Job Melas
-
ప్రైవేటుకే ఉపాధి కల్పన.. ఉద్యోగాల నియామకాలకు జాబ్ మేళాలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఉపాధి కల్పనా శాఖ కార్పొరేట్, ప్రైవేటు రంగాలకు కల్పతరువుగా మారింది. ఆయా సంస్థల కోసం జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఉద్యోగులను వెతికి పెడుతోంది. ఒకప్పుడు నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఈ శాఖ ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగాల భర్తీలో బిజీగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్హతలతో సహా పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నా.. వయోపరిమితి దాటిపోయే వరకు ఒక్క ఉద్యోగం కూడా కలి్పంచలేని పరిస్థితి నెలకొంది. కనీసం ప్రభుత్వ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఏజెన్సీ ఎంప్యానల్‌మెంట్‌కే పరిమితమైంది. పొరుగు సేవల్లో అంతంతే.. ► ఉపాధి కల్పనా శాఖ ప్రైవేటుపై దృష్టి సారించింది. సాధారణంగా కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు వ్యాపార ఆర్థిక లావేదేవీలను బట్టి ఉద్యోగుల సంఖ్యను కుదించడం, పెంచడం చేస్తుంటాయి. కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడగానే తిరిగి నిపుణులైన ఉద్యోగుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనా శాఖ ఆయా సంస్థలకు ఉద్యోగులను వెతికిపెట్టే బాధ్యతను భుజానా ఎత్తుకుంది. జాబ్ మేళాలు నిర్వహిస్తూ చిరు ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగుల ఎంపిక కోసం సంధాన కర్తగా వ్యవహరిస్తోంది. ► ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం కేవలం ఏజెన్సీల నమోదుకు పరిమితమైంది. కొత్త ఉద్యోగ భర్తీ లేక పొరుగుసేవల కింద నియామకాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఉపాధి కల్పన కేంద్రంలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల్లో అర్హులైన వారికి సమాచారం అందించి ఎంపిక చేయాలి. ఇందు కోసం ఏర్పాటు చేసిన కమిటీకి ఉపాధి కల్పనా శాఖ అధికారి కో కనీ్వనర్‌గా వ్యవహరించాలి. పొరుగుసేవల ఉద్యోగాలు నియామకాలు సాగుతున్నా.. అవి ఉపాధి కల్పనా శాఖ ద్వారా ఎంపిక జరిగిన దాఖలాలు మాత్రం లేవు. ఫలితంగా ఏజెన్సీలు తమకు నచ్చిన వారిని ఎంపిక చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అచేతనంగా.. రెండు దశాబ్దాల వరకు ఉపాధి కల్పనా శాఖ నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా వెలిగి ప్రస్తుతం అచేతనంగా తయారైంది. అప్పట్లో ఏ శాఖకు లేని ప్రతిష్ట ఈ శాఖ ఉండేది. సర్కారు కొలువులకు ఉపాధి కల్పన శాఖలో నమోదు తప్పనిసరిగా ఉండేది. దీంతో నిరుద్యోగులు ఈ ఆఫీస్‌కు క్యూ కట్టి నమోదు చేసుకున్నారు. అభ్యర్థులకు సీనియారిటీ ప్రకారం విద్యార్హతలను బట్టి ఆయా శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం వర్తమానం అందేది. ప్రభుత్వ నోటిఫికేషన్ విధానం అందుబాటులో రావడంతో శాఖకు వన్నె తగ్గినట్లయింది. ప్రస్తుతం కేవలం అభ్యర్థుల పేర్లు నమోదు, పునరుద్ధరణ, ప్రైవేటు సేవలకు పరిమితమైంది. ఆశల్లోనే అభ్యర్థులు.. ఉపాధి కల్పనా శాఖపై అభ్యర్థుల్లో ఆశలు సన్నగిల్లలేదు. సర్కారు కొలువుపై ఆశతో నమోదు, పునరుద్ధరణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అభ్యర్థుల నమోదు కొంత మేరకు పెరిగింది. రాష్ట్రం మొత్తం మీద 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 2,72,124 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో పురుషులు 1,62,928 ఉండగా, మహిళా అభ్యర్థులు 1,09,196 ఉన్నారు. ఒక్క కాల్ లెటర్ రాలేదు ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఉపాధి కల్పనా శాఖలో విద్యార్హతతో పేరు నమోదు చేసుకున్నా.. ఒక్క కాల్ లేటర్ రాలేదు. కేవలం ప్రైవేటు ఉద్యోగాల జాబ్ మేళాలకే ఉపాధి కల్పనా శాఖ పరిమితమైంది. సర్కారు కొలువుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి – సీలం దీపిక, హైదరాబాద్ అవుట్ సోర్సింగ్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి అవుట్సోర్సింగ్ లోనైనా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం కలి్పంచి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి. – పి.ప్రవీణ్ కుమార్ చదవండి: సమ్మోహన తీరం.. సరికొత్తగా హుస్సేన్ సాగర్ -
ఈ ఏడాది 312 జాబ్ మేళాలు
సాక్షి, అమరావతి: స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే 12 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 312 జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రకటించింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లాలో కనీసం ఒక జాబ్ మేళా నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఏపీఎస్ఎస్డీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, చైర్మన్ అజయ్‌రెడ్డి, జాబ్ మేళా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, ఏపీఎస్ఎస్డీసీ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించే విధంగా ప్రతి మంగళవారం ప్లేస్మెంట్ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించే విధంగా 262 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, గడిచిన మూడేళ్లలో 14 లక్షల మందికి ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గం పరిధిలో స్కిల్హబ్స్ ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా తొలి విడతలో 66 హబ్స్‌ను ఆగస్టు 15న అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎస్ఎస్డీసీ చైర్మన్ అజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
యువతకు ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనేక చర్యలు
-
తెలంగాణలో కొలువుల జాతర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు ఈ మేరకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఓ సంస్థ సహకారంతో డీట్ అనే వెబ్సైట్ ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేస్తున్న ఆ శాఖ.. త్వరలో కార్పొరేట్ కంపెనీ యాజమాన్యాలతో సమన్వయం కానుంది. ఆయా కంపెనీలో ఉన్న ఉద్యోగ ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి భర్తీ చేయనుంది. ఇందులో జిల్లా ఎంపాయ్‌మెంట్ ఎక్సే్చంజ్‌లు కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రతి జిల్లాలో జాబ్‌మేళా..: ఇదివరకు ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్‌లో ఉద్యోగ మేళాలు నిర్వహించినప్పటికీ ఒకట్రెండు కంపెనీలు మాత్రమే పాల్గొనేవి. ఇప్పుడలా కాకుండా కంపెనీల వారీగా ఉన్న ఉద్యోగా లను కేటగిరీలుగా విభజించి ఆమేరకు ఒక్కో కేటగిరీని భర్తీ చేస్తారు. అభ్యర్థుల ఆసక్తిని బట్టి కంపెనీలను ఎంపిక చేసుకోవచ్చు. కంపెనీల వారీగా ఖాళీల వివరాలను సేకరించిన తర్వాత వాటిని ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఆన్లైన్ పద్దతిలోనే జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్ ద్వారా జాబ్ మేళా నిర్వహించి భర్తీ చేస్తారు. కోవిడ్–19 తీవ్రత తగ్గిన తర్వాత అప్పటి పరిస్థితులకు తగినట్లు జాబ్‌మేళాలు నిర్వహించనున్నట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలను గ్రామీణ యువత అందిపుచ్చుకునేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదించి ఉద్యోగ ఖాళీల భర్తీపై చర్చలు జరిపింది. ఇందులో భాగంగా డీట్ వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టిన అధికారులు..తాజాగా నేరుగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హతలేమిటి...అభ్యర్థుల నియామకం ఎలా చేపట్టాలనే దానిపై కంపెనీల వారీగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. (ఆన్లైన్ పాఠాలా.. జర జాగ్రత్త..) -
మరిన్ని జాబ్ మేళాలు
♦ మా డేటాబేస్‌లో 6 లక్షల మంది అభ్యర్థుల రెజ్యూమెలు ♦ ప్లంబర్లు, సెక్యూరిటీగార్డుల వివరాలూ ఉంటాయ్ ♦ ఇళ్లకు అవసరమైనవారు కూడా తీసుకోవచ్చు ♦ ‘సాక్షి’తో సరళ్ రోజ్‌గార్ సీవోవో మయూఖ్ దాస్‌గుప్తా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగార్థులకు ఉపాధి అవకాశాలు మరింతగా చేరువ చేసేలా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు టెక్ మహీంద్రా గ్రోత్ ఇనీషియేటివ్స్‌లో భాగమైన సరళ్ రోజ్‌గార్ సంస్థ వెల్లడించింది. ఇటీవలే హైదరాబాద్‌లో నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించిన నేపథ్యంలో త్వరలో నెల్లూరు, విజయవాడ, వరంగల్ తదితర ప్రాంతాల్లోనూ వీటిని నిర్వహించనున్నట్లు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూఖ్ దాస్‌గుప్తా చెప్పారు. కార్పొరేట్ ఉద్యోగార్థులతో పాటు ఎంట్రీ స్థాయి, అసంఘటిత రంగ వర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు దాస్‌గుప్తా చెప్పారు. వడ్రంగులు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు మొదలుకుని డెలివరీ బాయ్స్, డ్రైవర్ల దాకా వివిధ వర్గాల వారి వివరాలు సైతం తమ డేటాబేస్‌లో లభిస్తాయని, గృహ వినియోగదారులు కూడా నిర్దిష్ట రుసుము చెల్లించి వాటిని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇటు సంస్థలు, అటు ఉద్యోగార్థులను అనుసంధానించే ప్లాట్‌ఫామ్‌గా సరళ్ రోజ్‌గార్ పనిచేస్తుందన్నారు. పదివేలకు పైగా క్లయింట్లు.. దేశవ్యాప్తంగా 500 పైగా ప్రాంతాల్లో ఆరు లక్షల మంది పైగా తమ సరళ్ రోజ్‌గార్ యోజనలో నమోదై ఉన్నారని, చిన్న తరహా నుంచి పెద్ద కార్పొరేట్ల దాకా 10,000 పైచిలుకు సం స్థలు క్లయింట్లుగా ఉన్నాయని దాస్‌గుప్తా చెప్పారు. తెలుగు, తమిళం, ఇంగ్లీషుతో పాటు తొమ్మిది ప్రాంతీయ భాషల్లో తమ కాల్‌సెంటర్ ద్వారా ఉద్యోగార్థులకు, రిక్రూటర్లకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పోర్టల్‌తో పాటు మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. సగటున ప్రతి నెలా 4,500 ఉద్యోగాల కల్పన జరుగుతోందని, ఎక్కువగా తయారీ, బీపీవో మొదలైన రంగాల్లో ఇవి ఉంటున్నాయని తెలిపారు. రోజ్‌గార్ కార్డు.. ఉద్యోగార్థులు తమ సర్వీసులు పొందాలంటే రూ. 100 కట్టి మూడు నెలల పాటు వర్తించే రోజ్‌గార్ కార్డు తీసుకోవాల్సి ఉంటుందని దాస్‌గుప్తా పేర్కొన్నారు. దీన్ని కొనుగోలు చేసిన వారు తమ టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే.. సుమారు 12-15 అంశాల గురించి వివరాలు సేకరించి, వారి రెజ్యూమెను రూపొందించడంతో పాటు అందుబాటులో ఉన్న అవకాశాల సమాచారాన్ని చేరవేస్తారని చెప్పారు. ఈ విధానంతో అటు సంస్థలకు కూడా రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించి సమయం ఆదా కావడమే కాకుండా వ్యయాలూ తగ్గుతాయని దాస్‌గుప్తా తెలిపారు. ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌తో పాటు మెదక్, వరంగల్, వంటి నాలుగు జిల్లాల్లోని 700 వెండార్స్ దగ్గర తమ రోజ్‌గార్ కార్డులు లభిస్తున్నాయని, వచ్చే త్రైమాసికంలో తెలంగాణలోని మొత్తం పది జిల్లాలకు విస్తరించాలని యోచిస్తున్నామని దాస్‌గుప్తా చెప్పారు. అలాగే, అటు మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లోనూ విస్తరణపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. -
ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు
రాజ మండ్రి రూరల్/రాజానగరం/ప్రకాష్‌నగర్ :ప్రైవేట్ రంగంలో కూడా వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించే లా జాబ్ మేళాలు చేపడతామని స్త్రీ, శిశు సంక్షేమం, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి పీతల సజాత అన్నారు. రాజమండ్రిలోని చెరుకూరి సుబ్బారావు, గన్నెమ్మ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన ప్రపంచ వికలాంగుల దినోత్సవ సభకు ఆమె అధ్యక్షత వహించారు. వికలాంగులకు కేటాయించిన ఖాళీలన్నింటినీ దశలవారీగా భర్తీ చేస్తామన్నారు. సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తూ, ఉపాధి అవకాశాలు చూపించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ విజ్ఞప్తి చేశారు. రోడ్ కమ్ రైలు బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని, వినియోగంలో లేని హేవ్‌లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. రాజమండ్రిని గ్రీన్ సిటీగా తయారుచేస్తూ, ఈ ప్రాంతంలోని నర్సరీల అభివృద్ధికి రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబునాయుడుకి విజ్ఞప్తి చేశారు. తొలుత జియోన్ బధిరుల పాఠశాల, ప్రియదర్శిని బధిరుల ఆశ్రమ పాఠశాల, పలుకు బధిరుల పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రూ.22 లక్షల విలువైన ఉపకరణాలు పంపిణీ వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా సమకూర్చిన రూ.22 లక్షల విలువైన ఉపకరణాలను లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు అందజేశారు. వీటిలో 200 ట్రైసైకిళ్లు, 26 ల్యాప్‌ట్యాప్‌లు, 20 వీల్చైర్లు, 10 ఎంపీత్రీ ప్లేయర్లు, 100 వినికిడి యంత్రాలు, 10 మందికి కృత్రిమ అవయవాలు ఉన్నాయి. స్వయం ఉపాధి కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెస్మాల ద్వారా వికలాంగుల సంఘాలకు రూ.56.81 లక్షల బ్యాంకు రుణాలను అందజేశారు. కల్యాణ మండపం ఆవరణలో ఏర్పాటుచేసిన 10 స్టాళ్లను సీఎం సందర్శించారు.ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకున్న సీఎంను రైతు సంక్షేమ సంఘం, రైస్‌మిల్లర్ల సంఘం సభ్యులు కలిసి తమ సమస్యలు విన్నవించారు. అలాగే జూనియర్ వైద్యులు, కాంట్రాక్ట అధ్యాపకుల సంఘం, వికలాంగుల సంక్షేమ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉద్యోగుల సంక్షేమ సంఘం, తెలుగునాడు, పీడబ్ల్యూ వర్క్‌షాప్ అండ్ ప్రాజెక్టు కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎంని కలిసి వినతిపత్రాలు అందజేశారు. అలాగే అధ్వానంగా ఉన్న రోడ్ కం రైలు వంతెనకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, పుష్కరాలలోపు నాలుగో వంతెన (కొవ్వూరు-కాతేరు)ను పూర్తి చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు సీఎంకు వినతిపత్రం అందజేశారు. ఘాట్ల పరిశీలన రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు రాజమండ్రిలోని వివిధ ఘాట్లను పరిశీలించారు. గౌత మ ఘాట్‌కు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో సీఎంతో పాటు మంత్రులు సైతం అడ్డుగా ఉన్న గోడను దూకాల్సి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, రాజమండ్రి మేయర్ రజనీశేషసాయి, శాసనమండలి విప్ చైతన్యరాజు, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి నీలం సహాని, కమిషనర్ కె.శారదాదేవి, కలెక్టర్ నీతూప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.