సాక్షిపై ఆంక్షలకు వ్యతిరేకంగా ధర్నాలు
విజయవాడ: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఏపీలో పలు ప్రాంతాల్లో శనివారం జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. అనంతరం టీవీ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ డీఆర్వో నూర్ బాషా ఖాసిమ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు రామకృష్ణ, సురేష్, బ్రహ్మం, మీసాల శ్రీనివాసులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రింట్, ఎలక్ట్రానిక్ పాత్రికేయుల ధర్నా నిర్వహించారు. వీరికి వైఎస్సార్సీపీ, లోక్‌సత్తా, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విశాఖ జిల్లా చోడవరంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా చేశారు. సాక్షి టీవీతోపాటు నిలిపివేసిన ఇతర టీవీ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని, మీడియా స్వేచ్ఛను కాలరాయొద్దంటూ కోరుతూ నాయకులు తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.