వెల్నెస్ కేంద్రం సమయం కుదింపు
ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఔట్ పేషెంట్ (ఓపీ) వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ప్రభుత్వం ప్రారంభించిన వెల్నెస్ కేంద్రం సమయాన్ని కుదించారు. ఇటీవలే ప్రారంభించిన ఈ కేంద్రం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా 12 గంటల పాటు వైద్య సేవలు అందించాల్సి ఉంది. మొదట్లో రెండు మూడు రోజులు 12 గంటలపాటు సేవలు అందించింది. కానీ ఆ తర్వాత సమయాన్ని కుదించారు. ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పరిమితం చేశారు. ఇప్పుడు 8 గంటలే సేవలు అందిస్తోంది. రాత్రి 8 గంటల వరకు సమయం ఉండటం వల్ల విధులు ముగించు కొని ఇంటికి పోయే ఉద్యోగులు వెల్నెస్ కేంద్రానికి వెళ్లడానికి అవకాశం ఉండేదని... కానీ ఆఫీసు సమయంలోనే పనిచేస్తే వెల్నెస్ కేంద్రానికి వెళ్లడం కుదరదని అంటున్నారు.
సిబ్బంది కొరత..
వైద్యులు అనాసక్తి వల్లే...
ఓపీతో పాటు రిఫరల్ సేవలు అందించే కీలకమైన వెల్నెస్ కేంద్రం సమయాన్ని కుదించడం వల్ల ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ వెల్నెస్ కేంద్రంలో ఆరుగురు వైద్యులు, ఐదుగురు నర్సులు, మరో 15 మంది పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వీరందరినీ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్నారు. అలాగే ఆయుష్ కేంద్రం కూడా ఉంది. రోజుకు 300 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది సరిపోవడంలేదు. దీనికి తోడు తాజాగా పని గంటలు కూడా తగ్గించడంతో ఇబ్బందులు రెట్టింపయ్యే అవకాశం ఉంది.
కాగా... వైద్యులు, ఇతర సిబ్బంది ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండటానికి ఒప్పుకోవడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకు న్నామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదనపు సిబ్బందిని నియ మించుకోవాలంటే ఆర్థిక సమస్యలు న్నాయని ఒక వైద్యాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.