jogipeta mandal
-
ట్రీ గార్డులను ఇలా వాడొచ్చా?
ప్రభుత్వ కార్యాలయానికి కంచెలా ఏర్పాటు జోగిపేట: జోగిపేట నగర పంచాయతీ పరిధిలోని మొక్కలను సంరక్షించేందుకు 500 ట్రీగార్డులను ప్రభుత్వం పంపిణీ చేసింది. అందోలు, జోగిపేట పట్టణాల్లో సుమారు 20 వేల మొక్కల వరకు నాటినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రహరీ లేని మొక్కలను సంరక్షించేందుకుగాను ట్రీగార్డులను ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నాయి. టీగ్రార్డులను నగర పంచాయతీ ఆవరణ, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ, ఎంపీడీఓ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాత భవనంలోనే నగర పంచాయతీ నిర్వాహణ ఇబ్బందిగా ఉండటంతో పక్కనే ఉన్న పశుసంవర్దక శాఖ ఆసుపత్రి ఆవరణలోని రైతు శిక్షణ కేంద్రంలోకి మార్చేందుకు సంబంధిత అధికారితో పాటు జిల్లా కలెక్టర్ అనుమతి పొందారు. ఆ నూతన భవనంలోకి వెళ్లే దారిలో మొక్కలను సంరక్షించేందుకు మంజూరైన ట్రీగార్డులను కార్యాలయ కంచెగా మార్చేసారు. కార్యాలయానికి ఇరువైపులా ట్రీగార్డులను కంచెలుగా కట్టడంతో పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రీగార్డులను ఇలా కూడా వాడుకోవచ్చా? అని చర్చించుకోవడం కనిపించింది. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ ఖర్చుతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉన్నా... ట్రీగార్డులను కంచెగా ఏర్పాటు చేసుకోవడం విమర్శలకు గురవుతున్నారు. -
మండపాలు సిద్ధం
నేటి నుంచి వినాయక నవరాత్రోత్సవాలు జోగిపేట: వినాయక నవరాత్రోత్సవాలకు మండపాలను సిద్ధం చేస్తున్నారు. సోమవారం వినాయక చవితి రోజున గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు పూజలు నిర్వహించనున్నారు. జోగిపేటతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడానికి మండపాలను ముస్తాబు చేస్తున్నారు. మండలంలోని 21 గ్రామాల్లో ఈసారి 200 వరకు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. జోగిపేట పట్టణంలో 40 నుంచి 50 వరకు, అందోలు, డాకూర్ గ్రామాల్లో 10వ వరకు విగ్రహాలు ప్రతిష్ఠించనున్నారు. వర్షాకాలం కావడంతో మండపాలను ప్లాస్టిక్ కవర్లతో నిర్మిస్తున్నారు. స్టేజీని కట్టెలతో నిర్మిస్తున్నారు. యువకులే ఎక్కువగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ఉత్సాహం చూపుతున్నారు. జోగిపేట పట్టణంలో దేవాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించి పూజలు ప్రారంభిస్తారు. -
ప్రమాదకర ప్రయాణం
పల్లెలకు వెళ్లని ప్రగతి రథచక్రాలు ఇబ్బందుల్లో గ్రామీణులు, విద్యార్థులు ప్రమాదమని తెలిసినా ప్రైవేటు వాహనాల ఆశ్రయం జోగిపేట: ‘ఆటోల్లో ప్రయాణించడం ప్రమాదకరం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ అంటూ ప్రచారం చేస్తున్న ఆర్టీసీ ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జోగిపేట పట్టణంలోని కళాశాలలు, పాఠశాలలకు అందోలు, పుల్కల్, రేగోడ్, టేక్మాల్, అల్లాదుర్గం, కౌడిపల్లి, హత్నూర మండలాల నుంచి 600 మంది వరకు విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం ప్రజలు వస్తుంటారు. అందోలు మండలం పరిధిలోని కన్సాన్పల్లి, నేరడిగుంట, రాంసానిపల్లి, చింతకుంట, అన్నాసాగర్, అల్మాయిపేట, డాకూర్, తాలెల్మ, బ్రాహ్మణపల్లి, అక్సాన్‌పల్లి, సంగుపేట, అందోలు గ్రామాలకు చెందిన విద్యార్థులు జోగిపేటకు వచ్చి చదువుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు పాఠశాలలు, కళాశాలలకు చేరుకోవాల్సి ఉండగా సకాలంలో బస్సులు లేకపోవడంతో ఉదయం 10.30 గంటల వరకు కూడా చేరుకోలేని పరిస్థితి. ఉదయం పూట ముస్లాపూర్, పెద్దాపూర్ రూట్లో ఒక బస్సును నడుపుతారు. ఆ బస్సులోనే వందకుపైగా విద్యార్థులు ఎక్కుతున్నారు. ప్రాణాలకు తెగించి మరీ అందుటో ప్రయాణిస్తున్నారు. బస్సుటాపు, ఫుడ్‌బోర్డుపై ప్రయాణించాల్సి వస్తోంది. ఆ బస్సు కూడా 9.30 నుంచి 10 గంటల ప్రాంతంలో జోగిపేటకు చేరుకుంటుంది. ప్రైవేటు వాహనాలే దిక్కు జోగిపేట పట్టణంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐలకు ప్రతి రోజూ వందల సంఖ్యలో వస్తుంటారు. బస్‌పాస్‌లు తీసినప్పటికి విద్యార్థులకు ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. సమయానికి బస్సులు రావడం లేదు. ఒకటి, రెండు బస్సులే ఉండటంతో అవి దొరకకపోతే ఏదో ఓ వాహనాన్ని ఆశ్రయించి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్నారు. చింతకుంట, కన్సాన్పల్లి , రాంసానిపల్లి, అన్నాసాగర్ గ్రామాలకు చెందిన విద్యార్థులకు సకాలంలో బస్సులు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అన్నాసాగర్, అందోలు ప్రాంతాలకు చెందిన వారు కాలినడకనే రావాల్సి వస్తోంది. అల్లాదుర్గం మండలానికి చెందిన ముస్లాపూర్, పెద్దాపూర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు కూడా బస్సు టాప్‌పై ఎక్కి ప్రయాణించి వస్తున్నారు. గంటలకొద్దీ బస్సులు కోసం నిరీక్షిస్తున్నారు. టేక్మాల్ మండలానికి చెందిన పల్వంచ, ధన్నారం గ్రామాలకు చెందిన విద్యార్థులు కూడా జోగిపేటకు రావడానికి నరకయాత పడుతున్నారు. బస్సులు సమయానికి లేకపోవడంతో కొద్ది దూరం కాలినడకన వచ్చి ఆటోల్లో వెళ్తున్నారు. కౌడిపల్లి మండలానికి చెందిన చండూర్, చిలప్‌చెడ్, సిలాంపల్లి, చిట్కుల్ గ్రామాలకు చెందిన విద్యార్థులు జోగిపేటలోని కళాశాలల సమయానికి బస్సులు లేకపోవడంతో ఉదయం 10 గంటలు దాటిన తరువాత వస్తున్నారు. అప్పటికే తరగతులు ప్రారంభం కావడంతో నష్టపోతున్నారు. ఉదయం పూట బస్సులు లేకపోవడంతో రేగోడ్ మండలానికి చెందిన ఖాదిరాబాద్, రేగోడ్, నిర్జప్ల, దేవ్నూర్, గజ్వాడ, గట్పల్లి, ఉసిరికపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్సులను నడపాలి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులను నడపాలి. ఉదయం 8.30 గంటల వరకు ముస్లాపూర్ నుంచి బయలుదేరే విధంగా బస్సును నడిపించాలి. చింతకుంట, చండూర్ ప్రాంతాల విద్యార్థులకు సమయానికి బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. - టి.నరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆందోళన చేపడతాం విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులను నడపకుంటే ఆందోళన చేపడతాం. సంగారెడ్డి, మెదక్ డిపోలకు చెందిన బస్సులను నడపాలి. ఆలస్యంగా కళాశాలలు, పాఠశాలలకు వెళ్లడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలి. - పి.మొగులయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సమస్యను పరిష్కరించాలి బస్సుల కోసం రాస్తారోకోలు చేయడంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. విద్యార్థులు రాస్తారోకోలు చేయకుండా ఆర్టీసీ అధికారులు స్పందించాలి. విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించి సమస్యను పరిష్కరించాలి. ప్రయానికులను ఇబ్బంది పెట్టొద్దు. - వెంకటయ్య, సీఐ -
10 నెలలుగా ‘గౌరవం’ లేదు!
నిధుల విడుదల్లో సర్కారు జాప్యం సకాలంలో అందని వేతనాలు ఇబ్బందుల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు జోగిపేట: అందోలు నియోజకవర్గంలో అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాలున్నాయి. గ్రామ ప్రథమ పౌరుడిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గౌరవ వేతనాలు సకాలంలో చెల్లించకుండా ఆ గౌరవ పరుస్తోంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే సర్పంచ్‌లు, ఎంపీటీసీలను మనస్తాపానికి గురిచేస్తోంది. ఎంపీటీసీలు, సర్పంచ్ల ఒత్తిడి మేరకు గౌరవ వేతనాన్ని రూ.5 వేలకు పెంచింది. గతంలతో ఎంపీటీసీలకు రూ.750 , సర్పంచ్‌లకు రూ.650 నెలసరి గౌరవ వేతనం ఉండగా తెలంగాణ ప్రభత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన తర్వాత 2015 సెప్టెంబర్ వరకే గౌరవ వేతనాలకు సంబంధించి నిధులను విడుదల చేసింది. 2016 ఆగస్టు వరకు చెల్లించాల్సిన 10 నెలల గౌరవ వేతనం విడుదల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సర్పంచ్‌లు, ఎంపీటీసీల రవాణా చార్జీలను చెల్లించడంలేదు. ఇతర సదుపాయాలు కూడా కల్పించడం లేదు. సర్పంచ్‌లు అందుబాటులో లేని గ్రామాల్లో పాలన బాధ్యతలు భుజాన వేసుకునే ఉప సర్పంచ్‌లకు నయాపైసా విదల్చడం లేదు. మండలం సర్పంచ్‌లు ఎంపీటీసీలు అందోలు 21 10 పుల్కల్ 25 15 అల్లాదుర్గం 21 13 రేగోడ్ 19 10 రాయికోడ్ 25 12 మునిపల్లి 25 10 టేక్మాల్ 18 10 ప్రతి నెలా ఇవ్వాలి గతంలో ఉన్న వేతనాన్ని ప్రభుత్వం ఐదు వేల రూపాయలకు పెంచినందుకు సంతోషం. నెలనెలా పంపిణీ చేయకపోవడం ఇబ్బందిగా ఉంది. గౌరవ వేతనాన్ని ప్రతి నెలా చెల్లిస్తే గ్రామాల్లో సర్పంచ్‌లు చురుకుగా విధులు నిర్వర్తించడానికి ఆసక్తి చూపుతారు. - లక్ష్మి, రాంసానిపల్లి సర్పంచ్ పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి 10 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయడంలో ఎంపీటీసీల పాత్ర ఎంతగానో ఉంది. ఎంపీటీసీల వేతనాలను ప్రతి నెలా చెల్లించాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి. - రమేశ్‌గౌడ్, డాకూరు ఎంపీటీసీ నిధులు రాగానే చెల్లిస్తాం సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు గౌరవ వేతనాలకు సంబంధించిన నిధులు విడుదల కావాల్సి ఉంది. నిధులు రాగానే ప్రజాప్రతినిధులకు అందజేస్తాం. ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ల సకాలంలో విడుదలయ్యేలా చూస్తాం. - కరుణశీల, అందోలు ఎంపీడీఓ -
కట్టేసి దోచేశారు!
జోగిపేట: దుండగులు టైరు పంక్చర్ దుకాణదారుడిని కట్టేసి సొత్తు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి అందోలు మండలం రాంసానిపల్లి జాతీయ రహదారిపై జరిగింది. రాంసానిపల్లికి చెందిన సార లక్ష్మీనారాయణ ప్రధాన రహదారిపై టైర్ల పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఒంటరిగా అక్కడే గుడిసె వేసుకొని ఉంటున్నాడు. ఇది గమనించిన ముగ్గురు దుండగులు మంగళవారం అర్ధరాత్రి లక్ష్మీనారాయణ నోరు మూసి పక్కనే ఉన్న పొలాల్లోకి ఎత్తుకెళ్లారు. ఆపై కాళ్లు, చేతులు కట్టేసి అతడి వద్ద ఉన్న 11 తులాల వెండి గొలుసు, ఉంగరం, గుడిసె తాళం చెవి లాక్కున్నారు. అనంతరం గుడిసెలోకి ప్రవేశించి రూ.2 వేలు, పెట్రోలు, గడియారం ఎత్తుకెళ్లారు. తర్వాత లక్ష్మీనారాయణ గ్రామపెద్దలకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. ఘటనపై కేసు నమోదైంది.