పాక్ నుంచి ముగ్గురు దౌత్యవేత్తలు వెనక్కి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని తన హైకమిషన్‌కు చెందిన ముగ్గురు దౌత్యవేత్తలను భారత్ మంగళవారం వెనక్కి పిలిపించింది. వీరి ఫొటోలు, ఇతర వివరాలు పాక్ మీడియాలో రావడం, పాక్ వీరిపై గూఢచర్య అభియోగాలు మోపడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అనురాగ్ సింగ్(ప్రథమ కార్యదర్శి-వాణిజ్యం), విజయ్ కుమార్ వర్మ, మాధవన్ నందకుమార్‌లు పాక్ నుంచి బయల్దేరారు. పలువురు భారత దౌత్యవేత్తలు దౌత్య పనుల పేరుతో తమ దేశంలో ఉగ్రవాద, విద్రోహ చర్యలను సమన్వయం చేస్తున్నారని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించడం తెలిసిందే.
డిప్యూటీ హై కమిషనర్‌ను పిలిచిన పాక్
ఇదిలా ఉండగా భారత దళాలు సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్‌ను పాక్ విదేశాంగ శాఖ పిలిపించుకుని నిరసన తెలిపింది.