సునంద కేసులో జర్నలిస్టుల విచారణ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసు మిస్టరీని ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు కొందరు జర్నలిస్టులను ప్రశ్నించారు. ఆమె మరణించడానికి ముందుగా కొంతమంది విలేకరులతో మాట్లాడారన్న సమాచారంతో పోలీసులు వారిని విచారించారు. ఐపీఎల్ వివాదం గురించి గానీ, తన భర్త శశిథరూర్‌కు పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్‌తో సంబంధం గురించి గానీ, లేదా ఇతర ముఖ్యమైన విషయాల గురించి విలేకరులకు చెప్పారేమో తెలుసుకునేందుకు సిట్ బృందం గురువారం ముగ్గురు విలేకరులను ప్రశ్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
సునంద గత ఏడాది జనవరి 17న మరణించడానికి ముందుగా తాను ఉంటున్న హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించాలని అనుకున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సిట్ రెండు మూడు రోజుల్లో మరికొంతమంది విలేకరులను ప్రశ్నించే అవకాశముందని, అవసరమైతే పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌ను కూడా విచారిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. సునంద మరణించడానికి రెండువారాల ముందు శశిథరూర్‌తో కలసి గోవాలో ఉన్నప్పుడు పిడికిలి నిండా మాత్రలు మింగి స్పృహతప్పిపోయారని చెప్పిన తేజ్ సరాఫ్ (77) అనే వ్యక్తితోనూ మాట్లాడతామని బస్సీ పేర్కొన్నారు.