ్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్. ఝ జేఎన్టీయూ-హెచ్ పరిధిలోని అన్ని అఫ్లియేటెడ్, కాన్స్టిట్యుయెంట్ కాలేజీల్లో బీటెక్ అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి ఫస్ట్ ర్యాంకు సాధించినందుకు బూర్గుల రామకృష్ణారావు ఎండోమెంట్ గోల్డ్ మెడల్.
పీహెచ్డీ చేయడమే లక్ష్యం:
ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ డివిజన్లో ఇంజనీర్‌గా ఉద్యోగం లభించింది. అయితే నా భవిష్యత్తు లక్ష్యం ఎంటెక్.. ఆ తర్వాత పీహెచ్డీ చేయడం. ఈ ఏడాది పీజీఈసెట్‌లో 37వ ర్యాంకు వచ్చినప్పటికీ.. అప్పటికే ఉద్యోగంలో ఉండటం.. కొన్ని నిబంధనల కారణంగా కోర్సులో చేరడం కుదరలేదు. భవిష్యత్తులో కచ్చితంగా ఎంటెక్, పీహెచ్డీ రెండు లక్ష్యాలను సాధిస్తాను. ఆ తర్వాత నేను నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక అభివృద్ధికి దోహదపడేందుకు కృషి చేస్తాను.
అకడమిక్ ప్రొఫైల్:
పదో తరగతి(2006)లో 94.16 శాతం మార్కులు.
ఇంటర్మీడియెట్ (2008)లో 98.4 శాతం మార్కులు.
ఎంసెట్-2008లో 4,102 ర్యాంకు.
బీటెక్-ఈసీఈ (2012)లో 91.25 శాతం.