‘సూపర్’ వైద్యసీట్లలో తెలంగాణకు అన్యాయం
ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంల్లో జూడాల నిరసన
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ, బ్రాడ్ స్పెషాలిటీ వైద్య సీట్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జూనియర్ డాక్టర్ల(జూడా) సంఘం మండిపడింది. రాష్ట్రంలోని నిమ్స్ సహా వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జూడాలు ఉస్మానియా, గాంధీ, వరంగల్‌లోని ఎంజీఎంలలో సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సూపర్‌స్పెషాలిటీ సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కేలా నిబంధనలున్నాయని రాష్ట్ర జూడాల కన్వీనర్ శ్రీనివాస్ విమర్శించారు. ఉస్మానియాలో నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని సూపర్ వైద్య సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణవారికే కేటాయించాలని డిమాండ్ చేశారు.