విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు తగదు
విశాఖపట్నం , నర్సీపట్నం: వాస్తవాలను వెలుగులోకి తెచ్చే విలేకరులపై మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు సరికాదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి రాము పేర్కొన్నారు. సాక్షి పత్రిక విలేకరిపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎమ్‌జే, నర్సీపట్నం ప్రెస్‌క్లబ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ అబిద్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కార్యాలయం పరిపాలన అ«ధికారి పి.రామునాయుడుకు యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
అనంతరం రాము మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలపైన, విలేకరులపైనా ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు దాడులు చేయడం, దూషించడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఏరియా ఆస్పత్రి అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని సాక్షి దినపత్రికలో రాసిన కథనంపై మంత్రి సదరు విలేకరిని దూషించడం ఆయన స్థాయికి తగదన్నారు. ఏరియా ఆస్పత్రిలో జరిగిన కోట్ల అవినీతిని వెలుగులోకి తెచ్చిన సాక్షి విలేకరిని అభినందించాల్సింది పోయి విలేకరిని దూషించడం మంచిది కాదని హితవు పలికారు. వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. పత్రికలు, విలేకరులపై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఇక నుంచైనా మానుకోవాలన్నారు. ఐజేయూ మాజీ కౌన్సిల్ సభ్యుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలపై స్పందించే మంత్రి అయ్యన్నపాత్రుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. తరచూ సభల్లో విలేకరుల పట్ల చులకన భావంతో మాట్లాడటం సరికాదన్నారు. ఈ ఆందోళనలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌బీఎల్ స్వామి, ఏపీఈఎమ్‌జే జిల్లా కన్వీనర్ కిషోర్, ఏపీఈఎమ్‌జే ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మురళి, రాజు, నర్సీపట్నం ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఏడీబాబు, రాజుతో పాటు పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు.
♦ ఎన్నడూలేని విధంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పలు సమస్యలపై గతంలో అనేక ఆందోళనలు నిర్వహించిన సమయాల్లో ఎక్కడా కనిపించని పోలీసులు శుక్రవారం జరిగిన ఆందోళనకు పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనుచిత వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలి
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): నర్సీపట్నం సాక్షి విలేకరిపై మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇటీవల ‘సాక్షి’లో రాసిని ఒక వార్తకు సంబంధించి మంత్రి అయ్యన్న నర్సీపట్నం సాక్షి విలేకరిని దుర్భాషలాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిచాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్న ఒక జర్నలిస్ట్‌ను కించపరిచేలా మాట్లాడడం తగదని ఏపీయూడబ్లు్యజే నగర అధ్యక్షుడు రామచంద్రరావు, ఏపీయూడబ్లు్యజేఎఫ్ అధ్యక్షుడు నారాయణ తదితరులు పేర్కొన్నారు. మంత్రి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కితీసుకొని విలేకరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే జర్నలిస్టుల నుంచి మంత్రి అయ్యన్న వ్యతిరేకత ఎదుర్కోక తప్పదన్నారు.
దళిత విలేకరిని దూషించడం తగదు
నర్సీపట్నం : మంత్రి అయ్యన్నపాత్రుడు దళిత విలేకరిని దూషించడం దారుణమని దళిత సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట వారు విలేకరులతో మాట్లాడారు. మంత్రి అయ్యన్నపాత్రుడు విలేకరులపై పరుష పదజాలం మాట్లాడటం మానుకోవాలన్నారు. మంత్రి సహనం కోల్పోయి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. మంత్రి వ్యాఖ్యలు నిరసిస్తూ శనివారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో దళిత సంఘాలన్నీ హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక నాయకులు చిట్ల చలపతిరావు, ఆరుగొల్లు రాజబాబు, మారితి అప్పలరాజు, నేతల నాగేశ్వరరావు,రాజు, బెల్లాల రాజు తదతరులు పాల్గొన్నారు.
ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్రకమిటీ çసభ్యుడు అప్పారావు డిమాండ్
నర్సీపట్నం : స్థాయి దిగజారి పాత్రికేయులపై దుర్భాషలాడటం మంత్రి అయ్యన్నపాత్రుడికి తగదని ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్రకమిటీ సభ్యులు వి.అప్పారావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు రాసిన సాక్షి విలేకరిపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. మంత్రి అయ్యన్న విలేకరులపై చిందులు వేయడం, పదే పదే దూషించడం తగదన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి పాత్రికేయులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.