ఆ జూట్ మిల్లును మళ్లీ తెరిచేందుకు కృషిచేస్తాం
సాక్షి, అమరావతి: విశాఖపట్టణం జిల్లాలోని చిట్టివలస జూట్ మిల్లును తెరిపించడానికి కృషి చేస్తామని మంత్రులు అవంతి శ్రీనివాస్, గుమ్మనూరు జయరామ్ ప్రకటించారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ మిల్లు మూతపడి పదేళ్లు అయిందనీ, 2014 ఎన్నికలముందు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమ పార్టీ అధికారంలోకి వస్తే మిల్లును తెరిపిస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో ఉన్న మిల్లును తెరిపించలేక భీమిలి నుంచి పారిపోయాడని, కార్మికులను నమ్మించి మోసం చేశారన్నారు. వాళ్లలాగా అలవికాని హామీలను తామివ్వమనీ, జూట్ మిల్ను తెరిపించడానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తామని, జూట్మిల్ను తిరిగి నడిపేందుకు యాజమాన్యం ముందుకువస్తే.. ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని, ఒకవేళ యాజమాన్యం ముందుకురాకపోతే.. కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయమై జులై 9 తేదీన నిర్ణయం తీసుకుంటామని వారు తెలియజేశారు.