సిరా శాసనం
అక్షర స్ఫూర్తికి మరణం లేదు! కరువానాకు మళ్లీ మళ్లీ జననం ఉంది! బెదిరించాలనుకున్నారు.. భయపెట్టాలనుకున్నారు.. వణికించాలనుకున్నారు! ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క సిరా కూడా తొణకలేదు! ఆమెను చూసి శాసనం ఎంతగా భయపడిందంటే.. ఆమె స్ఫూర్తిని అదిలించలేక.. కలాన్ని ఆపలేక ఆమె శ్వాసనే ఆపేశారు! కాని ఆ సిరా ఇంకా శ్వాసిస్తూనే ఉంటుంది సిరా శాసనం వ్యవస్థను కదిలిస్తూనే ఉంటుంది!
డాఫ్నే కరువానా గలిజియా
లైఫ్ స్టయిల్ మంత్లీ మ్యాగజైన్ టేస్ట్ అండ్ ఫ్లెయిర్‌కు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు చనిపోయే వరకు.
కుటుంబం
1985లో పీటర్ కారువానా గలిజియాను పెళ్లి చేసుకుంది డఫ్నే కరువానా. మోస్టా పట్టణానికి దగ్గర్లో ఉన్న బిద్నిజా అనే హామ్లెట్ ఆమె నివాసం. మాథ్యు, ఆండ్య్రూ, పాల్.. ముగ్గురు పిల్లలు. పెద్దకొడుకు మాథ్యు కూడా జర్నలిస్టే. బాంబుపేలిన శబ్దం విని ముందుగా ఇంట్లోంచి బయటకు పరుగెత్తింది, ప్రమాదస్థలానికి వెళ్లిందీ మాథ్యూనే. ‘‘వెళ్లి చూస్తే చుట్టూ అమ్మ శరీరభాగాలు చెల్లాచెదురుగా. 2016 నుంచి సాగుతున్న ఈ కారు బాంబు పేలుళ్లలో అమ్మది ఆరోది. ఇలాంటి ఘాతుకాల్లో నాలుగోది’ అని తన ఫేస్బుక్లో రాసుకున్నాడు మాథ్యూ.
రాజ్యం చాలా బలమైనది. తనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లను, వ్యతిరేకంగా మట్లాడేవాళ్లను, తనకు నచ్చని వాళ్లను అడ్రస్ లేకుండా చేయగలదు. పవర్‌కున్న పొగరు అది. అందుకే ఎప్పుడో షోయబుల్లా ఖాన్.. మొన్న గౌరీ లంకేశ్ ఆ పొగరుకు నేలకొరిగారు. తాజాగా మాల్టా అనే చిన్న దేశంలో ‘డఫ్నే అన్నే కరువానా గలిజియా’ ఛిద్రమైంది. ప్రభుత్వ అవినీతిని, ప్రజాకంటక పాలనను కలంతో ఎండగట్టిన పాపానికి!
ఆ రోజు
అక్టోబర్ 16.. సోమవారం మధ్యాహ్నం.. బిద్నిజాలోని తనింట్లో కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకుంటోంది. ‘రన్నింగ్ కామెంటరీ’ అనే తన బ్లాగ్‌లో మరో హార్డ్– హిట్టింగ్ పోస్ట్‌ను పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. మాల్టా ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ పాలనాయాంత్రాంగంలోని ముఖ్య అధికారి కేథ్ స్కెంబ్రీ ఆమె సబ్జెక్ట్. స్కెంబ్రీ అవినీతి, అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తూ తీవ్రపదజాలంతో రాస్తోంది కరువానా.
""There are crooks everywhere you look now. The situation is desperate ( అన్ని చోట్లా దుర్మార్గులే.. తెగించి బతకాల్సిన పరిస్థితి)’’ అని చివరి వాక్యం పూర్తిచేసి పోస్ట్ చేసింది 53 ఏళ్ల కరువానా. వెంటనే బయటకు వచ్చి ఇంటి ముందున్న అద్దెకారు ఎక్కి పక్కనే ఉన్న మోస్టా టౌన్‌కు బయలుదేరింది. 80 మీటర్లన్నా ప్రయాణించిందో లేదో డిటోనేటర్ విస్ఫోటనమంత ధ్వని వినిపించింది.
తర్వాత కారులోంచి బాంబు పేలిన శబ్దం. కరువానా ఉన్న కారు రోడ్డు మీద నుంచి అదుపు తప్పి పొల్లాల్లో పడిపోయింది. ఆమె తునాతునకలైంది! రాజ్యం నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజెప్తున్నందుకో.. నిజాయితీగా తన వృత్తికి కట్టుబడి ఉన్నందుకో.. శిక్షగా కరువానా ప్రాణాలు తీసుకున్నారు. ఈ పాతకానికి ఒడిగట్టిందెవరో తెలయదు ఇప్పటికీ! ఆమె కలంగాటు పడ్డవాళ్లు మిన్నకున్నారు.. ఆమె పెన్ పెయిన్ అర్థమైన ప్రపంచం నివ్వెరపోయింది! డాఫ్నే కరువానా గలిజియా... లోకం మెచ్చిన జర్నలిస్ట్.. ఈ కాలానికి అవసరమైన, దుర్మార్గపాలకులను హడలెత్తించే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్!
పరిచయం
కరువానా పుట్టింది మాల్టాలోని స్లీమాలో. డేట్ ఆఫ్ బర్త్ .. 26 ఆగస్ట్, 1964. మైఖేల్ ఆల్ఫ్రెడ్ వెల్లా, రోజ్ మేరీ వెల్లా ఆమె తల్లిదండ్రులు. డోరతీ కాన్వెంట్లో పాఠశాల విద్య, బిర్కిర్కరాలోని సెయింట్ అలోసిస్ కాలేజ్‌లో కళాశాల విద్యను పూర్తిచేసి యూనివర్శిటీ ఆఫ్ మాల్టా నుంచి ఆర్కియాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. పోరాటపటిమ ఆమె నైజం. స్టూడెంట్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేది. పద్దెనిమిదో యేట మాల్టాలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా సాగిన ఉద్యమంలో పాల్గొంది. ప్రభుత్వ ఆగ్రహానికి గురై అరెస్ట్ అయింది. కరువానాను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారి తర్వాత కాలంలో మాల్టా పార్లమెంట్‌కు స్పీకర్ అయ్యాడు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వాళ్లు ఉన్నత పదవులను అధిష్టించడం పట్ల హతాశురాలైంది కరువానా. అలాంటి వాళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్న ‘మాల్టీస్ లేబర్ పారీ’్టని దుయ్యబట్టింది. పార్టీ అధిపతి డామ్ మింటోఫ్ దేశాధిపతి కావడాన్ని ‘డామ్ మింటాఫ్.. మాల్టా దౌర్భాగ్యం.. ఆయన పాలనలో మాల్టా నాశనమే’ అంటూ పబ్లిగ్గా విమర్శించిన సాహసి ఆమె.
సండే టైమ్స్ ఆఫ్ మాల్టాతో..
1987లో జర్నలిజంలోకి అడుగుపెట్టాలని నిశ్చయించుకుంది, నిర్ణయం తీసుకుంది కరువానా. ది సండే టైమ్స్ ఆఫ్ మాల్టాలో రిపోర్టర్‌గా చేరింది. 1990 నుంచి సమకాలీన రాజకీయాలపై కాలమ్ రాయడం ప్రారంభించింది. 1992లో ది మాల్టా ఇండిపెండెంట్‌కు అసోసియేట్ ఎడిటర్ అయింది. నాటి నుంచి ఆమె చివరి శ్వాస వరకూ ఆ పత్రికకు ప్రతి ఆదివారం తన ప్రత్యేకమైన కాలమ్‌ను రాస్తూనే ఉంది.
అంతేకాదు ఆ పత్రిక తరపున వెలువడే లైఫ్ స్టయిల్ మంత్లీ మ్యాగజైన్ టేస్ట్ అండ్ ఫ్లెయిర్‌కు ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించింది చనిపోయే వరకు. సూటిగా, స్పష్టంగా రాయడం ఆమె శైలి. ఆ కలానికి జంకు లేదు. నిర్భయంగా నిజాన్ని కక్కడమే తెలుసు. పాళీ కూడా భయపడేదేమో అన్నట్లుంటుంది ఆమె అక్షరాల పదును. అంత శక్తివంతమైంది ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం.
రన్నింగ్ కామెంటరీ
2008లో ‘రన్నింగ్ కామెంటరీ’ అనే బ్లాగ్ స్టార్ట్ చేసి తన ఎలక్ట్రానిక్ కీ బోర్డ్కూ వాడి పెంచింది. రాజకీయాల్లోని అవినీతే కాదు, వాటితో అంటకాగుతున్న సమాజంలోని అన్ని రంగాల అసలు రంగునూ బ్లాగ్‌లో చూపించసాగింది. ప్రతిరోజు నాలుగు లక్షల పైనే వ్యూస్ ఉండేవి ఆమె బ్లాగ్‌కి. మాల్టాలోని వార్తపత్రికలన్నిటి సర్క్యులేషన్‌ను కలిపినా అంత ఉండదు. అంత పాపులర్ బ్లాగ్ అది.
కలంతో సాము
కరువానా తన ప్రతి పరిశోధనకు బెదిరింపు, దాడులను ప్రతిఫలంగా పొందింది. ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమంతా కలంతో సామే. అయినా ఏ రోజూ వెరవలేదు.. వెనక్కి వెళ్లలేదు. 1996లో ఆమె ఇంటికి నిప్పు పెట్టారు. కరువానా పెంపుడు కుక్కను చంపి ఆమె గుమ్మంలో పడేసి వెళ్లారు. ఆ భయంతోనైనా తన రాతలను ఆపేస్తుందని ఆ ఆగడాలు సృష్టించిన వాళ్ల ఆశ.
భయమనే జీన్ లేని కరువానా జరిగిన విషాదాలను మనసులో మూల దాచి.. పరిశీలనను విస్తృతం చేసింది. అహం దెబ్బతిన్న ఆగంతకులు ఆమె కారు అనుకొని పక్కింటి వాళ్ల కారు తగలబెట్టారు. తన కుటుంబం, తన చుట్టుపక్కల వాళ్ల రక్షణ పట్ల జాగ్రత్త తీసుకోవాలనుకుంది కాని చేస్తున్న పనిని ఆపేయాలని మాత్రం అనుకోలేదు. కొత్త వార్త రాసినప్పుడల్లా దాడులు జరిగేవి. దాంతో వాస్తవ పరిశోధనను మరింత ముమ్మరం చేసేది.
దాడులు కూడా నిత్యకృత్యం అయ్యాయి. ఏ రోజైనా కరువానా ఇంట్లో వాళ్లు, ఆ చుట్టుపక్కల వాళ్లు, వాళ్ల పెంపుడు జంతువులు, వస్తువులు అన్నీ సవ్యంగా ఉన్నాయి, అందరూ క్షేమంగా ఇల్లు చేరారు అంటే ఆమె కుటుంబం ఆశ్చర్యపోయేదట ఆ వింతకు. ఏ రోజైనా తమ ముఖ ద్వారానికి వేలాడుతూ బెదిరింపు లేఖలు, బ్లాగ్‌లో త్రెటినింగ్ కామెంట్స్, బ్లాక్‌మెయిలింగ్ మెయిల్స్, మెస్సేజెస్ లేకుంటే, రాకుంటే తన పనిలో నిజాయితీ తప్పిందా ఏంటీ అని ఆత్మవిమర్శ చేసుకునేదట కరువానా.
న్యాయపోరాటాలు..
కరువానా రాస్తున్న ‘రన్నింగ్ కామెంటరీ’ ఎంత పాపులరో అంత కాంట్రావర్సీ కూడా. అందులో ఎన్ని సంచలనాలో.. అన్ని వివాదాలు. కరువానా చనిపోయే నాటికి కరువానా మీద 42 లీగల్ సూట్స్ ఉన్నాయి. పరువు నష్టం దావా కింద యాభైవేల యూరోల ఫైన్ వేశారు. ఆమె ఆస్తినంతా అమ్మినా రాబట్టుకోలేనంత మొత్తం అది. ఫైల్ చేసింది కూడా ఎవరో కాదు సాక్షాత్తు మాల్టా ఆర్థిక శాఖా మంత్రి, లేబర్ పార్టీ డిప్యుటీ లీడర్ క్రిస్ కర్డోనా, ఈయూ ప్రెసిడెన్సీ పాలిసీ ఆఫీసర్ జోసెఫ్ జెరాడా.
‘మెజిస్ట్రేట్ కన్సులో’ స్కెర్రీ హెర్రెరాను తన బ్లాగ్‌లో విమర్శించినందుకు ఈ దావా వేశారు. అయితే 2011లో కేస్ విత్‌డ్రా అయింది. అది పరిష్కారం అయిందో లేదో ఇంకో విపత్తు కాచుకుంది. 2013, మాల్టా ఎన్నికలప్పుడు పోలింగ్ కంటే ముందురోజు ప్రధాని అభ్యర్థి.. జోసెఫ్ మస్కట్‌కు వ్యతిరేకంగా ఉన్న వీడియోలను తన బ్లాగ్‌లో పోస్ట్ చేసినందుకు కరువానాను అరెస్ట్ చేశారు.
పోలింగ్ అయ్యేంత వరకు నిర్బంధించి తర్వాత విడుదల చేశారు. ఈసారి కాచుకునే అవకాశం తను తీసుకుంది. 2017, జనవరిలో ఫైనాన్స్ మినిస్టర్ క్రిస్ కార్డోనా ప్రభుత్వ పని మీద జర్మనీ వెళ్లి అక్కడి బ్రోతల్ హౌజ్‌లో కాలక్షేపం చేశాడనే బాంబును పేల్చింది..సాక్ష్యాలను చూపెట్టింది తన బ్లాగ్‌లో.
పనామా పేపర్స్..
ప్రపంచమంతా ఉలిక్కిపడ్డ పేరు పనామా పేపర్స్. వాటిని బయటపెట్టింది ఈ బ్రేవ్ జర్నోనే. ఆమె పెద్ద కొడుకు మాథ్యు సభ్యుడిగా ఉన్న ఐసిఐజె(ఇంటర్నేషనల్ కన్సోర్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్) లింక్ ద్వారా లేబర్ పార్టీ మంత్రి కొనార్డ్ మిజి, కేత్ స్కెంబ్రీకి పనామా కంపెనీలతో లావాదేవీలు, సంబంధాలు ఉన్నాయని తెలుసుకుంది.
పనామా పేపర్స్లీక్ కన్నా ముందే అంటే 2016, ఫిబ్రవరి 22న తన బ్లాగ్‌లో మిజీకి పనామాతో, న్యూజిలాండ్‌తో కనెక్షన్స్ ఉన్నాయని హింట్ ఇచ్చింది. దాంతో మిజీ.. న్యూజిలాండ్‌లో రిజిస్టర్ చేసుకున్న తన ఫ్యామిలీ ట్రస్ట్ రోటోరువా గురించి పెదవి విప్పక తప్పలేదు. అంతేకాదు రెండు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 25న స్కెంబ్రీకి కూడా న్యూజిలాండ్‌లో ఒక ట్రస్ట్(పనామా కంపెనీ) ఉందని రన్నింగ్ కామెంటరీలో రాసింది.
ఈ రహస్యాలను బయటపెట్టిన మొదటి జర్నలిస్ట్ కరువానానే. ‘యూరప్‌ను షేపింగ్, షేకింగ్, స్టిరింగ్ చేసిన 28 మందిలో కరువానా ఒకరు. ‘వన్ ఉమన్ వికీలీక్స్’, మాల్టా ప్రభుత్వ లోపాయికారి విధానాలు, అవినీతి మీద యుద్ధం చేస్తున్న క్రుసేడర్’ అని కరువానాను వర్ణించింది పొలిటికో పత్రిక. మాల్టా ప్రధాని జోసెఫ్ మస్కట్ భార్య మిషేల్ మస్కట్‌కూ పనామా కంపెనీ ఉందని 2017లో మరో బాంబేసింది కరువానా. దీంతో జోసెఫ్ మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది.
రెండు వారాల ముందు..
కరువానా మరణానికి రెండు వారాల ముందు తనకు ప్రాణాపాయం ఉందని పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. 2013 వరకు ఆమె ఇంటికి పోలీస్ రక్షణ ఉండేది. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ రక్షణను ఎత్తేసింది. కరువానానా మృతికి కారకులైన వాళ్ల సమాచారం అందిస్తే 20 వేల యూరోలు రివార్డ్ ఇస్తానని ప్రకటించాడు వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అస్సాంజ్.
ఎ క్రౌడ్‌ఫండింగ్ క్యాంపెయిన్ వన్ మిలియన్ యూరోల రివార్డ్‌ను ప్రకటించింది. రాజ్యం తన తప్పును ఎత్తి చూపిన వాడి చావుతో దాన్ని కప్పిపుచ్చుకోవాలను కుంటుంది. కాని కాలం కొత్త కలాలకు ఊపిరి పోసి తప్పును ఎత్తిచూపే స్ఫూర్తి కొనసాగేలా చూస్తుంది. రాజ్యం పొగరును పొడిచే పాళీ ముల్లును తయారు చేస్తుంది.
– సరస్వతి రమ