జోగిపేటలోని ఇందిరానగర్ కాలనీ వద్ద మండప నిర్మాణం
- నేటి నుంచి వినాయక నవరాత్రోత్సవాలు
జోగిపేట: వినాయక నవరాత్రోత్సవాలకు మండపాలను సిద్ధం చేస్తున్నారు. సోమవారం వినాయక చవితి రోజున గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు పూజలు నిర్వహించనున్నారు. జోగిపేటతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడానికి మండపాలను ముస్తాబు చేస్తున్నారు.
మండలంలోని 21 గ్రామాల్లో ఈసారి 200 వరకు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. జోగిపేట పట్టణంలో 40 నుంచి 50 వరకు, అందోలు, డాకూర్ గ్రామాల్లో 10వ వరకు విగ్రహాలు ప్రతిష్ఠించనున్నారు. వర్షాకాలం కావడంతో మండపాలను ప్లాస్టిక్ కవర్లతో నిర్మిస్తున్నారు. స్టేజీని కట్టెలతో నిర్మిస్తున్నారు.
యువకులే ఎక్కువగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ఉత్సాహం చూపుతున్నారు. జోగిపేట పట్టణంలో దేవాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించి పూజలు ప్రారంభిస్తారు.