గ్రామపంచాయతీ భవనం
- నిధుల విడుదల్లో సర్కారు జాప్యం
- సకాలంలో అందని వేతనాలు
- ఇబ్బందుల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు
జోగిపేట: అందోలు నియోజకవర్గంలో అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాలున్నాయి. గ్రామ ప్రథమ పౌరుడిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గౌరవ వేతనాలు సకాలంలో చెల్లించకుండా ఆ గౌరవ పరుస్తోంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే సర్పంచ్‌లు, ఎంపీటీసీలను మనస్తాపానికి గురిచేస్తోంది.
ఎంపీటీసీలు, సర్పంచ్‌ల ఒత్తిడి మేరకు గౌరవ వేతనాన్ని రూ.5 వేలకు పెంచింది. గతంలతో ఎంపీటీసీలకు రూ.750 , సర్పంచ్‌లకు రూ.650 నెలసరి గౌరవ వేతనం ఉండగా తెలంగాణ ప్రభత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన తర్వాత 2015 సెప్టెంబర్ వరకే గౌరవ వేతనాలకు సంబంధించి నిధులను విడుదల చేసింది.
2016 ఆగస్టు వరకు చెల్లించాల్సిన 10 నెలల గౌరవ వేతనం విడుదల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సర్పంచ్‌లు, ఎంపీటీసీల రవాణా చార్జీలను చెల్లించడంలేదు. ఇతర సదుపాయాలు కూడా కల్పించడం లేదు. సర్పంచ్‌లు అందుబాటులో లేని గ్రామాల్లో పాలన బాధ్యతలు భుజాన వేసుకునే ఉప సర్పంచ్‌లకు నయాపైసా విదల్చడం లేదు.
మండలం సర్పంచ్‌లు ఎంపీటీసీలు
అందోలు 21 10
పుల్కల్ 25 15
అల్లాదుర్గం 21 13
రేగోడ్ 19 10
రాయికోడ్ 25 12
మునిపల్లి 25 10
టేక్మాల్ 18 10
ప్రతి నెలా ఇవ్వాలి
గతంలో ఉన్న వేతనాన్ని ప్రభుత్వం ఐదు వేల రూపాయలకు పెంచినందుకు సంతోషం. నెలనెలా పంపిణీ చేయకపోవడం ఇబ్బందిగా ఉంది. గౌరవ వేతనాన్ని ప్రతి నెలా చెల్లిస్తే గ్రామాల్లో సర్పంచ్‌లు చురుకుగా విధులు నిర్వర్తించడానికి ఆసక్తి చూపుతారు. - లక్ష్మి, రాంసానిపల్లి సర్పంచ్
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
10 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయడంలో ఎంపీటీసీల పాత్ర ఎంతగానో ఉంది. ఎంపీటీసీల వేతనాలను ప్రతి నెలా చెల్లించాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి. - రమేశ్‌గౌడ్, డాకూరు ఎంపీటీసీ
నిధులు రాగానే చెల్లిస్తాం
సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు గౌరవ వేతనాలకు సంబంధించిన నిధులు విడుదల కావాల్సి ఉంది. నిధులు రాగానే ప్రజాప్రతినిధులకు అందజేస్తాం. ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ల సకాలంలో విడుదలయ్యేలా చూస్తాం. - కరుణశీల, అందోలు ఎంపీడీఓ