ట్రంప్ వీరాభిమాని నక్క తోక తొక్కాడా!
లండన్: ఎవరైనా తాము అభిమానించే వ్యక్తి కోసం ఏదైనా చేసేందుకు వెనుకాడరు. కొందరు ఫ్యాన్స్.. తమ ఫెవరెట్ సెలబ్రిటీ(ఆర్టిస్టులు, క్రికెటర్లు, రాజకీయ నేతలు)ల విజయావకాశాలపై బెట్టింగ్స్ లో పాల్గొంటారు. కొన్నిసార్లు ఉన్న ఆస్తిని కోల్పేయే వాళ్లుంటారు. అదే విధంగా అదృష్టం తలుపుతడితే ఒక్క రోజులోనే కోట్లాది రూపాయలు సొంతం చేసుకుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వీరాభిమాని బెట్టింగ్స్ లో భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. బ్రిటీష్ వ్యాపారవేత్త జాన్ మాపిన్ కొన్ని నెలల కిందట ట్రంప్ అభిమానిగా మారిపోయాడు. గతేడాది జూన్ నుంచి బెట్టింగ్స్ లో మనీ ఇన్వెస్ట్ చేసిన మాపిన్.. ఏకంగా 1,24,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 82.52 లక్షల రూపాయలు) గెలుచుకున్నాడు.
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని ఏకంగా తాను 30 బెట్టింగ్స్ లో డబ్బు పెట్టినట్లు స్థానిక మీడియాకు చెప్పాడు. ఇంగ్లండ్, కార్నివాల్లో కామెలాట్ లో ఆయనకు హోటల్స్ ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ ప్రకటించినప్పటి నుంచీ తాను గాంబ్లింగ్స్ పై ఇంట్రెస్ట్ పెంచుకుని డబ్బు ఖర్చుచేసిననట్లు తెలిపాడు. తాను గతంలో ఏ విషయంలోనూ బెట్టింగ్ పెట్టలేదని, ట్రంప్ గెలుపుపై మాత్రమే తాను బెట్టింగ్స్ లో పాల్గొన్నానని.. లక్కీగా భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్నానని హర్షం వ్యక్తం చేశాడు.
డబ్బులు తనకు అంత ముఖ్యంకాదని, కేవలం అభిమాన నేత ట్రంప్ విజయమే తనకు కిక్ ఇచ్చిందంటున్నాడు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ నెగ్గి నూతన అధ్యాయానికి తెరతీశారు. అమెరికా వాసులు కూడా ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతుండగా.. మరోవైపు బ్రిటన్ వ్యాపారి మాపిన్ మాత్రం తన తలుపుతట్టిన డబ్బు కంటే కూడా ట్రంప్ విజయమే ఆనందాన్ని ఇచ్చిందని అంటున్నాడు.