మరిన్ని జాబ్ మేళాలు | Saral Rozgar to reach help to your doorstep | Sakshi
Sakshi News home page

మరిన్ని జాబ్ మేళాలు

Published Wed, Jun 15 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

మరిన్ని జాబ్ మేళాలు

మరిన్ని జాబ్ మేళాలు

మా డేటాబేస్‌లో 6 లక్షల మంది అభ్యర్థుల రెజ్యూమెలు
ప్లంబర్లు, సెక్యూరిటీగార్డుల వివరాలూ ఉంటాయ్
ఇళ్లకు అవసరమైనవారు కూడా తీసుకోవచ్చు
‘సాక్షి’తో సరళ్ రోజ్‌గార్ సీవోవో మయూఖ్ దాస్‌గుప్తా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగార్థులకు ఉపాధి అవకాశాలు మరింతగా చేరువ చేసేలా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు టెక్ మహీంద్రా గ్రోత్ ఇనీషియేటివ్స్‌లో భాగమైన సరళ్ రోజ్‌గార్ సంస్థ వెల్లడించింది. ఇటీవలే హైదరాబాద్‌లో నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించిన నేపథ్యంలో త్వరలో నెల్లూరు, విజయవాడ, వరంగల్ తదితర ప్రాంతాల్లోనూ వీటిని నిర్వహించనున్నట్లు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూఖ్ దాస్‌గుప్తా చెప్పారు.

కార్పొరేట్ ఉద్యోగార్థులతో పాటు ఎంట్రీ స్థాయి, అసంఘటిత రంగ వర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు దాస్‌గుప్తా చెప్పారు. వడ్రంగులు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు మొదలుకుని డెలివరీ బాయ్స్, డ్రైవర్ల దాకా వివిధ వర్గాల వారి వివరాలు సైతం తమ డేటాబేస్‌లో లభిస్తాయని, గృహ వినియోగదారులు కూడా నిర్దిష్ట రుసుము చెల్లించి వాటిని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇటు సంస్థలు, అటు ఉద్యోగార్థులను అనుసంధానించే ప్లాట్‌ఫామ్‌గా సరళ్ రోజ్‌గార్ పనిచేస్తుందన్నారు.

 పదివేలకు పైగా క్లయింట్లు..
దేశవ్యాప్తంగా 500 పైగా ప్రాంతాల్లో ఆరు లక్షల మంది పైగా తమ సరళ్ రోజ్‌గార్ యోజనలో నమోదై ఉన్నారని, చిన్న తరహా నుంచి పెద్ద కార్పొరేట్ల దాకా 10,000 పైచిలుకు సం స్థలు క్లయింట్లుగా ఉన్నాయని దాస్‌గుప్తా చెప్పారు. తెలుగు, తమిళం, ఇంగ్లీషుతో పాటు తొమ్మిది ప్రాంతీయ భాషల్లో తమ కాల్‌సెంటర్ ద్వారా ఉద్యోగార్థులకు, రిక్రూటర్లకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.  పోర్టల్‌తో పాటు మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. సగటున ప్రతి నెలా 4,500 ఉద్యోగాల కల్పన జరుగుతోందని, ఎక్కువగా తయారీ, బీపీవో మొదలైన రంగాల్లో ఇవి ఉంటున్నాయని తెలిపారు.

 రోజ్‌గార్ కార్డు..
ఉద్యోగార్థులు తమ సర్వీసులు పొందాలంటే  రూ. 100 కట్టి మూడు నెలల పాటు వర్తించే రోజ్‌గార్ కార్డు తీసుకోవాల్సి ఉంటుందని దాస్‌గుప్తా పేర్కొన్నారు.  దీన్ని కొనుగోలు చేసిన వారు తమ టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే.. సుమారు 12-15 అంశాల గురించి వివరాలు సేకరించి, వారి రెజ్యూమెను రూపొందించడంతో పాటు అందుబాటులో ఉన్న అవకాశాల సమాచారాన్ని చేరవేస్తారని చెప్పారు. ఈ విధానంతో అటు సంస్థలకు కూడా రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించి సమయం ఆదా కావడమే కాకుండా వ్యయాలూ తగ్గుతాయని దాస్‌గుప్తా తెలిపారు. ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌తో పాటు మెదక్, వరంగల్, వంటి నాలుగు జిల్లాల్లోని 700 వెండార్స్ దగ్గర తమ రోజ్‌గార్ కార్డులు లభిస్తున్నాయని, వచ్చే త్రైమాసికంలో తెలంగాణలోని మొత్తం పది జిల్లాలకు విస్తరించాలని యోచిస్తున్నామని దాస్‌గుప్తా చెప్పారు. అలాగే, అటు మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లోనూ విస్తరణపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement