జోగిపేట రైతు శిక్షణ కేంద్రం వద్ద ఫెన్సింగ్
- ప్రభుత్వ కార్యాలయానికి కంచెలా ఏర్పాటు
జోగిపేట: జోగిపేట నగర పంచాయతీ పరిధిలోని మొక్కలను సంరక్షించేందుకు 500 ట్రీగార్డులను ప్రభుత్వం పంపిణీ చేసింది. అందోలు, జోగిపేట పట్టణాల్లో సుమారు 20 వేల మొక్కల వరకు నాటినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రహరీ లేని మొక్కలను సంరక్షించేందుకుగాను ట్రీగార్డులను ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నాయి.
టీగ్రార్డులను నగర పంచాయతీ ఆవరణ, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ, ఎంపీడీఓ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాత భవనంలోనే నగర పంచాయతీ నిర్వాహణ ఇబ్బందిగా ఉండటంతో పక్కనే ఉన్న పశుసంవర్దక శాఖ ఆసుపత్రి ఆవరణలోని రైతు శిక్షణ కేంద్రంలోకి మార్చేందుకు సంబంధిత అధికారితో పాటు జిల్లా కలెక్టర్ అనుమతి పొందారు.
ఆ నూతన భవనంలోకి వెళ్లే దారిలో మొక్కలను సంరక్షించేందుకు మంజూరైన ట్రీగార్డులను కార్యాలయ కంచెగా మార్చేసారు. కార్యాలయానికి ఇరువైపులా ట్రీగార్డులను కంచెలుగా కట్టడంతో పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రీగార్డులను ఇలా కూడా వాడుకోవచ్చా? అని చర్చించుకోవడం కనిపించింది.
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ ఖర్చుతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉన్నా... ట్రీగార్డులను కంచెగా ఏర్పాటు చేసుకోవడం విమర్శలకు గురవుతున్నారు.