అభ్యర్థిని మార్చాలని ఆత్మహత్యాయత్నం
వేలూరు: వేలూరు జిల్లా జోలార్‌పేట డీఎంకే అభ్యర్థిని మార్పు చేయాలని కోరుతూ డీఎంకే కార్యకర్తలు ధర్నా, రాస్తారోకోతో పాటు ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశారు. ఆనకట్టు నియోజక అభ్యర్థి నందకుమార్‌ను మార్పు చేయాలని బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు కార్యకర్తలు పలు పోరాటాలు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులను మార్పు చేయాలని కోరుతూ పలు పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వేలూరు జిల్లా జోలార్‌పేట నియోజక వర్గ అభ్యర్థిగా కవితా దండపాణిని ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు వెంటనే అభ్యర్థిని మార్పు చేయించాలని డిమాండ్ చేస్తూ నాట్రంబల్లిలోని డీఎంకే పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆందోన చేశారు.
అనంతరం జాతీయ రహదారిలో రాస్తారోకో చేశారు. జోలార్‌పేట నియోజక వర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా మంత్రి కేసీ వీరమణి ఉన్నందున ఆయనకు దీటుగా స్థానికంగా ఉన్న వారికి డీఎంకేలో అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. వెంటనే కార్యకర్తలు మాజీ మంత్రి దురై మురుగన్, జిల్లా కార్యదర్శి దేవరాజ్‌ను ఖండిస్తూ నినాదాలు చేశారు. వెంటనే యూనియన్ కార్యదర్శి సూర్యకుమార్ ఆందోళన కారులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింప జేశారు.ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ జోలార్‌పేట అభ్యర్థిని మార్పు చేయకుంటే నియోజక వర్గం వ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు నల్ల జెండాలు ఎగుర వేసి నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.